► ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం
► రేపటి నుంచి కనుమరుగుకానున్న ఎస్‌బీహెచ్
► రెండింటిలో ఖాతా ఉంటే ఒకటే చెల్లుబాటు
► మూడు మాసాల వరకు కొంత వెసులుబాటు
ఆసిఫాబాద్ : ఖాతాదారులకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తో ఇక అనుబంధం తీరనుంది. ఇప్పటివరకు ఎస్‌బీఐతో అనుబంధం కలిగి ఉన్న బ్యాంకులన్నీ ఏప్రిల్ ఒకటి నుంచి ఎస్‌బీఐలో విలీ నం కానున్నాయి. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ uమొదటిపేజీ తరువాయి
ఇండియా అతి పెద్ద బ్యాంకుగా అవతరించనుంది. ఎస్‌బీఐ అభ్యర్థన మేరకు ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈ బ్యాంకు తన పరిధిలోని అనుబంధ బ్యాంకులను ఏప్రిల్ ఒకటి తర్వాత విలీ నం చేసే దిశగా చర్యలు ప్రారంభించింది.
శనివారం నుంచి జిల్లాలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అనే బోర్డులు ఎక్కడా కనిపించవు. ఈ బ్యాంకులన్నీ యథావిధిగా లావాదేవీలు నిర్వహించనున్నప్పటికీ ఎస్‌బీఐ పేరుతో కొనసాగనున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో అత్యధిక బ్రాంచీలు కలిగి ఉన్న ఎస్‌బీఐకి విలీనానికి సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే వచ్చాయి. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో చెస్ట్ బ్రాంచిలున్నాయి. ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బె న, వాంకిడి మండలాల్లోని బ్యాంకులకు ఆసిఫాబాద్ కంట్రోలింగ్ కేంద్రంగా, కాగజ్‌నగర్ నియోజకవర్గంలోని బ్యాంకులకు కాగజ్‌నగర్ బ్యాంకులు కంట్రోలింగ్ కేంద్రంగా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి.
స్థానిక బ్యాంకుల విలీనం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బ్రాంచీలు కలిగి ఖాతాదారులకు సేవలందిస్తున్న ప్రభుత్వ జాతీయ బ్యాంకు. ఈ బ్యాంకు కాలానుగుణంగా స్థానికతను దృష్టిలో పెట్టుకొని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బీఎం), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్(ఎస్‌బీటీసీ), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనూర్‌అండ్‌జైపూర్(ఎస్‌బీబీజే) బ్యాంకులను ఏర్పాటు చేసింది. అయితే దేశవ్యాప్తంగా అతిపెద్ద బ్యాంకుగా అవతరించడంతోపాటు ఎస్‌బీఐ పేరుతోనే చలామణి కావడానికి స్థానిక బ్యాంకులతో విలీనం చేయాలని భావించింది.
ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కేంద్ర శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)తోపాటు కేంద్ర ప్రభుత్వానికి స్థానిక బ్యాంకుల విలీనంపై అప్పీల్ చేసింది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే బ్యాంకుల విలీనానికి ఎస్‌బీఐ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో గత నెల రోజులుగా ఎస్‌బీహెచ్‌లో ఖాతా ఉన్న వ్యక్తులకు ఎస్‌బీఐలో కొత్త ఖాతా తెరిచేందుకు బ్యాంకు అధికారులు అనుమతించడం లేదు. దీంతో బ్యాంకుల విలీనంతో తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తనున్నాయోనన్న ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నాయి.
రేపటి నుంచి ఎస్‌బీఐ పేరుతోనే
దేశవ్యాప్తంగా ఐదు బ్యాంకులను విలీనం చేయాలని భావించిన ఎస్‌బీఐ ఏప్రిల్ ఒకటి నుంచి విలీన ప్రక్రియ ప్రారంభించనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఎస్‌బీహెచ్‌కు 44 బ్రాంచిలు, ఎస్‌బీఐకి 14 బ్రాంచిలు ఉన్నాయి. సుమారు 15లక్షల ఖాతాదారులు ఉన్నారు. బ్యాంకుల విలీనంతో నెట్‌వర్క్ పెరగడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి వినియోగదారులకు సేవలు మెరుగుపడే అవకాశాలున్నాయని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఈ బ్యాంకులన్నీ యథాతథంగా ఉన్నా, నియంత్రణ మాత్రం ఎస్‌బీఐ నుంచి మాత్రమే జరగనుంది.
ఏదైనా ఒకే అకౌంట్..
రెండు బ్యాంకుల విలీనంతో ఒక వినియోగదారుడికి ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే, ఏదైనా ఒకే బ్యాంకు ఖాతా లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొందరు వినియోగదారులకు రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉండగా..రెండింటిలోనూ లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఇక మీదట ఏదైనా ఒకే అకౌంట్ ఉంచుకోవల్సి వస్తుంది. దీంతో రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా వినియోగదారులు లావాదేవీలు జరిపేందుకు ఏదైనా ఒక ఖాతాను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఎంఐసీఆర్ కోడ్ నంబర్ మూడు మాసాల వరకు మాత్రమే పనిచేస్తుంది. తర్వాత కొత్త కోడ్ నంబర్ కేటాయించనున్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు.
ఏప్రిల్ ఒకటి నుంచి విలీనం దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ ఒకే బ్యాంకుగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి విలీన విషయమై అప్పీల్ చేయగా, అంగీకారం వచ్చింది. దీంతో ఏప్రిల్ ఒకటి నుంచి జిల్లాలోని ఎస్‌బీహెచ్ బ్యాంకులన్నీ ఎస్‌బీఐలో విలీనం కానున్నాయి. అయినా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మెరుగైన సేవలందనున్నాయి. – కృష్ణమాచారి, బ్రాంచి మేనేజర్, ఎస్‌బీహెచ్, ఆసిఫాబాద్