సాక్షి, హైదరాబాద్: అడిగింది కొండంత.. ఇచ్చింది గోరంత అన్నట్టుగా తెలంగాణకు కేంద్రం ఇచ్చిన జీఎస్టీ (వస్తు సేవల పన్ను) పరిహారం అందరినీ విస్మయపరుస్తోంది. జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం పడింది. నెలకు రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేర ఆదాయం తగ్గింది. ముందు జాగ్రత్తగా రూ.2 వేల కోట్ల పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ చివరి వారంలోనే కేంద్రాన్ని కోరింది. జీఎస్టీతో వచ్చిన ఆదాయ లోటు పూడ్చాలని, ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాధాన్య కార్యక్రమాలకు ఇబ్బంది తలెత్తకుండా ముందుగానే పరిహారం విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేసింది. కానీ కేంద్రం ఇవేవీ పట్టించుకోలేదు. తాజాగా జూలై నెల జీఎస్టీ పరిహారం కింద రూ.7 కోట్లు విదిల్చింది.
ఈ పరిహారాన్ని చూసి ఆర్థిక శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు సైతం ముక్కున వేలేసుకున్నాయి. నిజానికి జూలైలో జీఎస్టీ అమలుతో రాష్ట్ర ఖజానాకు భారీగానే చిల్లు పడింది. పెట్రోలు, మద్యం మినహా జూలైకి ముందు వ్యాట్ ద్వారా రూ.2,126.48 కోట్ల ఆదాయం వస్తే.. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక ఆగస్టు నాటికి ఐజీఎస్టీ సహా రూ.1,413 కోట్లు మాత్రమే వచ్చింది. సెప్టెంబర్‌లో ఇది రూ.1,596 కోట్లకు చేరింది. ఈ రెండు నెలల్లోనే దాదాపు రూ.1,000 కోట్ల మేర గండి పడింది. కానీ.. తొలి నెల పరిహారం కింద కేంద్రం రూ.7 కోట్లు మాత్రమే విడుదల చేయడం గమనార్హం.
జీఎస్టీకి ముందు దాదాపు రూ.8 వేల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల కింద మొత్తం రూ.36 వేల కోట్లు వసూలు చేయాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నిర్ణయించింది. నిర్ధారించుకున్న లక్ష్యం కన్నా కనీసం 20 శాతం పెరుగుదలను ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ అంచనాకు అనుగుణంగానే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పెట్రోల్, లిక్కర్ కాకుండానే రూ.7,751 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ప్రతి నెలా సగటున 2,500 కోట్లు వచ్చాయన్న మాట. కానీ జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో కలిపి రూ.2,729 కోట్లు సమకూరినట్టు తేలింది.
రాష్ట్ర జీఎస్టీ కింద రూ.1,642 కోట్లు, కేంద్ర జీఎస్టీ కింద రూ.1,087 కోట్లు వచ్చాయని పన్నుల శాఖ అధికారులు నిర్ధారించారు. అంటే దాదాపు సగం ఆదాయానికి గండిపడింది. పెట్రో ఉత్పత్తులపై రూ.4,331 కోట్లు వసూలయ్యాయని పన్నుల శాఖ తేల్చింది. వ్యాట్‌ను తగ్గించడం, ఇటీవల కేంద్రం కూడా లీటర్‌కు రూ.2 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో పెట్రో రాబడి తగ్గిపోయిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మద్యం అమ్మకాలపై పన్నులు ఇప్పటివరకు రూ.3,472 కోట్లు వసూలయ్యాయి. మొత్తమ్మీద జీఎస్టీ పరిధిలోనికి రాని ఈ రెండు కేటగిరీల్లో రూ.7,803 కోట్లు ఖజానాకు చేరాయి.
తేలుతున్న జీఎస్టీ లెక్కలు
జీఎస్టీ ద్వారా (ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ కలిపి) రాష్ట్ర ఖజానాకు రూ.2,729 కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పటివరకు అంచనాలకే పరిమితమైన ఈ లెక్కలను ఇటీవలే రాష్ట్ర పన్నుల శాఖ నిర్ధారించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నుంచి ఇప్పటివరకు ఏ పద్దు కింద ఎంత ఆదాయం వచ్చిందన్న వివరాలతోపాటు జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత జూలై, ఆగస్టు నెలల రాబడి లెక్కలపైనా కసరత్తు చేసింది. ఇందులో తేలిన లెక్కలను పరిశీలిస్తే మొత్తంగా పన్ను రాబడిలో గత ఏడాదితో పోలిస్తే 18.13% పెరుగుదల నమోదైనా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రం సగానికి సగం తగ్గింది.
పన్ను ఎగవేతలపై నజర్
పన్ను రాబడి వృద్ధి రేటును పరిశీలిస్తే అన్ని పన్నుల వసూళ్లలో గత ఏడాది కన్నా 18.13 శాతం వృద్ధి నమోదైందని అధికారులు చెబుతున్నారు. అయితే లిక్కర్, పెట్రోల్ కాకుండా ఇది కేవలం 7.7 శాతమే కావడం గమనార్హం. పన్ను రాబడి వృద్ధి ఆశించిన మేర లేకున్నా ఇతర మార్గాలను అన్వేషిస్తున్నామని, లోటుపాట్లను సరిచేసుకోవడంతోపాటు పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక దృష్టి సారించామని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తమ్మీద రాష్ట్ర సర్కారు ఆదాయానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని, జీఎస్టీ వసూళ్లు కొంత పుంజుకుని, కేంద్రం నుంచి రావల్సిన బకాయిలు వస్తే పరిస్థితి మెరుగవుతుందని, ఈ ఏడాది పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని దీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment