- 18వ తేదీలోపు వివరణ ఇవ్వాలన్న విద్యాశాఖ
- వివరణ సంతృప్తికరంగా లేకుంటే సీజ్
- గుర్తింపులేనివన్నీ నగర శివారులోనే..
అనుమతిలేని పాఠశాలలపై విద్యాశాఖ కొరడా ఝళిపించింది. జిల్లా వ్యాప్తంగా 115 పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్నట్లు గుర్తించిన జిల్లా విద్యాశాఖ.. ఆయా యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎలాంటి అనుమతిలేకుండా పాఠశాలలు కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇవన్నీ నగర శివారు మండలాల్లోనే ఉండడం గమనార్హం.
జిల్లాలో 2,650 ప్రైవేటు పాఠశాలలున్నాయి. మండలాల వారీగా ఈ పాఠశాలల అనుమతులపై మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో గతనెలలో అధికారులు ప్రత్యేక పరిశీలన చేపట్టారు. ఇందులో 115 పాఠశాలలకు అనుమతులు లేనట్లు గుర్తించారు. దీంతో ముందుగా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన విద్యాశాఖ.. ఆయా మండల విద్యాధికారులకు నోటీసులను పంపింది. ఈ క్రమంలో గతవారం నోటీసుల జారీని పూర్తిచేసిన అధికారులు.. వాటిని అందుకున్న పదిరోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల 18లోపు అనుమతి లేని పాఠశాలల యాజమాన్యాలు స్పందించాల్సి ఉంది. అదేవిధంగా గుర్తింపు ఉన్న పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని తప్పకుండా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని పేర్కొంది.
వెసులుబాటు కల్పిస్తూ..
ప్రైవేటు పాఠశాల అనుమతులకు సంబంధించి నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో నిర్దేశిత గడువులోగా వచ్చిన దరఖాస్తులనే పరిగణలోకి తీసుకుని ఆ మేరకు చర్యలు చేపట్టేవారు. ప్రస్తుతం అపరాధ రుసుముతో చెల్లించే వెసులుబాటు కల్పించింది. దీంతో గుర్తింపులేని పాఠశాల యాజమాన్యాలు ఇప్పుడు కూడా నిర్దేశించిన ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అలావచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతలను బట్టి పాఠశాలకు గుర్తింపునిస్తారు. ఇకపై ప్రతి పాఠశాలలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాల్సిందిగా విద్యాశాఖ అన్ని పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. గుర్తింపు పత్రాన్ని చూసిన తర్వాతే విద్యార్థులను బడిలో చేర్పించాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
మూతబడే..
గుర్తింపు లేని పాఠశాలల వ్యవహారాన్ని జిల్లా విద్యాశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. నిర్దేశిత గడువులోగా సరైన రీతిలో స్పందించకుంటే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని పాఠశాలలు 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను చేపట్టాయి.