టపాసుల దుకాణాల్లో సోదాలు | Fireworks stores searches | Sakshi
Sakshi News home page

టపాసుల దుకాణాల్లో సోదాలు

Published Tue, Oct 21 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

Fireworks stores searches

సాక్షి,సిటీబ్యూరో/అమీర్‌పేట: అధిక ధరలకు టపాసులు విక్రయిస్తున్న షాపులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ ఎస్.గోపాల్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి నగర వ్యాప్తంగా దాడులు చేశారు. మొత్తం 25 కేసులు నమోదు చేశారు.

టపాసులు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు చేశామని ఆ శాఖ నగర అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీనివాసులు తెలిపారు. అమీర్‌పేటలోని విష్ణు ఫైర్స్‌తో పాటు పలు షాపుల్లో టపాసుల డబ్బాలపై సొంతంగా ధరలు వేసి, విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. సుమారు 2 లక్షల విలువైన టపాసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పలు దుకాణాల్లో 2010లో తయారు చేసిన టపాసులకు కొత్త ప్యాకింగ్ వేసి విక్రయించడాన్ని తీవ్రంగా పరిగణించారు. సుమారు 20 లక్షల టపాకాయలు, కాకర్స్‌ను సీజ్ చేసి  25 కేసులు నమోదు చేశారు. ఈ దాడులు వరసగా మూడు రోజుల పాటు సాగనున్నాయి.
 
రైళ్లలో తరలిస్తే కఠిన చర్యలు: జీఎం శ్రీవాస్తవ

రైళ్లలో టపాసులు, బాణాసంచా తరలిస్తే చర్యలు తీసుకుంటామని దక్షిణమధ్య రైల్వే  జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. ఆర్‌పీఎఫ్, ఇతర భద్రత, వాణిజ్య విభాగాలు స్టేషన్‌లలో, రైళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సోమవారం రైల్‌నిలయంలో దీపావళి నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పేలుడు పదార్థాలు రైళ్లలోకి ప్రవేశించకుండా తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. పొగ తాగేవారిని కూడా అనుమతించకూడదని  ఆదేశించారు. భద్రతను దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే సెక్యూరిటీ హెల్ప్‌లైన్ 1322 నంబర్‌కు  సమాచారం అందజేయాలని  జీఎం కోరారు.
 
రహదారులపై నిషేధం

పయాణికులతో రద్దీగా ఉండే రహదారులు, పాఠశాలలు, ఆస్పత్రుల సమీపంలో టపాసులు కాల్చడంపై నిషేధం విధించినట్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ధ్వని కాలుష్యానికి కారణమవుతున్న భారీ శబ్దాన్ని ఉత్పత్తి చేసే టపాసులు వాడొద్దని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. క్రాకర్స్‌కు బదులు సహజ సిద్ధమైన దీపాలతో ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం ఉత్తమమన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement