taliperu project
-
తాలిపేరుకు పోటెత్తిన వరద నీరు
చర్ల భద్రాద్రి జిల్లా : సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తాలిపేరు ప్రాజెక్ట్‌లోకి వరద నీరు చేరుతోంది. సోమవారం 25 గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేసి 1,72,700 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో పదిహేను రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అప్పటి నుంచి వరద నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. అధిక మొత్తం క్యూసెక్కులలో మాత్రం ఆదివారమే విడుదల చేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గతంలో 1.42,000 క్యూసెక్కుల వరకు మాత్రమే వదిలారు. ఆదివారం మాత్రం ప్రాజెక్టుకున్న మొత్తం 25 గేట్లను పూర్తిగా పైకి (16 అడుగులు) ఎత్తి వరద నీటిని వదిలారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 74.00 మీటర్లు. ప్రస్తుతం 73.00 మీటర్లు నీటి మట్టం ఉంది. పరిస్థితిని ప్రాజెక్ట్ డీఈ జె.తిరుపతి, ఏఈ వెంకటేశ్వరావు పరిశీలిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారమిస్తున్నారు. తాలిపేరు నుంచి విడుదలవుతున్న వరద నీటికి తోడు దిగువనున్న గోదావరికి సైతం వరద నీరు వస్తోంది. తాలిపేరు, గోదావరి నదుల వరద ఉధృతి నేపథ్యంలో ఈ రెండు నదులు కలిసే ప్రాంతంలోని తేగడ, మేడివాయి, కొత్తపల్లి, దండుపేట తదితర గ్రామాల్లోని వరి, పత్తి పంటలు నీట మునిగాయి. -
రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వర్షాలు
-
తాలిపేరు.. వరద జోరు
చర్ల : సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో గురువారం సాయంత్రం ప్రాజెక్ట్‌కు చెందిన 25 క్రషర్ గేట్లలో 14 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి ఉంచి 9234 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 74.00 మీటర్లు కాగా, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతి నేపథ్యంలో 72.97 మీటర్ల వద్ద నీటిమట్టాన్ని క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రాజెక్ట్ డీఈ తిరుపతి, జేఈ వెంకటేశ్వరావు ప్రాజెక్ట్ వద్ద ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. -
భద్రాద్రి జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
సాక్షి, భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు సమీపంలోని రోటింత వాగుపై నిర్మించిన లెవల్ చప్టా (కల్వర్టు)ను మావోయిస్టులు పేల్చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు విధించిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం నిరసన దినంగా ప్రకటించాలని మావోయిస్టులు మంగళవారం లేఖను విడుదల చేశారు. ఈ క్రమంలోనే కల్వర్టును ధ్వంసం చేశారు. భారీ మందు పాతర వినియోగించడంతో కల్వర్టు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. -
తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి
► తొమ్మిది క్రషర్ గేట్లను ఎత్తివేసిన అధికారులు ► ఆనందం వ్యక్తం చేస్తున్న ఏజెన్సీ రైతులు చర్ల(భద్రాచలం): ఏజెన్సీ ప్రాంత రైతాంగ కల్పతరువుగా పేరొందిన తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్ జలకళతో ఉట్టిపడుతోంది. నాలుగు రోజుల క్రితమే ప్రాజెక్ట్ మెయింటినెన్స్ పనుల పూర్తి చేసిన అధికారులు గేట్లను దించి సాగునీటి రాక కోసం ఎదురు చూడడం మొదలు పెట్టగా గేట్లు దించిన రోజు నుంచే ప్రాజెక్ట్‌లోకి సాగునీటి రాక ఆరంభమయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంతో పాటు ప్రాజెక్ట్ ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాలోని వాగుల ద్వారా ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండగా ఆదివారం మధ్యాహ్నం వరదనీటి ఉధృతి పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా 73.10 మీటర్లు ఉంచుతూ ఆదివారం మధ్యాహ్నం 25 క్రషర్ గేట్లలో 9 గేట్లను రెండేసి అడుగుల చొప్పున ఎత్తి 11 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాలుగు రోజుల వరకు ప్రాజెక్ట్‌లోకి నీరు వస్తుందో రాదోనని ఆయకట్టు రైతులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో అధికంగా వస్తున్న వరదనీటిని దిగువకు విడుదల చేస్తుండగా ప్రాజెక్ట్ నిండుకుం డలా కళకళలాడుతుంది. ప్రాజెక్ట్‌లోని పూర్తి స్థాయిలో సాగునీరు చేరుకుం దన్న వార్తను తెలుసుకున్న రైతాంగం ఆనందదం వ్యక్తంచేస్తున్నారు. -
తాలిపేరు వద్ద మందుపాతర లభ్యం
చెర్ల : ఖమ్మం జిల్లా చెర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాలుప వద్ద మందుపాతరను పోలీసులు గుర్తించారు. పోలీసులే టార్గెట్‌గా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. బాంబ్ డిస్పోజిల్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది రప్పించి మందు పాతరను నిర్వీర్యం చేశారు. -
తాలిపేరు ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత
చర్ల : ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టు 7 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 9,562 క్యూసెక్కుల నీటిని అధికారులు బయటికి వదిలారు. ప్రాజెక్టులోకి 9,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం లెవెల్ 73.40 మీటర్లు. -
తాలిపేరు ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేత
చర్ల: ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 9 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. 8400 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 73.6 మీటర్లుగా ఉంది. -
తాలిపేరు గేట్లు ఎత్తివేత
చర్ల: ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో మంగళవారం ఉదయం అధికారులు జలాశయం 6 గేట్లను రెండడుగుల మేర ఎత్తి దిగువకు 8,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 73.60 అడుగులు. ప్రస్తుతం ఎగువ నుంచి వరద తగ్గుముఖం పడుతోంది. -
స్వల్పంగా పెరుగుతోన్న గోదావరి
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరికి వరద వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రానికి 27.8 అడుగులకు చేరింది. అర్ధరాత్రి వరకు వరద ఉధతి తగ్గే అవకాశం ఉన్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. కాగా.. తాలిపేరు ప్రాజెక్టుకు 11 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపారు. -
తాలిపేరు జలాశయానికి భారీ వరద
ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండింది. ప్రాజెక్టు 15 గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి దిగువకు 50,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 72.70 అడుగులు కాగా ఇన్‌ఫ్లో 1200 క్యూసెక్కులు. -
తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
చర్ల(ఖమ్మం జిల్లా): చర్ల మండలం పెదమిడిసిలేరు సమీపంలోని తాలిపేరు ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ రాష్ట్రం చత్తీస్‌గడ్‌లో భారీగా వర్షాలు పడుతుండటంతో సుమారు 10 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుకుంటోంది. దీంతో ప్రాజెక్టు 4 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 6 వేల క్యూసెక్కుల నీరును బయటికి వదిలారు. ఎగువన కురుస్తోన్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశముందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
తాలిపేరు ప్రాజెక్టు 9గేట్లు ఎత్తివేత
చర్ల: చత్తీస్‌గడ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 9 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. దాదాపు 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతంలో నీటి మట్టం పెరగనుంది. -
తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
చర్ల : ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా చేరుతోంది. చత్తీస్గడ్ రాష్ట్రం సరిహద్దు ప్రాంతంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదనీరు ఎక్కువగా వస్తోంది. దాంతో గురువారం 17 గేట్లు ఎత్తివేసి 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 74 మీటర్లు కాగా వరద పోటును దృష్టిలో పెట్టుకుని 73.60 మీటర్ల నీటిని నిల్వ ఉంచి మిగిలిన నీటిని కిందికి వదిలివేస్తున్నారు. ప్రాజెక్టు ఇంజనీర్ వెంకటేశ్వరరావు సిబ్బందితో ప్రాజెక్టు వద్దే ఉండి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. -
పూడికతీస్తే నీరేనీరు
సాక్షి, ఖమ్మం: కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టుల్లో పూడికతీతకు మోక్షం కలగనుంది. సిల్ట్ తీసి ఇసుక మైనింగ్ చేసే ప్రతిపాదనపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా జిల్లాలోని కిన్నెరసాని, తాలిపేరు రిజర్వాయర్లలో పూడికతీతపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం మైనింగ్ అధికారులను ఆదేశించింది. ఇదే జరిగితే రిజర్వాయర్ల నిర్మాణం నుంచి పేరుకుపోయిన సిల్ట్ తీయడంతో పాటు ఇసుక రూపంలో ప్రభుత్వానికి ఆదాయం రానుంది. అలాగే ఈ రిజర్వాయర్ల నీటి సామర్థ్యం పెరిగి వీటి పరిధిలో వేలాది ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి. రిజర్వాయర్లలో ఇసుక పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇసుక సిల్ట్‌తో నిండిన రిజర్వాయర్లలో తవ్వకాలకు అనుమతి ఇచ్చే చర్యలకు పూనుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నీటి పారుదల, మైనింగ్ శాఖ అధికారులతో చర్చించిన ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను తేల్చాలని ఆదేశించింది. జిల్లాలోని కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టుకు ప్రతిసారి వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు, ఇసుక కూడా వస్తున్నాయని మైనింగ్ అధికారులు ప్రాథమికంగా ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కాగా, దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని ప్రభుత్వం జిల్లా మైనింగ్ అధికారులను ఆదేశించింది. దీంతో ఈ రిజర్వాయర్ల నిర్మాణ సమయంలో నీటి నిలువ సామర్థ్యం ఎంత..? ప్రస్తుతం ఎంత మేరకు ఇసుక, ఒండ్రు మట్టితో నిండింది.. సిల్ట్ తీస్తే ఏ మేరకు ప్రయోజనం కలుగనుంది..? తదితర అంశాలపై నివేదిక తయారు చేసే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. 10 అడుగులు పెరగనున్న కిన్నెరసాని.. పాల్వంచ మండలంలో కిన్నెరసాని-యానంబైల్ గ్రామాల మధ్య 1974 నవంబర్ 29న బహుళార్ధక ప్రాజెక్టుగా కిన్నెరసాని రిజర్వాయర్‌ను నిర్మించారు. దీని విస్తీర్ణం 2.5 కిలోమీటర్లు కాగా నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు. పాల్వంచ మండలంలోని రాళ్లవాగు, పిక్ డ్యామ్, వరంగల్ జిల్లా పాకాల చెరువు, గుండాల అడవుల నుంచి ఈ రిజర్వాయర్‌లోకి వరద నీరు వస్తుంది. ప్రధానంగా అడవి మార్గం నుంచి వరద వస్తుండడంతో ఇసుకతో పాటు ఒండ్రు మట్టి కూడా భారీగా చేరుతుంది. దీంతో ఏటా నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. 1999 వరకు దీని పర్యవేక్షణ బాధ్యతలను నీటి పారుదల శాఖ చూసేది. ఆ తర్వాత కేటీపీఎస్ అధికారులకు అప్పగించారు. కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి నిత్యం 110 క్యూసెకుల నీరు కేటీపీఎస్, ఎన్ఎండీసీ, నవభారత్ కర్మాగారాలతోపాటు కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. అలాగే ఎడమ, కుడి కాలువ పరిధిలో పది వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. కిన్నెరసాని రిజర్వాయర్ నీట్టి మట్టం తగ్గితే భవిష్యత్‌లో నీటి కొరత ఏర్పడుతుందన్న ఉద్దేశంతో కేటీపీఎస్, నవభారత్ కర్మాగారాలు ప్రత్యామ్నాయ చర్యలపై గతంలోనే దృష్టి సారించాయి. దగ్గరలోని గోదావరి నీటిని ఈ కర్మాగారాలకు తరలించేందకు కే టీపీఎస్ యాజమాన్యం రూ.100 కోట్లతో గోదావరి నుంచి పైపులైన్ నిర్మించుకుంది. నవభారత్ కర్మాగార యాజమాన్యం కూడా సుమారు రూ.20 కోట్లు వెచ్చించి గోదావరి నుంచి 4 క్యూసెక్యుల నీటిని తీసుకొచ్చేందుకు పైపులైన్ల నిర్మాణం పూర్తి చేసింది. అయితే ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు రిజర్వాయర్‌లో సిల్ట్ తీయలేదు. వరదలా నీరు వస్తుండడంతో ఇసుక భారీగా రిజర్వాయర్‌లోకి చేరుతుంది. నీళ్లు తక్కువగా ఉన్నప్పుడే సిల్ట్ తీసేందుకు అనువుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సీల్ట్ తీస్తే 10 అడుగుల మేర నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ తీసే ఇసుకకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం రానుంది. తాలిపేరు ఆయకట్టుకు మహర్దశ.. చర్ల మండలంలోని పెదమిడిసిలేరు సమీపంలో తాలిపేరు ప్రాజెక్టు నిర్మించిన తర్వాత 1986 నుంచి సాగుకు నీరు విడుదల చేస్తున్నారు. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 246.9 అడుగులు. ఈ ప్రాజెక్టులోకి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చింతవాగు, పగిడివాగు, జెర్రిపోతులవాగు, పూసువాగు, బాసవాగుతో పాటు మరో రెండు వాగుల ద్వారా వచ్చే నీరు తాలిపేరు ప్రాజెక్ట్‌లోకి చేరుతుంది. తెలంగాణ భూభాగంలో ఎక్కడా వర్షాలు కురవకున్నా ఛత్తీస్‌గఢ్ అడవిలో ఎక్కడ చిన్నపాటి వర్షం పడినా వరద నీరు వస్తుంది. ఇదంతా ఇసుక, ఒండ్రుమట్టితో ప్రాజెక్టు నిండుతుంది. దీంతో ఈ ప్రాజెక్టు సుమారు ఏడు అడుగుల మేర సిల్ట్‌తో పూడినట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. రిజర్వాయర్ పూడికను తీస్తే నీటి నిల్వ సామర్థ్యంతో పాటు ఆయకట్టు మరో ఐదు వేల ఎకరాలు పెరగనుంది. అలాగే ఆయకట్టు చివరి భూమల వరకు సాగు నీరు అందనుంది.