ముగిసిన లక్కీడ్రా..
మద్యం దుకాణాల కోసం పోటీపడ్డ మహిళలు
మొదటి దఫా లెసైన్స్ ఫీజు రూపంలో రూ.104.33 కోట్లు
దరఖాస్తులు రాని వాటికి మరో అవకాశం
జిల్లాలోని మద్యం దుకాణాల కేటారుుంపు కోసం సోమవారం లక్కీ డ్రా నిర్వహించారు. 291 దుకాణాలకు 1,924 దరఖాస్తులు రాగా.. ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ మొదటి లక్కీడ్రా తీసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు వ్యాపారులు ఉత్సాహంగా పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మహిళలు సైతం మద్యం దుకాణాలు దక్కించుకోవడానికి పోటీపడ్డారు.
కరీంనగర్ క్రైం :
జిల్లాలో 304 మద్యం దుకాణాలుండగా.. వీటిలో కరీంనగర్ యూనిట్‌లో 113 మద్యం దుకాణాలు, జగిత్యాల యూనిట్‌లో 102, గోదావరిఖని యూనిట్‌లో 89 దుకాణాన్నాయి. వీటికి ఈ నెల 16న నోటిఫికేషన్ జారీచేయగా.. 21న సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఒక్క దుకాణానికి దరఖాస్తు చేసుకోవడానికి రూ.25 వేలుగా ధర నిర్ణయించారు. 291 దుకాణాలకు 1,924 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 59దుకాణాలకు సింగిల్ టెండర్లు దాఖలు కాగా.. అత్యధికంగా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్న షాప్‌కు 40, మంథనిలోని షాప్ నంబర్ 210కి 38 దరఖాస్తులు వచ్చాయి. గతేడాది 4395 దరఖాస్తులు రాగా.. ఈసారి అందులో సగం కూడా రాలేదు. కరీంనగర్ యూనిట్‌లో పరిధిలో 113 దుకాణాలకుగాను 107 దుకాణాలకు 583 దరఖాస్తులు రాగా.. వీటిలో 28దుకాణాలకు సింగిల్ టెండర్లు వచ్చాయి. జగిత్యాల యూనిట్ పరిధిలో 102దుకాణాలకు 101 దుకాణాలకు 701 దరఖాస్తులు వచ్చాయి. రాయికల్ మండలం ఇటిక్యాల దుకాణానికి ఒక్క దరఖాస్తు రాలేదు. వీటిలో 15 దుకాణాలకు సింగిల్ దరఖాస్తులు వచ్చాయి. గోదావరిఖని యూనిట్‌లో 89దుకాణాలుండగా.. వాటిలో 83దుకాణాలకు 640 దరఖాస్తులు రాగా.. వీటిలో 16 దుకాణాలకు సింగిల్ దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తులు రాని దుకాణాలివే..
జిల్లా వ్యాప్తంగా 304 దుకాణాలకు గాను 291దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. కరీంనగర్ యూనిట్ పరిధిలో జమ్మికుంటలో మూడు, కమలాపూర్‌లో అంబాల, హుజూరాబాద్ మండలం కందుగులపల్లి, హుజూరాబాద్ ఒకదానికి దరఖాస్తులు రాలేదు. జగిత్యాల యూనిట్ పరిధిలో రాయికల్ మండలంలోని ఇటిక్యాల దుకాణానికి, గోదావరిఖని పరిధిలో గోదావరిఖనిలో ఒకటి, గోదావరిఖని-2 టౌన్ పరిధిలో రెండు, పెద్దపల్లిలో రెండు, సుల్తానాబాద్‌లో ఒక దుకాణానికి టెండర్లు దాఖలుకాలేదు. దరఖాస్తులు రాని దుకాణాలకు ఈ నెల 26న మళ్లీ అవకాశముందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
పోటీపడ్డ మహిళలు...
మద్యం దుకాణాలు దక్కించుకోవడానికి మహిళలు సైతం పోటీపడ్డారు. కరీంనగర్ యూనిట్‌లో 19 మంది మహిళలు దరఖాస్తులు చేయగా.. అందులో ఇద్దరు మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. జగిత్యాల యూనిట్ పరిధిలో 16 మంది మహిళలు దరఖాస్తులు చేయగా.. ఇద్దరిని అదృష్టం వరించింది.
భారీ ఏర్పాట్లు
గతేడాది లక్కీడ్రా నిర్వహణ సందర్భంగా ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో దరఖాస్తుదారులు, అధికారులు ఇబ్బందులుపడ్డారు. గతానుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈసారి భారీగా ఏర్పాట్లుచేశారు. ఆయా యూనిట్ల పరిధిలో దరఖాస్తుదారులకు ముందే సమయం నిర్ణయించడంతో ఇబ్బందులు తప్పారుు. దీంతో త్వరగా లక్కీడ్రా పూర్తయింది. మొదట సింగిల్ టెండర్లు ఉన్న వారిని పిలిచి షాపులు కేటాయించారు. అనంతరం రెండు టెండర్లు, మూడు టెండర్లు... ఇలా వరుసగా యూనిట్ ప్రకారం పిలిచి లక్కీడ్రా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ శివకుమార్, ఎక్సైజ్ డీసీ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు హాజరయ్యూరు.
రూ.104.33 కోట్ల ఆదాయం
జిల్లా వ్యాప్తంగా 291 దుకాణాలు దరఖాస్తులు దక్కించుకోవడంతో మొదటి దఫా చెల్లించే లెసైన్స్ రూపంలో ఎక్సైజ్‌శాఖకు రూ.104.33కోట్ల ఆదాయం సమకూరింది. లెసైన్స్ ఫీజులో ఒక వంతు భాగం వ్యాపారులు చెల్లించారు. దీంతో భారీగా ఆదాయం సమకూరింది.