నాగవంశీ
సాక్షి, హైదరాబాద్: ఆ బాలుడికి చదువంటే అమితాసక్తి.. కష్టానష్టాలకోర్చి వసతి గృహంలో ఉండి విద్యనభ్యసించాడు. తన కోసం తల్లి పడుతున్న కష్టాన్ని చూసి, ఎంతో శ్రమించి ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 7జీపీఏతో ఉత్తీర్ణత సాధించాడు. అయితే భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ బాలుడికి తల్లి దూరమైంది. ఐదు రోజుల క్రితం తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో అనాథగా మారాడు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని ఉండ్రాజవరం మండలం తాడిపరువు గ్రామానికి చెందిన సత్యశ్రీ, నాగేశ్వర్‌రావు దంపతులు. వీరికి కుమారుడు నాగవంశీ(16). నాగవంశీ చిన్నగా ఉన్నప్పుడే నాగేశ్వర్‌రావు భార్యతో విడాకులు తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో సత్యశ్రీ కొడుకును తీసుకొని జీవనోపాధి కోసం నగరానికి వచ్చి కృష్ణానగర్‌లో అద్దెకు ఉంటోంది. జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ కొడుకును చదివిస్తోంది. అయితే కొడుకుకు ఫీజులు కట్టేందుకు సత్యశ్రీకి భారమైంది. ఇప్పుడు నాగవంశీని ఇంటర్ చదివించలేనేమోనని బెంగపెట్టుకుంది. ఓవైపు భర్త విడాకులు తీసుకోవడం, మరోవైపు స్నేహితుడి చేతిలో మోసపోవడం, ఇంటి అద్దెలు భారంగా మారడం, కొడుకు ఫీజులు బకాయిపడటం... ఆమెను కుంగదీశాయి. దీంతో ఈ నెల 14న సత్యశ్రీ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
తల్లిదండ్రులు ఇద్దరికీ దూరమైన నాగవంశీ అనాథగా మారాడు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. చదివిస్తే ఉజ్వలంగా ప్రకాశించే సత్తా ఉన్న నాగవంశీకి ఇప్పుడు ఓ ఆసరా అవసరమైంది. మరికొద్ది రోజుల్లో ఇంటర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ బాలుడిని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తే... నాగవంశీ జీవితంలో వెలుగులు నింపిన వారవుతారు.
Comments
Please login to add a commentAdd a comment