శైలజ మృతదేహం
కడెం(ఖానాపూర్): నిర్మల్ జిల్లా కడెం మండలం లో ఆర్థిక భారం ఓ రైతు కుటుంబాన్ని మింగేసింది. అప్పుల బాధ తాళలేని భార్యాభర్తలు ఇద్దరూ శుక్రవారం క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకోగా, వారి పాప మహేశ్వరి (11 నెలలు) తల్లి పాలు తాగడంతో ఆ పాలే చిన్నారి పాలిట మృత్యుకోరలయ్యాయి. కడెం మండలంలోని ధర్మాజీపేట్‌కి చెందిన లక్ష్మి – భీమయ్య దంపతులకు నలుగురు ఆడపిల్లలు. పదేళ్ల క్రితం భీమయ్య మరణించడంతో ఒకే ఒక కుమారుడైన భీమేశ్‌పై కుటుంబ భారం పడింది.
భూమిని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ నలుగురు అక్కలకు పెళ్లిళ్లు చేశాడు. దీంతో భీమేశ్‌ను ఆర్థిక భారం వెంటాడింది. రెండేళ్ల క్రితం శైలజతో వివాహం జరిగింది. వీరికి 11 నెలల పాప. అప్పుల బాధతో భార్యాభర్తలిద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబసభ్యులు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భీమేశ్ మృతిచెందగా, శనివారం తల్లిపాలు తాగిన చిన్నారి మహేశ్వరి మృతి చెందింది. చికిత్స పొందుతున్న శైలజ(31) సైతం ఆదివారం చనిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గట్టినేని బాలకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment