సాక్షి, ఖమ్మం: కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టుల్లో పూడికతీతకు మోక్షం కలగనుంది. సిల్ట్ తీసి ఇసుక మైనింగ్ చేసే ప్రతిపాదనపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా జిల్లాలోని కిన్నెరసాని, తాలిపేరు రిజర్వాయర్లలో పూడికతీతపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం మైనింగ్ అధికారులను ఆదేశించింది.
ఇదే జరిగితే రిజర్వాయర్ల నిర్మాణం నుంచి పేరుకుపోయిన సిల్ట్ తీయడంతో పాటు ఇసుక రూపంలో ప్రభుత్వానికి ఆదాయం రానుంది. అలాగే ఈ రిజర్వాయర్ల నీటి సామర్థ్యం పెరిగి వీటి పరిధిలో వేలాది ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి.
రిజర్వాయర్లలో ఇసుక పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇసుక సిల్ట్‌తో నిండిన రిజర్వాయర్లలో తవ్వకాలకు అనుమతి ఇచ్చే చర్యలకు పూనుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నీటి పారుదల, మైనింగ్ శాఖ అధికారులతో చర్చించిన ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను తేల్చాలని ఆదేశించింది. జిల్లాలోని కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టుకు ప్రతిసారి వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు, ఇసుక కూడా వస్తున్నాయని మైనింగ్ అధికారులు ప్రాథమికంగా ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.
కాగా, దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని ప్రభుత్వం జిల్లా మైనింగ్ అధికారులను ఆదేశించింది. దీంతో ఈ రిజర్వాయర్ల నిర్మాణ సమయంలో నీటి నిలువ సామర్థ్యం ఎంత..? ప్రస్తుతం ఎంత మేరకు ఇసుక, ఒండ్రు మట్టితో నిండింది.. సిల్ట్ తీస్తే ఏ మేరకు ప్రయోజనం కలుగనుంది..? తదితర అంశాలపై నివేదిక తయారు చేసే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు.
10 అడుగులు పెరగనున్న కిన్నెరసాని..
పాల్వంచ మండలంలో కిన్నెరసాని-యానంబైల్ గ్రామాల మధ్య 1974 నవంబర్ 29న బహుళార్ధక ప్రాజెక్టుగా కిన్నెరసాని రిజర్వాయర్‌ను నిర్మించారు. దీని విస్తీర్ణం 2.5 కిలోమీటర్లు కాగా నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు. పాల్వంచ మండలంలోని రాళ్లవాగు, పిక్ డ్యామ్, వరంగల్ జిల్లా పాకాల చెరువు, గుండాల అడవుల నుంచి ఈ రిజర్వాయర్‌లోకి వరద నీరు వస్తుంది.
ప్రధానంగా అడవి మార్గం నుంచి వరద వస్తుండడంతో ఇసుకతో పాటు ఒండ్రు మట్టి కూడా భారీగా చేరుతుంది. దీంతో ఏటా నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. 1999 వరకు దీని పర్యవేక్షణ బాధ్యతలను నీటి పారుదల శాఖ చూసేది. ఆ తర్వాత కేటీపీఎస్ అధికారులకు అప్పగించారు. కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి నిత్యం 110 క్యూసెకుల నీరు కేటీపీఎస్, ఎన్‌ఎండీసీ, నవభారత్ కర్మాగారాలతోపాటు కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు.
అలాగే ఎడమ, కుడి కాలువ పరిధిలో పది వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. కిన్నెరసాని రిజర్వాయర్ నీట్టి మట్టం తగ్గితే భవిష్యత్‌లో నీటి కొరత ఏర్పడుతుందన్న ఉద్దేశంతో కేటీపీఎస్, నవభారత్ కర్మాగారాలు ప్రత్యామ్నాయ చర్యలపై గతంలోనే దృష్టి సారించాయి. దగ్గరలోని గోదావరి నీటిని ఈ కర్మాగారాలకు తరలించేందకు కే టీపీఎస్ యాజమాన్యం రూ.100 కోట్లతో గోదావరి నుంచి పైపులైన్ నిర్మించుకుంది. నవభారత్ కర్మాగార యాజమాన్యం కూడా సుమారు రూ.20 కోట్లు వెచ్చించి గోదావరి నుంచి 4 క్యూసెక్యుల నీటిని తీసుకొచ్చేందుకు పైపులైన్‌ల నిర్మాణం పూర్తి చేసింది.
అయితే ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు రిజర్వాయర్‌లో సిల్ట్ తీయలేదు. వరదలా నీరు వస్తుండడంతో ఇసుక భారీగా రిజర్వాయర్‌లోకి చేరుతుంది. నీళ్లు తక్కువగా ఉన్నప్పుడే సిల్ట్ తీసేందుకు అనువుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సీల్ట్ తీస్తే 10 అడుగుల మేర నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ తీసే ఇసుకకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం రానుంది.
తాలిపేరు ఆయకట్టుకు మహర్దశ..
చర్ల మండలంలోని పెదమిడిసిలేరు సమీపంలో తాలిపేరు ప్రాజెక్టు నిర్మించిన తర్వాత 1986 నుంచి సాగుకు నీరు విడుదల చేస్తున్నారు. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 246.9 అడుగులు. ఈ ప్రాజెక్టులోకి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చింతవాగు, పగిడివాగు, జెర్రిపోతులవాగు, పూసువాగు, బాసవాగుతో పాటు మరో రెండు వాగుల ద్వారా వచ్చే నీరు తాలిపేరు ప్రాజెక్ట్‌లోకి చేరుతుంది.
తెలంగాణ భూభాగంలో ఎక్కడా వర్షాలు కురవకున్నా ఛత్తీస్‌గఢ్ అడవిలో ఎక్కడ చిన్నపాటి వర్షం పడినా వరద నీరు వస్తుంది. ఇదంతా ఇసుక, ఒండ్రుమట్టితో ప్రాజెక్టు నిండుతుంది. దీంతో ఈ ప్రాజెక్టు సుమారు ఏడు అడుగుల మేర సిల్ట్‌తో పూడినట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. రిజర్వాయర్ పూడికను తీస్తే నీటి నిల్వ సామర్థ్యంతో పాటు ఆయకట్టు మరో ఐదు వేల ఎకరాలు పెరగనుంది. అలాగే ఆయకట్టు చివరి భూమల వరకు సాగు నీరు అందనుంది.
పూడికతీస్తే నీరేనీరు
Published Mon, Aug 11 2014 1:35 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement