మెదక్ : మెదక్ జిల్లా సిద్ధిపేట నర్సాపూర్ చౌరస్తా వద్ద గణేష్ ఆయిల్మిల్లులో బుధవారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. మిల్లులోని భద్రత సిబ్బంది వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పివేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. అయితే అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.