మధ్యతరహా ప్రాజెక్టులకూ కొత్త భూచట్టం
- భూసేకరణ చట్టం–2013లోని పలు చాప్టర్ల నుంచి మినహాయింపు
- కొమురంభీమ్, జగన్నాథ్‌పూర్, నీల్వాయి తదితర ప్రాజెక్టులకు వర్తింపు
సాక్షి, హైదరాబాద్: భారీ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసే చర్యల్లో భాగంగా కేంద్ర భూసేకరణ చట్టం–2013లోని పలుఅధ్యాయాలను మినహాయిస్తూ నిర్ణయం చేసిన ప్రభుత్వం తాజాగా వాటిని మధ్యతరహా ప్రాజెక్టులకూ వర్తింపచేయాలని భావిస్తోంది. ఏళ్లకుఏళ్లు భూసేకరణ ముందుకు కదలక, నిలిచిపోయిన పనుల పూర్తికి తెలంగాణ రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని వర్తింపజేసి భూసేకరణ చేయాలని నిర్ణయించి నట్లుగా తెలుస్తోంది. ముందుగా పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మధ్యతరహా ప్రాజెక్టులకు ఈ మినహాయింపులు వర్తింపజేసే అవకాశాలున్నాయి.
నిర్మాణాల జాప్యంతో మార్పులు...
రాష్ట్రంలో చాలా భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను 2004లోనే చేపట్టినప్పటికీ నిర్మాణాలు మాత్రం పూర్తి కాలేదు. ఇందులో ప్రధాన కారణం భూసేకరణే ఉంటోంది. భూసేకరణ జాప్యం కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమై వ్యయం భారీగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జీవో 123 ద్వారా కొద్దిమేర సేకరించినా పూర్తిస్థాయి సేకరణ జరగలేదు. ఈ దృష్ట్యానే కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రం కొత్త చట్టాన్ని తెచ్చింది. దీని మార్గదర్శకాలకు అనుగుణంగా ఇటీవల పాలమూరు, డిండి, కాళేశ్వరం, సీతారామ, ప్రాణహిత వంటి ప్రాజెక్టు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో కేంద్రం చట్టంలో ఉన్న చాప్టర్–2, 3 అధ్యాయాలను పూర్తిగా తొలగించారు. భూసేకరణ చేయడానికి ముందు సామాజిక ప్రభావ మదింపు చేయడం, గ్రామ సభ నిర్వహించి వాటి ఆమోదం తీసుకోవడం వంటి వాటికి మినహాయింపునిచ్చారు.
ఇవే అంశాలను ప్రస్తుతం కొమురంభీమ్, ఎన్టీఆర్ సాగర్, జగన్నాథ్‌పూర్, నీల్వాయి, గొల్లవాగు, లోయర్ పెనుగంగ ప్రాజెక్టులకు వర్తింపజేసేలా ప్రభుత్వం నిర్ణయం చేసినట్లు తెలిసింది. కొమురంభీమ్‌లో 519 ఎకరాలు సేకరిస్తే 45,500 ఎకరాలకు, జగన్నాథ్‌పూర్‌లో 118 ఎకరాలు సేకరిస్తే 15వేల ఎకరాలకు, నీల్వాయిలో 104 ఎకరాల సేకరణ పూర్తయితే 13వేల ఎకరాలకు, గొల్లవాగులో 360 ఎకరాలు సేకరిస్తే 9,500 ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర చట్టానికి అనుగుణంగా భూసేకరణ చేసేలా త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చే అవకాశాలున్నట్లు నీటిపా రుదల వర్గాలు తెలిపాయి.