ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గల్ఫ్‌లో ఉపాధి కోల్పోయి తిరిగి వచ్చిన బాధితుడు గూడు లేక గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో గుడిసె ఏర్పాటు చేసుకుని జీవిస్తుండగా అటవీ శాఖ అధికారులు తమ ప్రతాపం చూపారు. గుడిసె తీసివేయాలని ఆ కుటుంబాన్ని హెచ్చరించడంతో దానిని తొలగిస్తున్న క్రమంలో కర్రలు మీద పడి గృహిణి తీవ్రగాయాలకు గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లాల్‌సింగ్ తండా గ్రామపంచాయతీకి చెందిన వేముల దేవయ్య స్వగ్రామంలో పనులు లేక ఉపాధి కోసం రూ.5 లక్షలు అప్పు చేసి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాడు. అక్కడ కూడా సరిగా పని దొరక్క ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో రిజర్వ్ అటవీ ప్రాంతంలో తాత్కాలికంగా గుడిసె వేసుకున్నాడు. అటవీ సిబ్బంది సెక్షన్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం గుడిసె తొలగించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో దేవయ్య భార్య లక్ష్మిపై కర్రలు పడి గాయాలకు గురైంది. ఆమెను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment