
బంద్‌లో భగ్గుమన్న ఆదిలాబాద్
- ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం
- కేసీఆర్ ఫ్లెక్సీ దహనం చేసిన హిజ్రాలు
ఆదిలాబాద్ క్రైం: నిర్మల్‌ను జిల్లా చేయవద్దని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం ఆదిలాబాద్‌లో చేపట్టిన బంద్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలు ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేయడంతో పోలీసులు సమితి నాయకులను అడ్డుకున్నారు. బంద్‌తో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని, ఫ్లెక్సీని హిజ్రాలు దహనం చేశారు. ఆయా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కేసీఆర్, మంత్రి రామన్న, ఆదిలాబాద్ ఎంపీ గొడాం నగేశ్, బోథ్ ఎమ్మెల్యే బాపురావు ఫ్లెక్సీలను దహనం చేశారు. ఆదిలాబాద్ సంరక్షణ సమితి నాయకులు ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి రిమ్స్‌కు తరలించారు.
జనగామ కోసం చండీయాగం
జనగామ: జనగామ జిల్లా కోసం గురువారం జ్వాలా నరసింహ చండీయాగం నిర్వహించారు. యాగానికి చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట, లింగాలఘనపురం, దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి వంటి ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
రంగారెడ్డి జిల్లాలో బంద్ సంపూర్ణం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని గురువారం ఏడో రోజు బంద్ సంపూర్ణంగా జరిగింది. ముంబై-బెంగుళూరు జాతీయ లింకు రహదారిలో వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఉదయం నుంచి సాయంత్రం వరకు రాస్తారోకో చేశారు.