
శంషాబాద్ : జైపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమానానికి పైలట్ చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పింది. జైపూర్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఏషియా ఐ5–1543 విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటలకు దిగాల్సి ఉంది. అయితే, మరికొద్దిసేపట్లో విమానం ల్యాండ్ కానున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్‌కు (ఏటీసీ) సమాచారం అందించారు. ఏటీసీ అనుమతితో ఒకే ఇంజిన్‌తో పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందులో ప్రయాణిస్తున్న 70 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని సాంకేతికలోపంపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.