నల్లగొండ, న్యూస్‌లైన్: ‘జిల్లాలో జరిగిన వరుస ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయి. మున్సిపాలిటీ, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీస్ శాఖ, ఇతర సిబ్బంది విశేష కృషి చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావడంతో పాటు.. రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించింది.
ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కలెక్టర్ టి.చిరంజీవులు పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో ఏఎస్పీ రమా రాజేశ్వరితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ 86.34శాతం నమోదై రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే తెలంగాణలో ఖమ్మం జిల్లా తర్వాత నల్లగొండ 80.56 శాతం నమోదు చేసి రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ఒకటి, రెండు చోట్ల మినహా మరెక్కడా రీపోలింగ్‌కు ఆస్కారం లేకుండా ఎన్నికలు పూర్తికావడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకోడ్ అమలుచేయడంలో పోలీస్ శాఖ, ఇతర శాఖల అధికారులు నిస్పాక్షిపాతంగా, నిజాయితీగా వ్యవహరించారని చెప్పారు.
తెలంగాణ అవతరణ ఉత్సవాలు...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా ‘నల్లగొండ జిల్లా-తెలంగాణ సంబురాలు’ పేరిట ఆరు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నీలగిరి సంబురాలు పేరుతో నిర్వహించాలని భావించినప్పటికీ మేధావులు, కళాకారులు, మీడియా ప్రతినిధుల నుంచి వచ్చిన సలహా, సూచనల ప్రకారం సంబురాల పేరును మార్చినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు, మండల, పట్టణ కేంద్రాల్లో సంబురాలను ఏవిధంగా నిర్వహించాలనే అంశం మీద శనివారం డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆరు రోజులపాటు జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రధానంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆహ్వానించి ఘనంగా సత్కరిస్తారు. అదే విధంగా జిల్లాలో ప్రఖ్యాతి చెందిన కవులు, కళాకారులు, గాయకులను ప్రత్యేకంగా సత్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. అలాగే నల్లగొండలోని ఎన్‌జీ కాలేజీ మైదానంలో రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ వంటకాలను రుచి చూపించేందుకు ప్రత్యేకంగా ఫుడ్ ఫెస్టివల్, డ్వాక్రా ఉత్పత్తుల మేళా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ జిల్లాలోని వివిధ రంగాల్లో నేపథ్యం ఉన్న కళాకారులను జిల్లాకు ఆహ్వానించి వారిచే తెలంగాణ సంప్రదాయాలు ఇనుమడింపజేసేందుకు నృత్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ వస్త్రధారణ, భారతీయ సంప్రదాయాలను అందరికీ తెలిసే విధంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ టి.చిరంజీవులు తెలిపారు.
నిష్పాక్షికంగా పోలీస్ సేవలు..
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా పోలీస్ శాఖ అత్యంత నిష్పాక్షికంగా, పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వహించినట్టు ఏఎస్పీ రమారాజేశ్వరి తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు మహారాష్ట్ర, కేరళ నుంచి ప్రత్యేక పోలీస్ బలగాల సహకారం కూడా తోడైందని ఆమె చెప్పారు. అలాగే సీఆర్‌పీఎఫ్, ఏపీఎస్పీ, ప్రత్యేక రైల్వే పోలీస్ బలగాలు, ఫోరోనిక్స్ నిపుణులు, విజిలెన్స్ బృందాలు అహర్నిశలు శ్రమించాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో రూ.5.99 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్, ఏజేసీ వెంకట్రావు, జెడ్పీ సీఈవో దామోదర్‌రెడ్డి, డీఎస్పీ రామోహ్మన్‌రావు పాల్గొన్నారు.
ఫస్ట్.. సెకండ్
Published Sun, May 25 2014 2:44 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement