తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి
► తొమ్మిది క్రషర్ గేట్లను ఎత్తివేసిన అధికారులు
► ఆనందం వ్యక్తం చేస్తున్న ఏజెన్సీ రైతులు
చర్ల(భద్రాచలం): ఏజెన్సీ ప్రాంత రైతాంగ కల్పతరువుగా పేరొందిన తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్ జలకళతో ఉట్టిపడుతోంది. నాలుగు రోజుల క్రితమే ప్రాజెక్ట్ మెయింటినెన్స్ పనుల పూర్తి చేసిన అధికారులు గేట్లను దించి సాగునీటి రాక కోసం ఎదురు చూడడం మొదలు పెట్టగా గేట్లు దించిన రోజు నుంచే ప్రాజెక్ట్‌లోకి సాగునీటి రాక ఆరంభమయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంతో పాటు ప్రాజెక్ట్ ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాలోని వాగుల ద్వారా ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండగా ఆదివారం మధ్యాహ్నం వరదనీటి ఉధృతి పెరిగింది.
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా 73.10 మీటర్లు ఉంచుతూ ఆదివారం మధ్యాహ్నం 25 క్రషర్ గేట్లలో 9 గేట్లను రెండేసి అడుగుల చొప్పున ఎత్తి 11 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాలుగు రోజుల వరకు ప్రాజెక్ట్‌లోకి నీరు వస్తుందో రాదోనని ఆయకట్టు రైతులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో అధికంగా వస్తున్న వరదనీటిని దిగువకు విడుదల చేస్తుండగా ప్రాజెక్ట్ నిండుకుం డలా కళకళలాడుతుంది. ప్రాజెక్ట్‌లోని పూర్తి స్థాయిలో సాగునీరు చేరుకుం దన్న వార్తను తెలుసుకున్న రైతాంగం ఆనందదం వ్యక్తంచేస్తున్నారు.