ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అగ్ని ప్రమాదం దృశ్యం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆర్టీఏ కేంద్ర కార్యాలయం(పాతభవనం)లో బుధవారం మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. రెండురోజుల క్రితం కూడా స్వల్పంగా మంటలు రావడంతో హైదరాబాద్ జేటీసీ చాంబర్‌తోపాటు అన్ని గదులను ఖాళీ చేశారు. తాజాగా భవనం పైఅంతçస్తులోని రికార్డు రూంలో ఉదయం 9.30 గంటలకు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పేశారు.
ఆరు ఫైరింజన్లతో మంటలార్పేందుకు గంటకుపైగా సమయం పట్టింది. రికార్డురూంలోని ఫైళ్లన్నీ దగ్ధమయ్యాయి. రెండు రోజుల క్రితమే అధికారులు, సిబ్బంది భవనాన్ని ఖాళీ చేయడంతో ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిజాం కాలం నాటి ఈ భవనంలో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని, ఏడాది క్రితమే సిబ్బందిని మరోచోటకు తరలించామని మంత్రి చెప్పారు. రికార్డ్‌రూంలో 40 ఏళ్లకుపైగా భద్రపరిచిన ఫైళ్లు దగ్ధమయ్యాయని, వాటివల్ల ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అన్నిరకాల ఫైళ్లను కంఫ్యూటర్‌లో భద్రపరిచినట్లు మంత్రి పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు, బదిలీలు, ఇతర ఫైళ్లు చాలావరకు కాలిపోయాయన్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే...
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. ప్రమాదంపై జేటీసీ రమేశ్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు మిగతాప్రాంతాల్లో ఆర్టీఏ కార్యాలయాలను పరిశీలించి నివేదిక అందజేస్తుందన్నారు. ఖైరతాబాద్‌లోని ఈ భవనం ఏ మాత్రం సురక్షితం కాదని రోడ్లు, భవనాల శాఖ 10 ఏళ్ల క్రితమే హెచ్చరించింది. భవనంలో కొన్నిచోట్ల పెచ్చులూడాయి. మరికొన్నిచోట్ల గోడలకు పగుళ్లు వచ్చాయి.
గత సంవత్సరం పైకప్పు నుంచి పెద్ద సిమెంట్ దిమ్మె విరిగిపడడంతో ఉద్యోగులు ఆ భవనాన్ని ఖాళీ చేశారు. వర్షాల కారణంగా ఏ సమయంలో కూలుతుందో తెలియని స్థితి నెలకొందని అధికారులు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో నిజాం నవాబు కూతురు నూర్జహాన్ కోసం నాలుగు ఎకరాల్లో ఈ భవనాన్ని కట్టించారు. స్వాతంత్య్రానంతరం ఈ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment