ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలి
ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలని, పంటల మార్పిడితో రైతులు అభివృద్ధి చెందవచ్చని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రేటర్ సిటీ పరిధిలో మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం శ్రీహరి, మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే రమేష్, అధికారులు ఉన్నారు.
- పంట మార్పిడితో రైతుల అభివృద్ధి
- మహిళలకు సబ్సిడీపై పాడిగేదెలు
- రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
- పశుసంవర్ధక శాఖ నూతన భవనాల ప్రారంభోత్సం
మామునూరు : రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, అధిక దిగుబడి, లాభాల కోసం రైతులు ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. హన్మకొండ మండలం మామునూరు గ్రామంలో రూ.కోటి 76 లక్షలతో నిర్మించిన ప్రాంతీయ పశుసంవర్ధక శాఖ శిక్షణ కేంద్రం, రూ.2 కోట్లతో కృషి విజ్ఞాన కేంద్ర పరిపాలన భవనం, రైతుల విశ్రాంతి గృహం, రూ.కోటి 28 లక్షలతో పశు విజ్ఞాన పాలిటెక్నిక్ బాలుర వసతి గృహం, రూ.46 లక్షలతో పీవీ నరసింహరావు టీఎస్ రాష్ట్ర పశువైద్య, మత్స్యశాస్త్రాల విశ్వవిద్యాలయం పరిపాలన భవనాలను ఆయన రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర పర్యాటక, గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందులాల్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అధ్యక్షతన పశుపోషకాలపై రైతు ఆవగాహన సదస్సు జరిగింది.
సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. జిల్లాలో సాధారణం కన్న ఎక్కువ స్థాయిలోనే వర్షపాతం నమోదైందని తెలిపారు. రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి డ్వాక్రా మహిళ రైతులకు పాడి పశువును పెంచుకునేందుకు రాయితీపై వడ్డీలేని రూ.50 వేల చెక్కును అందజేయనున్నామని తెలిపారు. ఆ తర్వాత ఆరు మాసాలకు వరకు దాణాకు అయ్యే ఖర్చులో రూ.3 వేలు సబ్సిడీ అందజేస్తామని చెప్పారు. అందజేస్తామని తెలిపారు. మత్స్య కార్మికులకు నాణ్యమైన రూ.4 లక్షల చేప విత్తనాలు సబ్సిడీపై అందించనున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ప్రతినియోజక వర్గానికి ఒక సంచార పశువైద్యశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అంతకు మందు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ వరంగల్ ఎంజీఎం సెంటర్ వద్ద పశు సంవర్ధక శాఖ 9 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, అందులో పురాతనమైన రేకుల షెడ్ నిర్మాణాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వాటి స్థానంలో వ్యవసాయశాఖ మంత్రి నూతన భవనాలు నిర్మించాలని కోరారు. అనంతరం పశుపాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విద్యార్థులను నేరుగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత వనరాజ కోడిపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.పి.సింగ్, సంచాలకులు వెంకటేశ్వర్లు, సంయుక్త సంచాలకులు వెంకయ్యనాయుడు, సంబంధిత జిల్లా అధికారులతోపాటు వర్ధన్నపేట ఎంపీపీ మార్నేని రవీందర్, రైతులు పాల్గొన్నారు.