గేట్లను ఎత్తిస్తున్న డీఈ, ఏఈలు
చర్ల భద్రాద్రి జిల్లా : సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తాలిపేరు ప్రాజెక్ట్‌లోకి వరద నీరు చేరుతోంది. సోమవారం 25 గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేసి 1,72,700 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో పదిహేను రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అప్పటి నుంచి వరద నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. అధిక మొత్తం క్యూసెక్కులలో మాత్రం ఆదివారమే విడుదల చేశారు.
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గతంలో 1.42,000 క్యూసెక్కుల వరకు మాత్రమే వదిలారు. ఆదివారం మాత్రం ప్రాజెక్టుకున్న మొత్తం 25 గేట్లను పూర్తిగా పైకి (16 అడుగులు) ఎత్తి వరద నీటిని వదిలారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 74.00 మీటర్లు. ప్రస్తుతం 73.00 మీటర్లు నీటి మట్టం ఉంది.
పరిస్థితిని ప్రాజెక్ట్ డీఈ జె.తిరుపతి, ఏఈ వెంకటేశ్వరావు పరిశీలిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారమిస్తున్నారు. తాలిపేరు నుంచి విడుదలవుతున్న వరద నీటికి తోడు దిగువనున్న గోదావరికి సైతం వరద నీరు వస్తోంది. తాలిపేరు, గోదావరి నదుల వరద ఉధృతి నేపథ్యంలో ఈ రెండు నదులు కలిసే ప్రాంతంలోని తేగడ, మేడివాయి, కొత్తపల్లి, దండుపేట తదితర గ్రామాల్లోని వరి, పత్తి పంటలు నీట మునిగాయి.
Comments
Please login to add a commentAdd a comment