నాన్న.. క్షమించు!
Published Thu, Mar 16 2017 1:40 PM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM
నా ప్రేమ విఫలమైంది..
అందుకే చనిపోతున్నా..
బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద అధ్యాపకుడి ఆత్మహత్య
తన చావుకు ప్రేమ విఫలమే కారణమంటూ సూసైడ్‌నోట్
మృతుడు వనపర్తిజిల్లా వీపనగండ్ల వాసి
ఇటిక్యాల (అలంపూర్) :
నాన్నా.. క్షమించు.. నాపై కుటుం బమంతా ఆధారపడిందని తెలుసు.. నేను ప్రేమించిన అమ్మాయి దక్కలేదని చనిపోతున్నా.. నాలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు.. నా చావుకు ప్రేమే కారణం.. అంటూ సూసైడ్‌నోట్ రాసి ఓ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ సంఘటన బుధవారం బీచుపల్లి పూణ్యక్షేత్రం ఆవరణలో చోటుచేసుకొంది. పూర్తి వివరాలిలా.. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలకేంద్రానికి చెందిన కె.శ్రీదేవి, చంద్రశేఖర్ దంపతుల ఏకైక కుమారుడు కె. కిశోర్ (25) బీటెక్ వరకు చదివాడు. ప్రస్తుతం కొల్లాపూర్‌లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. కొన్నిరోజులుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో తరచూ తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు.
బుధవారం ఉదయం కళాశాలకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి ఇంటినుంచి బయలుదేరాడు. కానీ కొల్లాపూర్‌కు వెళ్లకుండా పెబ్బేరు మండలంలోని శ్రీరంగాపురం గ్రామానికి వెళ్లి పురుగుల మందు తీసుకున్నాడు. అక్కడి నుంచి బీచుపల్లి పుణ్యక్షేత్రానికి వెళ్లి ఆంజనేయస్వామిని దర్శించుకున్నాడు. అనంతరం పుష్కరఘాట్లపై ఉన్న కృష్ణవేణి విగ్రహం వద్దకు వెళ్లి అక్కడే సూసైడ్ నోట్ రాశాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందును కలుపుకుని తాగాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. కాసేపటి తర్వాత గమనించిన భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఇటిక్యాల హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి వచ్చి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు
ఎదిగిన ఒక్కగానొక కుమారుడు బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి అంధుడు కాగా తల్లి వృద్ధాప్యంలో కొట్టుమిట్టాడుతోంది. వారికి ఆసరాగా ఉండటానికి కష్టపడి చదివిన కిషోర్ ప్రైవేటులో అధ్యాపకుడి ఉద్యోగం చేస్తున్నాడు. ప్రేమ విఫలమైందని చేతులారా తనువుచాలించడంతో బంధువులు, ఇరుగుపొరుగు వారు సైతం కంటతడి పెట్టారు.
Advertisement