
త్వరలో ఎస్సీ, ఎస్టీ నిధి నిబంధనలు
వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి సంబంధించి నిబంధనల రూపకల్పనకు సూచనలు చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ కోరారు. మంగళవారం సచివాలయంలో నిర్వహిం చిన సమీక్షలో సీఎస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల న్నారు. పథకాల అమలు పర్యవేక్షణకు సీఎం చైర్మన్‌గా కౌన్సిల్ ఏర్పడుతుందన్నారు.
పది రోజుల్లోగా డ్రాప్ రూల్స్ సమర్పించాలని అజయ్ మిశ్రా కోరారు. ఈ సందర్భం గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ప్రగతి పద్దులో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల వివరాలు చెప్పారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధిం చి కేంద్రం నుంచి రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు అదనంగా పొందేలా వివిధ శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎస్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రంజీవ్ ఆర్.ఆచార్య, ఎస్‌కే జోషి, రాజేశ్వర్ తివారి, బీపీ ఆచార్య, సురేశ్ చందా తదితరులు పాల్గొన్నారు.