ఇళ్ల మధ్యే ‘బాంబ్’ | Fireworks stores are put between houses | Sakshi
Sakshi News home page

ఇళ్ల మధ్యే ‘బాంబ్’

Published Fri, Oct 10 2014 2:05 AM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM

ఇళ్ల మధ్యే ‘బాంబ్’ - Sakshi

ఇళ్ల మధ్యే ‘బాంబ్’

అనుమతుల్లేకుండా వెలుస్తున్న దుకాణాలు
హోల్‌సేల్ దుకాణాలు, ఇళ్లలో భారీగా అక్రమ నిల్వలు


ఆదిలాబాద్ క్రైం : దీపావళి పండుగ అంటే అందరూ సుఖసంతోషాలతో జరుపుకుంటుంటాం. ముఖ్యంగా అందరి ఇళ్లలోనూ పండుగను పురస్కరించుకుని బాంబుల మోతతో వెలుగులు విరజిమ్మిస్తుంటారు. ఇదే అదునుగా భావించిన పలువురు వ్యా పారులు బాంబుల విక్రయాలతో తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకునేందుకు సన్నద్ధమయ్యా రు. ఇందుకు ప్రజల ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. అనుమతుల్లేకుండానే ఇళ్ల మధ్యే షాపులు ఏర్పాటు చేస్తూ విక్రయాలు జరుపుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు ముఖ్యపట్టణాల్లో టపాసుల జీరో దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టి కోట్లు గడిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మందమర్రి, చెన్నూర్, ఆసిఫాబాద్, లక్సెట్టిపేట, తదితర ప్రాంతాల్లో టపాసుల దుకాణాలకు అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతిస్తారు. ప్రతి ప్రాంతంలో అక్కడి జనాభాను దృష్టిలో పెట్టుకుని దుకాణాలు ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. పలు చోట్ల నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య దుకాణాలు నెలకొల్పిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏటా అధికారుల అనుమతి పొందిన దుకాణాలు 500లకు పైగా వెలుస్తాయి. అనుమతి సమయంలో అన్నీ చూపించిన వ్యాపారులు తీరా దుకాణం ఏర్పాటయ్యాక పాటించాల్సిన నిబంధనలు గాలికొదిలేస్తున్నారు.

అక్రమ నిల్వలు..
జిల్లాలో మంచిర్యాల, చెన్నూరు ప్రాంతంలో తప్ప ఎక్కడా అనుమతి ఉన్న హోల్‌సెల్ దుకాణాలు లేవు. కానీ.. జిల్లాలో చాలా చోట్ల అనుమతులు లేకుండానే పుట్టగొడుగుల్లా హోల్‌సెల్ దుకాణాలు దర్శనమిస్తాయి. సదరు హోల్‌సెల్ దుకాణానికి సంబంధించిన గోడౌన్‌లో, ప్రజల ఇళ్ల మధ్యే యజమానుల ఇళ్లలో టపాసులు నిల్వ చేస్తున్నారు. తాము అధికార పార్టీకి చెందిన వారమని చెప్పుకుంటూ కొంత మంది బడా వ్యాపారులు ఈ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
 
అనుమతులు తప్పనిసరి..
టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు సదరు వ్యాపారులు రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల, మున్సిపాలిటీ అధికారుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. నిబంధనల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేశారా లేదా అన్న అంశాలపై అధికారులు పరిశీలించాలి.
 
నిబంధనలు ఇలా..
* ముందుగా రూ.500 చాలన్ తీసి అగ్నిమాపక శాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది.
* దుకాణానికి సంబంధించిన అన్ని శాఖల అనుమతి పత్రాలతో సంబంధిత తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
* తహశీల్దార్ ఆర్డీవోకు దరఖాస్తులు అందిస్తారు. వాటిని ఆర్డీవో పరిశీలించిన అనంతరం కలెక్టర్‌కు అందజేసి అనుమతి తీసుకుంటారు.
* హోల్‌సెల్ దుకాణం అనుమతి పొందాలంటే ముందుగా రూ. 2500 చాలన్‌తో అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోవాలి.
* ఆ తర్వాత హోల్‌సెల్ దుకాణానికి టపాసులు సరఫరా చేసే ప్రాంతం నుంచి అనుమతి ఉంటుంది.
* జిల్లాలోని హోల్‌సెల్ దుకాణ వ్యాపారులు చెన్నై నుంచి టపాసులు తెచ్చుకుంటారు. అక్కడి అనుమతి పొందేందుకు వివిధ రకాలైన 900 నుంచి 3600 కేజీల టపాసులు భద్రపరిచేందుకు గది అనువైందిగా ఉండాలి.
* పండుగ ముగిశాక కూడా 300 నుంచి 1200 వరకు టపాసులు అందుబాటులో పెట్టుకునేందుకు రూ.4,700 చాలన్ కట్టాల్సి ఉంటుంది. ఆ సంస్థ వారు మళ్లీ ఇక్కడి అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకొని సదరు దుకాణానికి అనుమతి ఇస్తుంది.
 
వ్యాపారులు పాటించాల్సినవి..
* టపాసులు విక్రయించే వ్యాపారులు సైతం పలు జాగ్రత్తలు పాటించాలి. దుకాణాల సమీపంలో ఎవరూ బాణా సంచా పేల్చకుండా చూసుకోవాలి.
* రెండు టపాకాయల దుకాణాల మధ్య కనీసం పది మీటర్ల దూరం ఉండాలి.
* దుకాణంలో ఇసుక నింపిన ఫైల్ బకెట్లు, 200 లీటర్ల నీటితో నింపిన బ్యారెళ్లు సిద్ధంగా ఉంచాలి.
* పరిమితంగా బాణాసంచా నిల్వ చేయాలి. విద్యుత్ తీగలను తనిఖీ చేస్తూ ఉండాలి.
* టపాసులను విక్రయించే దుకాణాలను అగ్ని ప్రమాదాలకు అవకాశం లేని రీతిలో ఐరన్ రేకులతో నిర్మించాలి.
* దుకాణానికి ఉండే విద్యుత్ సరఫరాలో లూజ్ కనెక్షన్లు లేకుండా జాగ్రత్త పడాలి. తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు ప్రమాదకరం.
* పతి దుకాణంలో 5 కిలోల డ్రై కెమికల్ పౌడర్ అందుబాటులో ఉంచాలి.
* దుకాణా పరిసర ప్రాంతాలన్నీ నో స్మోకింగ్ జోన్లుగా ప్రకటించి.. పొగ తాగే వారిపై నిఘా పెట్టాలి.
* 18 ఏళ్లలోపు పిల్లలను దుకాణాల్లో పెట్టుకోకూడదు.
 
అనుమతి లేకుంటే సీజ్ చేస్తాం..
 - శంకర్‌లింగం, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి


 అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తాం. కేవలం ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే విక్రయాలు జరపాలి.
 ఇళ్లలో, హోల్‌సెల్ దుకాణాల్లో టపాసులు నిల్వ ఉంచి విక్రయిస్తే క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుంది. అనుమతులు ఉన్న దుకాణాల్లోని టపాసులు కొనుగోలు చేయాలి. అనుమతులు లేకుండా టపాసులు విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement