వేధింపులు తాళలేక ఆత్మహత్య
నిజాంసాగర్ : భర్తతో పాటు అత్త వేధింపులను తాళలేక జిన్న హేమలత (22) అనే వివాహిత శుక్ర వారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఐదు నెలల కూతురు మానసను ఒంటరి చేసి తల్లిగారింట్లోనే తనవు చాలించింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామానికి చెందిన దుంపల అనుశవ్వ, లక్ష్మణ్ దంపతుల కూతురు హేమలతను ఇంటర్ వరకు చదివించారు. పిట్లం మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన జిన్న సత్యనారాయణకు ఇచ్చి రెండేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. ఆ సమయంలో రెండు తులాల బంగారు గొలుసు, ఇతర అభరణాలతో పాటు బాన్సువాడలోని రూ. 3.50 లక్షల విలువైన ఇల్లు కట్నంగా ఇచ్చారు. ఏడాదిన్నర పాటు దంపతులు అన్యోన్యంగానే ఉన్నారు.
ఐదు నెలల కిందట వీరికి కూతురు పుట్టింది. అప్పటి నుంచి సత్యనారాయణతో పాటు అత్త రామవ్వ హేమలతను వేధిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. పెళ్లప్పుడు పెట్టిన బంగారం ఇటీవల అమ్ముకున్నారని, తమ కూతురును తరుచూ డబ్బు కోసం వేధిస్తున్నారని చెప్పారు. నాల్గు రోజుల క్రితం కూతురు ఇంటికి వెళ్లగా ఆమె భర్త, అత్త తమతో గొడవ పడ్డారని పేర్కొన్నారు. దీంతో హేమలతను తమ ఇంటికి తీసుకొచ్చామని, వారి వేధింపులు భరించలేక ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడిందని రోదిస్తూ చెప్పారు. ఎస్సై అంతిరెడ్డి, తహశీల్దార్ సయ్యద్ అహ్మద్ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు.