నిత్యాన్నదాత | First Humanity Founder Sujathullah Story | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదాత

Published Wed, Mar 14 2018 8:46 AM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM

First Humanity Founder Sujathullah Story - Sakshi

నిలోఫర్‌ ఆస్పత్రి వద్ద అల్పాహారం పంపిణీ చేస్తున్న సుజాతుల్లా

అన్నార్థుల ఆకలి తీరుస్తున్నాడు. వారున్న చోటకే వెళ్లి ఆహారంఅందిస్తున్నాడు. నేనున్నానంటూ నిరాశ్రయులు, అనాథలకు భరోసా ఇస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు విద్యార్థి ఎండీ సుజాతుల్లా.  

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3లోని సుల్తాన్‌ ఉల్‌ ఉలూం ఫార్మసీ కళాశాలలో ఫార్మా–డీ చదువుతున్న ఎండీ సుజాతుల్లా(24) సేవా కార్యక్రమాల్లో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సమాజసేవలో మమేకమవుతూ సేవా దృక్పథాన్ని చాటుతున్నాడు. ప్రతిరోజు ఉదయం 2వేల మందికి అల్పాహారం అందజేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఏకంగా ఏడాదిన్నరగా నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ నిత్యాన్నదాతగా మారాడు. ముషీరాబాద్‌కు చెందిన సుజాతుల్లా ఈ కళాశాలలోనే బీ–ఫార్మసీ పూర్తి చేశారు.

మలుపు తిప్పిన సబ్జెక్టు...
సుజాతుల్లా బీ–ఫార్మసీ మూడో సంవత్సరంలో ఒక సబ్జెక్టు తప్పాడు. అందులో పాస్‌ అయితే 10 మందికి భోజనం పెడతానని దేవుడికి మొక్కుకున్నాడు. మొత్తానికి ఆ సబ్జెక్టులో పాస్‌ అయ్యాడు. ఆ తెల్లవారే ఓ హోటల్‌లో పది మందికి భోజనం ప్యాక్‌ చేసుకొని, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద నిరాశ్రయులకు అందించేందుకు వెళ్లాడు. అయితే 50 మంది వరకు వచ్చి మాకు కూడా ఇవ్వవా.. అంటూ అర్థించారు. ఇంతమంది ఆకలితో ఉంటున్నారా? అని ఆయన మనసు కలిచి వేసింది. మరుసటి రోజు కూడా పది అన్నం ప్యాకెట్లు తీసుకెళ్లి అక్కడే పంపిణీ చేశాడు. అప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది.  

‘హ్యూమానిటీ ఫస్ట్‌’ స్థాపన...   
దీంతో యూఎస్‌ఏ, యూకేలలోని బంధుమిత్రులను సంప్రదించాడు సుజా తుల్లా. ‘మేం సహాయం చేస్తాం..’ రోజూ భోజనం పంపిణీ చేయమని వారు ప్రోత్సహించారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సుజాతుల్లా ‘హ్యూమానిటీ ఫస్ట్‌’ ఫౌండేషన్‌ స్థాపించాడు. మొదట వారంలో నాలుగు రోజులు రాత్రిపూట వివిధ ఆస్పత్రుల వద్ద 150 మందికి భోజనం పంపిణీ చేసేవాడు. ఇక గత ఏడాదిన్నర కాలంగా ప్రతిరోజు ఉదయం 2వేల మందికి అల్పాహారం పంపిణీ చేస్తున్నాడు. వానొచ్చినా, వరదొచ్చినా ఈయన సేవా దృక్పథంలో ఏ మాత్రం మార్పు రాలేదు. తన తల్లిదండ్రులు, సుల్తాన్‌ ఉల్‌ ఉలూం ఎడ్యుకేషనల్‌ సొసైటీ గౌరవ కార్యదర్శి జాఫర్‌ జావెద్, ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్‌ అనుపమా కోనేరుల ప్రోత్సాహంతో ఈ సేవలు విజయవంతంగా కొనసాగిస్తున్నానని చెప్పారు సుజాతుల్లా.  

ఇదీ దినచర్య...  
ప్రతిరోజు తెల్లవారుజామునే టిఫిన్‌ బాక్సు ఆటోలో తీసుకొని కోఠిలోని మెటర్నిటీ ఆస్పత్రి, నీలోఫర్‌ ఆస్పత్రుల వద్దకు వెళ్తాడు. 9గంటల వరకు టిఫిన్‌ పంపిణీ చేస్తాడు. అనంతరం కాలేజీకి వెళ్తాడు. అల్పాహారం, భోజనానికి ప్రతిరోజు రూ.3,500 ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement