సాక్షి, జీడిమెట్ల : నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాంరెడ్డి నగర్‌లోని స్యూటిక్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అనూహ్యంగా భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో దాదాపు ఐదుగురు సిబ్బందికి మంటలు అంటుకున్నాయి. అయితే, వెంటనే స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి మొత్తం ఎనిమిది అగ్నిమాపక వాహనాల్లో వచ్చిన సిబ్బంది రంగంలోకి దిగి మంటలు అంటుకున్న ఐదుగురుని రక్షించారు. వారిని వెంటనే సమీప ఆస్పత్రి తరలించారు. ఈ ఘటన ధాటికి ఆ ప్రాంతం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల భారీగా పొగలు అలుముకున్నాయి. ఇంకొందరు కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారని సమాచారం. ఈ ప్రమాదంలో పెద్ద మొత్తంలో ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు భయందోళనకు గురయ్యారు.
ఫైర్ కంట్రోల్‌లోకి వచ్చింది
ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బంది అధికారులు స్పందించారు. 'ఫైర్ అంతా కంట్రోల్‌లోకి వచ్చింది. మొత్తం 8 వాహనాలతో కంట్రోల్ చేస్తున్నాం. ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ మాత్రమే చేస్తున్నాం. ఐదుగురుని కాపాడి వారిని ఆస్పత్రికి తరలించాం. ప్రమాదానికి కారణాలపై తర్వాత వివరాలు అందిస్తాం. ప్రస్తుతం ఓ ట్రక్కు మంటలు మాత్రమే అదుపులోకి రావాల్సి ఉంది. అది ఓ అరగంటలో అదుపులోకి వస్తుంది. అందులో హెచ్‌సీఎల్ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, అది పెద్ద ప్రమాదమేమి కాదు' అని వారు తెలిపారు.
ఫార్మాకంపెనీలో లోపాలు
అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న స్యూటిక్ ఫార్మా కంపెనీలో పలు లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రమాదం జరిగితే కనీసం మంటలను నియంత్రించేందుకు కూడా సరిపడా నీరు లేనట్లు స్పష్టమవుతోంది. అందులో పనిచేసే సిబ్బంది భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు కూడా కంపెనీ తీసుకోవడం లేదని ప్రస్తుతం ఘటన చూస్తే తెలుస్తోంది. కెమికల్స్‌ను భద్రపరిచే విషయంలో కూడా కంపెనీ నిర్లక్ష్యంగా ఉందని అక్కడ పరిస్థితులను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment