ఎంత ఘోరం | Five bodies found on Hyderabad outskirts cops suspect suicide pact | Sakshi
Sakshi News home page

ఎంత ఘోరం

Published Wed, Oct 18 2017 12:38 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Five bodies found on Hyderabad outskirts cops suspect suicide pact  - Sakshi

దీపావళి పండుగకు ముందే ఆ రెండు కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు.. మరో కుటుంబానికి చెందిన ఇద్దరి మరణంతో తీరని విషాదం నెలకొంది. విహారయాత్రకని వెళ్లిన ఆ ఐదుగురు విగతజీవులుగా మారడం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. షేర్‌మార్కెట్‌ వ్యాపారం.. ఆ ఐదుగురి ప్రాణాలమీదకు తెచ్చింది. ఈ సంఘటన మంగళవారం నార్సింగి మండలం కొల్లూరు వద్ద ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డుపై జరిగింది.     

చేవెళ్ల/శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలం మీర్జాగూడ అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డినగర్‌ కాలనీ శివారులో మృతిచెందిన పటోళ్ల ప్రభాకర్‌రెడ్డి(31), మాధవి(27) వర్షిత్‌రెడ్డి(2.5), మృతుడి చిన్నమ్మ లక్ష్మి(42), ఆమె కూతురు సింధు(16)ల మరణాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. చనిపోయిన వారిలో ప్రభాకర్‌రెడ్డి, అతని భార్య మాధవి, కుమారుడు వర్షిత్‌రెడ్డిలు శంకర్‌పల్లి మండలం కొత్తపలి గ్రామానికి చెందిన వారు. ఉద్యోగం.. వ్యాపారంలో భాగంగా చిన్నమ్మ లక్ష్మి వద్దకు వెళ్లిన ప్రభాకర్‌రెడ్డి కుటుంబంతో పాటు చిన్నమ్మ, ఆమె కూతురు కూడా మృతి చెందటంతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది.   

కుటుంబ నేపథ్యం
శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల మహిపాల్‌రెడ్డి, సువర్ణలకు ఇద్దరు కుమారులు ఓ కూతురు ఉన్నారు.  గ్రామంలో వీరికున్న 12 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ మహిపాల్‌రెడ్డి కొడుకులను చదివించాడు. వీరికి రెండు పౌల్ట్రీఫాంలు కూడా ఉన్నాయి. వీటిని  మహిపాల్‌రెడ్డి, అతని చిన్న కొడుకు దయాకర్‌రెడ్డిలు చూసుకుంటున్నారు. పెద్దకొడుకు ప్రభాకర్‌రెడ్డి ఇంటర్‌ పూర్తయిన తర్వాత తన చిన్నమ్మ, చిన్నాన్న అయిన రవీందర్‌రెడ్డి, లక్ష్మీలు ఉండే లింగంపల్లి మండలం నల్లగండ్ల గ్రామానికి వెళ్లాడు. అక్కడే ఉంటే విద్యాభ్యాసం పూర్తిచేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

 2012లో మేడ్చల్‌ జిల్లా డి.పోచంపల్లి గ్రామానికి చెందిన మాధవితో వివాహం జరిగింది. వీరికి రెండున్నర సంవత్సరాల కుమారుడు (హర్షిత్‌) ఉన్నాడు. కుమారుడికి ఇటీవలే పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీరు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలంలో భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నారు. ప్రభాకర్‌రెడ్డి  తాను చేస్తున్న ప్రైవేటు ఉద్యోగం మధ్యలోనే వదిలేసి రియల్‌ ఎస్టేట్, షేర్‌ మార్కెట్‌లోకి దిగాడు. పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసినట్లు బంధువులు తెలిపారు. బంధువులు, సన్నిహితుల వద్ద డబ్బులు తీసుకొని పెట్టుబడులు పెట్టినట్లుగా సమాచారం.  ఈ పెట్టుబడులు పెట్టిన డబ్బులు అప్పులుగా పెరిగిపోవటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఒత్తిడి పెరిగి ఉంటుందని అనుమానం వ్యక్తమవుతుంది.  

పామెనలోనూ విషాదం  
ప్రభాకర్‌రెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియటంతో పామెన గ్రామం కూడా షాక్‌కు గురైంది. మృతుడు ప్రభాకర్‌రెడ్డి తల్లి సువర్ణ, చిన్నమ్మ లక్ష్మిల తల్లిదండ్రులది పామెన గ్రామం కావడంతో ఇక్కడి వారితో ప్రభాకర్‌రెడ్డి కుటుంబానికి మంచి పరిచయాలున్నాయి. మంచి పేరున్న వ్యక్తి కుటుంబం మృత్యువాత పడడాన్ని ఆ గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందరితో మంచిగా ఉండే వ్యక్తికి ఇలా జరిగిందంటే గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు.

వివరాలు సేకరించిన క్లూస్‌ టీం
మణికొండ: ఒకేసారి ఐదుగురు మరణించడంతో సైబరాబాద్‌ క్లూస్‌ టీం ప్రతినిధులు సంఘటన స్థలాల్లో దొరికిన ఆనవాళ్లను సేకరించారు. మహిళల మృతదేహాలను ఉన్నచోట ఎలాంటి వస్తువులు లభించకపోయినా కారులో మాత్రం వారు తాగిన కూల్‌డ్రింక్, నీటి బాటిళ్లు కనిపించాయి. వాటితో పాటు కారు ముందర రోడ్డుపై ఓ కేక్‌ బాక్సును వారు సేకరించారు. వాటితో పాటు కారుపై ఎవరివైనా వేలిముద్రలు ఉన్నాయా అనే కోణంలోనూ ఆనవాళ్లను సేకరించారు. పోలీసు జాగిలాలను రప్పించారు. సంఘటనా స్థలాన్ని సైబరాబాద్‌ సీపీ సందీప్‌శాండిల్లా, మాదాపూర్‌ ఏసీపీ విశ్వనాథ్, ఏసీపీ రమణకుమార్, నార్సింగి సీఐ రమణగౌడ్‌లు సందర్శించి ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకున్నారు. వివరాల సేకరణ అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం బంధువులకు అప్పగించారు.

తరలివచ్చిన జనం..
నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మీర్జాగూడ శివారులో ఐదు మృతదేహాలు లభించాయనే విషయం తెలుసుకొని అటు సంగారెడ్డి, ఇటు గండిపేట మండలాల ప్రజలు సంఘటనా స్థలానికి భారీగా తరలివచ్చారు. దీంతో ఔటర్‌ రింగ్‌రోడ్డు,  సర్వీసు రోడ్డు ప్రజలతో పాటు మీడియా, పోలీసు వాహనాలతో ప్రజలతో కిక్కిరిసింది.


రెండేళ్ల వర్షిత్‌ మృతితో తల్లడిల్లిన బంధువులు..
పటాన్‌చెరు :  కొల్లూరు శివారులో (నార్సింగి పీఎస్‌ పరిధిలో) ఓఆర్‌ఆర్‌ కింద కారులో తండ్రి ప్రభాకర్‌రెడ్డి పక్కన కారులో మృతి చెందిన రెండేళ్ల వర్షిత్‌ను చూసిన ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోయారు. ప్రభాకర్‌రెడ్డి బంధువులు ఆ సన్నివేశాన్ని చూసి రోదించారు. ముఖ్యంగా మహిళా కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. చిన్నారిని చూస్తూ వారు పడుతున్న ఆవేదనతో అక్కడున్న వారి హృదయం ద్రవించిపోయింది. అభం శుభం తెలియని చిన్నారి మృతికి కారణం ఎవరనే ప్రశ్న మానవతావాదులందరినీ వేధించింది. ఒకవేళ తండ్రి ప్రభాకర్‌రెడ్డే తన కుమారుడికి విషం ఇచ్చి ఉంటే అంత దారుణానికి ఆయన ఎందుకు ఒడిగడతారని అక్కడున్న వారు చర్చించుకోవడం కనిపించింది.

చంపడం.. తెచ్చిపడేయడం..  
అమీన్‌పూర్‌ మాత్రమే కాకుండా ఔటర్‌ రింగ్‌రోడ్డు ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్‌లో ఏదో మూల జరిగిన హత్యలకు సంబంధించిన మృతదేహాలను పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ పరిసర ప్రాంతాల్లో దుండగులు తెచ్చిపడేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఓఆర్‌ఆర్‌పై ఓ మహిళ శవం కనిపించింది. అది ప్రమాదమా, హత్య చేసి ఇక్కడ పడేశారా అనేది తెలియరాలేదు. సుల్తాన్‌పూర్‌ గుట్టల్లో ఓ యువకుడిని హత్య చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు సర్వీసు రోడ్డు పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా ఉండడంతో మహానగరంలోని కొందరు తమ నేరాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ ప్రాంతంలో మృత దేహాలను తెచ్చి పడేస్తున్నారని భావిస్తున్నారు.  

భూమి కొనుగోలుతోనే సమస్యంతా...  
మణికొండ: ఐదుగురు మృతుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఓ భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. దీనికోసం కోటిరూపాయలకు పైగా అప్పులు తెచ్చినట్లు సమాచారం. అయితే ఆ భూమి ప్రభుత్వ భూమిగా తేలటంతో తీవ్ర ఇబ్బందులకు గురయినట్లు అతడి మిత్రులు తెలిపారు. షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు, ఇతర అప్పులు పెరిగిపోవడం, బాకీలు తీర్చాలని బంధువులు, స్నేహితులు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు మిత్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

శోకసంద్రంలో పూడూరు
పూడూరు(పరిగి): పూడూరు మండల కేంద్రానికి చెందిన కొండాపురం రవీందర్‌రెడ్డి, లక్ష్మి(40) దంపతులు. వీరు కొన్నేళ్ల క్రితం తమ కుమారుడు దినేష్‌రెడ్డి, కూతురు సింధూజ(16)తో కలిసి సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరువు మండలం బీరంగూడకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రవీందర్‌రెడ్డి రుద్రారంలోని ఐటీడబ్ల్యూ కంపెనీలో ఆపరేటర్‌గా పనిచేస్తూ స్థానికంగా ఇళ్లు నిర్మిస్తూ విక్రయిస్తూ బిల్డర్‌గా పనిచేస్తున్నాడు. కూతురు సింధూజ ఇంటర్‌ చదువుతుంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌రెడ్డి(32) లక్ష్మికి స్వయాన అక్కకొడుకు.

 ఇతను తన భార్య మాధవి(28), కుమారుడు వశిష్ట్‌రెడ్డి(రెండున్నరేళ్లు)తో కలిసి దంపతులు బీరంగూడ సమీపంలోని అశోక్‌నగర్‌లో నివసిస్తున్నాడు. వీరి కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్తుంటారు. ప్రభాకర్‌రెడ్డి షేర్‌ మార్కెట్‌ బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ప్రభాకర్‌రెడ్డి కుటుంబం లక్ష్మి ఇంటికి వచ్చింది. సెలవు కావడంతో డిండి ప్రాజెక్టుకు వెళ్తున్నట్లు చెప్పిన ప్రభాకర్‌రెడ్డి తన పిన్ని లక్ష్మి, సోదరి సింధూజను తీసుకెళ్లి బాబాయి రవీందర్‌రెడ్డి కారులో వెళ్లాడు. సాయంత్రం రవీందర్‌రెడ్డి తన భార్యకు ఫోన్‌ చేయగా డిండి ప్రాజెక్టు నుంచి బయలుదేరినట్లు చెప్పింది. అనంతరం రాత్రి 8గంటలకు ఆయన మరోసారి ఫోన్‌చేయగా నాట్‌రీచబుల్‌ వచ్చింది.

 ఆందోళనకు గురైన రవీందర్‌రెడ్డి కారులో వెళ్లిన మిగతా వారికి ఫోన్‌ చేయగా స్విఛాఫ్‌ సమాధానం వచ్చింది. దీంతో ఆయన ఆందోళనకు గురయ్యాడు. ఆయన అనుమానం వచ్చి వెంటనే 100కు కాల్‌ చేసి విషయం చెప్పాడు. మంగళవారం ఉదయం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిండి ప్రాజెక్టుకు వెళ్తున్నామని కుటుంబీకులకు చెప్పడంతో మొదట రవీందర్‌రెడ్డి ఆ ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి గాలించసాగాడు.  మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా  నార్సింగి ఠాణా పరిధిలోని కొల్లూరు శివారులో గుర్తు తెలియని ఐదుగురి మృతదేహాలు పడి ఉండడంతో పోలీసులు రవీందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన వారిని గుర్తించి బోరుమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement