ఒకే సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే...? | Fire Safety Department Hyderabad Special Story | Sakshi
Sakshi News home page

మంటలార్పే సత్తా ఉందా?

Published Tue, Mar 3 2020 7:46 AM | Last Updated on Tue, Mar 3 2020 7:46 AM

Fire Safety Department Hyderabad Special Story - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ఎండాకాలం..మండేకాలం.. ఎండలే కాదు..అగ్నిప్రమాదాలు కూడా ఎక్కువ జరిగే అవకాశాలుంటాయి. మరి అగ్ని ప్రమాదాలంటే.. మనకు ముందుగా గుర్తొచ్చేది ఫైరింజన్లే.. వెంటనే ఫైర్‌స్టేషన్‌కు ఫోన్‌చేసి పలానా చోట అగ్నిప్రమాదం జరిగిందని చెబితే వారు వెంటనే వచ్చేస్తారనేది మన నమ్మకం. అయితే.. నగరంలో అంత సీన్‌ లేదు. అగ్నిమాపక శాఖ నగరంలో పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.  24 గంటలూ అప్రమత్తంగా ఉండి నగర ప్రజల కోసం శ్రమిస్తున్న ఆగ్రిమాపక శాఖలో సౌకర్యాలు, నిధుల కొరత, సిబ్బంది లేమి ఇలా అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ఇక పనిచేయని ఫోన్లు ప్రజలను పరీక్షిస్తున్నాయి. ఏదేమైనా ఎండాకాలంలో  అగ్నిప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కోటి జనాభాకు ఫైరింజన్లు 35..
గ్రేటర్‌ జనాభా కోటి దాటింది. కానీ ఆగ్నిమాపక శాఖలో గతంలో ఉన్నంత ఫైరింజన్లు మ్రామే ఉన్నాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో కేవలం 16 ఫైర్‌స్టేషన్లు ఉండగా ఇందులో  25 ఫైరింజన్లు ఉన్నాయి.  ఇందులో కొన్ని వినియోగంలో లేని పరిస్థిల్లో ఉన్నాయి. గ్రేటర్‌ పరిధిలో (సిటీని కలుపుకొని) 25 ఫైర్‌ స్టేషన్లుండగా 35 ఫైరింజన్లున్నాయి. కోటి మంది నివాసమున్న మహానగరంలో కేవలం 35 మాత్రమే అగ్నిమాపక యంత్రాలుండటం విస్మయానికి గురిచేస్తుంది.

ఒకే సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే...
రానున్న వేసవి కాలంలో నగరంలో  ఒకే సమయంలో  ఆగ్నిమాపక సంఘటనలు చోటు చేసుకుంటే  అంతే సంగతులు. గతఏడాది ఎగ్జిబిషన్‌లో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. అప్పుడు మంటలను ఆర్పడానికి హైదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 ఫైర్‌స్టేషన్లలో ఉన్న ఫైరింజన్‌లు సరిపొకపోతే రంగారెడ్డి జిల్లా నుంచి మరో ఐదు తెప్పించారు.  నగర చరిత్రలోనే ఇంత ఎక్కువ సంఖ్యలో మంటలు ఆర్పాడానికి 20 ఫైరింజన్లు వినియోగించిని దాఖలాలు లేవు. గతంలో సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌లో జరిగిన ప్రమాదంలో మంటలను ఆర్పడానికి 14 ఫైరింజన్లు, ఖాన్‌ లతీఫ్‌ఖాన్‌ భవనంలో మంటలు ఆర్పాడానికి 11 ఫైరింజన్లు వినియోగించినుట్లు అధికారులు చెబుతున్నారు. 

నీటి సమస్యే ప్రధానం
గత యేడాది ఎగ్జిబిషన్‌లో జరిగిన ప్రమాదంతో ఫైర్‌స్టేషన్ల లొసుగులు బహిర్గతమయ్యాయి. ఫైరింజన్లలో నీళ్లు లేకపోవడం, ఒక వేళ ఉన్నా కేవలం సగం వరకే ఉండటం.. వాహనాలు తుప్పు పట్టి ఉండటం తదితరకారణాలతో మంటలను సరిగా ఆర్పలేకపోయారు.   అత్యధిక అగ్ని మాపక కేంద్రాల్లో నీటి సంపుల్లేవు. అగ్ని ప్రమాదం జరిగితే నీళ్లు లేక ఫైరింజన్‌ కదల్లేని పరిస్థితి. ఉదయం వేళల్లో ఫైర్‌స్టేషన్‌ బోరు నీటితో పాటు వాటర్‌వర్క్స్‌ నుంచి నీరు తీసుకుంటున్నారు.రాత్రివేళలలో వాటర్‌వర్క్స్‌ అధికారులు నీరు ఇవ్వడంలేదు. నగరంలోని అత్యధిక అగ్ని మాపక కేంద్రాలలో నీటి సంపుల్లేవు. వాటర్‌బోర్డు నల్లా నీటిని వినియోగించుకునే అవకాశం లేదు. రిజర్వాయర్ల వద్ద గానీ, చెరువులు, కుంటల వద్ద గానీ నీటిని నింపుకోవాల్సిన పరిస్థితి. రాత్రి వేళల్లో వాటర్‌బోర్డు నీరు కూడా అందదు.  

అద్దె భవనాల్లో  
అగ్నిమాపకకేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తుండటం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.  సొంత భవనాలుంటే అగ్నిమాపక కేంద్రంలో ఉండాల్సిన సౌకర్యాలన్నీ అందుబాటులో వచ్చే అవకాశాలున్నాయి. నగరంలోని అగ్నిమాపక కేంద్రాలు అత్యధికంగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కనీసం నీటి సంపులు కూడా లేవు. 

ఎక్కడా అగ్ని నిరోధక బాంబుల్లేవ్‌
నగరంలోని ఏ అగ్నిమాపక కేంద్రంలోనూ అగ్ని నిరోధక బాంబులు లేవు. ఈ బాంబులు వినియోగిస్తే మంటలను సత్వరమే అదుపులోకి తీసుకురావచ్చు. ధన, ప్రాణ నష్టాన్ని అరికట్టవచ్చు. ఆధునిక సాంకేతికను అన్ని సంస్థలూ అందిపుచ్చుకుంటున్న తరుణంలో అగ్ని నిరోధక బాంబులను అగ్నిమాపక కేంద్రాలు వినియోగించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. వ్యయం పెద్ద సమస్యగా మారింది.  

మేం సన్నద్ధంగా ఉన్నాం  
అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సమాచారం ఎంత త్వరగా అందజేస్తే అంత త్వరగా మంటలను ఆర్పేందుకు అవకాశముంటుంది. అందుకే ప్రజలు వెంటనే 101కు ఫోన్‌ చేయాలి. మంటల తీవ్రత అంచనా వేసి ఇతర స్టేషన్ల నుంచి వాహనాలు అవసరం ఉంటే తెప్పించుకుంటాం. ఆగ్రి ప్రమాదంలో ముందు ఎలాంటి ప్రాణ నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.–  శ్రీనివాస్‌ రెడ్డి,జిల్లా ఫైర్‌ ఆఫీసర్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement