ఆ ఐదు.. డేంజర్‌ ! | Five Dangerous Air Pollution Places In Greater Hyderabad | Sakshi
Sakshi News home page

ఆ ఐదు.. డేంజర్‌ !

Published Mon, Apr 23 2018 10:36 AM | Last Updated on Mon, Apr 23 2018 10:36 AM

Five Dangerous Air Pollution Places In Greater Hyderabad - Sakshi

మహానగరం వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుంది.గ్రేటర్‌లో 150 డివిజన్లు ఉండగా... ఒకే ఒక్క డివిజన్‌ బంజారాహిల్స్‌లో మాత్రమే మెరుగైన వాయు నాణ్యత ఉంది. ఈ డివిజన్‌ అసలే వాయు కాలుష్యం (డార్క్‌గ్రీన్‌) లేకుండా, పచ్చదనంతో కళకళలాడుతోంది. ఇక ఐదు డివిజన్లు అత్యంత వాయు కాలుష్యం (రెడ్‌ కేటగిరీ), 65 డివిజన్లు తీవ్ర వాయు కాలుష్యం (ఆరెంజ్‌ కేటగిరీ), 60 డివిజన్లు మోస్తరు వాయు కాలుష్యం (ఎల్లో కేటగిరీ), 19 డివిజన్లు తక్కువ వాయు కాలుష్యం (లైట్‌ గ్రీన్‌)లోకొట్టుమిట్టాడుతున్నాయి. నగరంలో పట్టణ పరిపాలనపై అధ్యయనం చేస్తున్న ‘లఖీర్‌’ సంస్థ తాజా అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది.     

సాక్షి, సిటీబ్యూరో  : బేగంపేట్, మోండా మార్కెట్, కేపీహెచ్‌బీ కాలనీ, జీడిమెట్ల, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ డివిజన్లు అత్యంత కాలుష్య కాసారంగా మారినట్లు ఈ సర్వే పేర్కొంది. బేగంపేట్, మోండా మార్కెట్‌లలో ట్రాఫిక్‌ రద్దీ కారణంగా వాహనాల నుంచి వెలువడే కాలుష్యం అధికంగా ఉందని తెలిపింది. ఇక జీడిమెట్ల, కేపీహెచ్‌బీ కాలనీ, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ ప్రాంతాల్లో పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఉద్గారాలతో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఢిల్లీ, చెన్నై, బెంగళూర్‌ నగరాలతో పోలిస్తే గ్రేటర్‌లో వాయు కాలుష్యం తీవ్రత తక్కువేనని ఈ అధ్యయనం తెలిపింది. ఇక వాయు కాలుష్య తీవ్రత అసలే లేని డివిజన్లలో బంజారాహిల్స్‌అగ్రభాగాన నిలవడం విశేషం. హరిత వాతావరణం, పార్కులు అధికంగా ఉన్న డివిజన్లలో పీల్చే గాలి నాణ్యత (ఎయిర్‌ క్వాలిటీ) మెరుగ్గా ఉన్నట్లు ఇది పేర్కొంది. ప్రధానంగా కేబీఆర్‌ పార్క్‌తో బంజారాహిల్స్‌ డివిజన్‌లో వాయుకాలుష్యం గణనీయంగా తగ్గిందంది. గచ్చిబౌలి, తార్నాక తదితర ప్రాంతాల్లోనూ వాయు కాలుష్య తీవ్రత తగ్గడానికి ప్రధాన కారణం.. అక్కడ హరిత వాతావరణం అధికంగా ఉండడమేనంది. 

పీసీబీ ప్రేక్షకపాత్ర...   
పీసీబీ నగరంలో నాలుగు చోట్ల నిరంతరం వాయుకాలుష్య ఉద్గారాలను లెక్కించే అధునాతన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాల్లో మాత్రమే నిరంతరాయంగా ఆన్‌లైన్‌లో వాయు కాలుష్య నాణ్యతను లెక్కిస్తోంది. మరో 21 చోట్ల వాయు కాలుష్యాన్ని సంప్రదాయ పద్ధతుల్లో లెక్కిస్తోంది. అత్యంత కాలుష్యం, మోస్తరు కాలుష్యం ఉన్న ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్‌ చేయడం.. ప్రజలను అప్రమత్తం చేసే విషయంలో పీసీబీ (కాలుష్య నియంత్రణ మండలి) ప్రేక్షకపాత్రకే పరిమితమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మొబైల్‌ యాప్‌ ఏదీ?   
నగరంలో దుమ్ము, ధూళితో పాటు వాయు కాలుష్యం ముక్కుపుటాలను అదరగొడుతోంది. కాలుష్య మేఘాలు సిటీజనుల ఊపిరితిత్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సిటీలోని వివిధ ప్రాంతాల్లో రోజువారీగా నమోదవుతున్న కాలుష్యం వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు మొబైల్‌ యాప్‌ విడుదల చేస్తామని పీసీబీ ఏడాది క్రితం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఈ విషయంలో పురోగతి లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వాయుకాలుష్యం అవధులు దాటడంతో నగరవాసులకు స్వచ్ఛమైన గాలి కరువైంది. 

నగరంలో వాహనాల సంఖ్య 50 లక్షలకు చేరువైంది. ఇందులో కాలం చెల్లిన వాహనాలు సుమారు 15 లక్షలు. వీటి నుంచి వెలువడుతోన్న పొగలో ప్రమాదకర వాయువులున్నాయి. మరోవైపు పరిశ్రమలు వెదజల్లుతోన్న వాయు కాలుష్యంతో సిటీజనులకు స్వచ్ఛమైన ప్రాణవాయువు దూరమవుతోంది.  

సమాచారలేమి...  
హెచ్‌సీయూ, సనత్‌నగర్, పాశమైలారం, జూపార్క్‌ ప్రాంతాల్లో ‘కంటిన్యూయస్‌ యాంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ’ అధునాతన యంత్రాలతో పీసీబీ నిరంతరం వాయుకాలుష్యం నమోదు చేస్తోంది. ఈ యంత్రాలతో గాలిలోని కార్బన్‌డైయాక్సైడ్, కార్బన్‌మోనాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, బెంజిన్, టోలిన్‌ లాంటి కాలుష్య కారకాల మోతాదును నిత్యం లెక్కిస్తోంది. మరో 21 నివాస, వాణిజ్య,పారిశ్రామిక ప్రాంతాల్లో డస్ట్‌ శాంప్లర్‌ లాంటి యంత్రాలతో దుమ్ము, ధూళి ఇతర కాలుష్యాలను లెక్కగడుతోంది. కానీ ఈ సమాచారాన్ని సిటీజనులు తెలుసుకోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే మొబైల్‌ యాప్‌ రూపొందించాలన్న అంశం తెరమీదకు వచ్చింది. పీసీబీ లెక్కగడుతోన్న కాలుష్య మోతాదులను అన్ని వర్గాల ప్రజలు తెలుసుకోవడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఇందుకు మొబైల్‌ యాప్‌ ఒక్కటే ఏకైక పరిష్కారం. కానీ ఈ విషయంలో పీసీబీ నిర్లక్ష్యం సిటీజనులకు శాపంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement