పోషించింది పోలీసులే
సాక్షి, హైదరాబాద్: నక్సల్స్‌కు చెక్ పెట్టేందుకు నయీమ్‌ను పోలీసులే పెంచి పోషించారన్న ఆరోపణలున్నాయి. 1993లో ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ హత్య కేసులో అరె స్టయిన నయీముద్దీన్‌ను కొందరు పోలీసు అధికారులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. వారి కౌన్సిలింగ్ ఫలితంగా తన పంథా మార్చుకున్న నయీమ్.. నక్సల్స్‌ను నామరూపాలు లేకుండా చేస్తానంటూ ప్రకటన ఇచ్చాడు. దీంతో ఇతడిని కోవర్ట్‌గా మార్చుకున్న అధికారులు మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారం సేకరిస్తూ వరుస ఎన్‌కౌంటర్లు చేశారు.
కోవర్టుగా పోలీసు ఉన్నతాధికారుతో సంబంధాలు నెరిపాడు. మావోయిస్టు సంబంధిత ఆపరేషన్ల తర్వాత ఇతడి కన్ను ఉగ్రవాదులపై పడింది. ఉగ్రవాద కోణంలోనూ కీలక సమాచారం సేకరించి పోలీసులకు ఇచ్చాడు. ఉగ్రవాది ముజీబ్ 2005లో రాజస్థాన్ నుంచి అక్రమ ఆయుధాలు తీసుకు వస్తున్నాడనే విషయాన్ని పోలీసులకు ఉప్పందించింది నయీమే. అయితే దర్యాప్తులో ఆ నేరంలో ఇతడికి కూడా పాత్ర ఉందని, విభేదాల నేపథ్యంలోనే బయటపెట్టాడని తేలింది. ఉగ్ర కోణంలోనూ నయీమ్ సమాచారం ఇస్తుండటంతో పోలీసులు కూడా తమదైన ‘శైలి’లో సహకరిస్తూ వచ్చారు.
అతడి అరాచకాలను చూసీ చూడనట్లు వదిలేశారు. ఇలా కొందరు రాజకీయ, పోలీసు పెద్దలకు నయీమ్ వాటాదారుడిగా మారారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఓ దశలో నయీమ్ పోలీసుల చేతిలో ‘ఆయుధం’గా మారాడు. పోలీసులు చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని అతడితో చేయించుకుంటారన్నది బహిరంగ రహస్యం. 2007 నుంచి పూర్తి అజ్ఞాతంలో ఉంటున్న నయీమ్‌కు ఉమ్మడి రాష్ట్రంలో ఓ పోలీసు అత్యున్నతాధికారి సహాయ సహకారాలు అందించారనే విమర్శలు ఉన్నాయి.
ఇలా పోలీసులు, రాజకీయ నాయకుల కోసం పనిచేసిన నయీమ్ చివరకు వారికే ఎదురు తిరగడం ప్రారంభించాడు. ఓ సమాంతర శక్తిగా మారిపోవడంతో మళ్లీ పోలీసులు నయీమ్ కోసం గాలించి, షాద్‌నగర్‌లో గుర్తించి మట్టుపెట్టారు.
సోహ్రాబుద్దీన్ కేసులో తేలని పాత్ర: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్ షేక్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో నయీమ్ పాత్ర ఇప్పటికీ మిస్టరీనే. పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న సోహ్రాబుద్దీన్ 2005 నవంబర్ 20న తన భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసీరాం ప్రజాపతిలతో కలిసి గుజరాత్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడి ఓ యునానీ వైద్యుడి వద్ద చికిత్స నిమిత్తం తన భార్యను తీసుకువచ్చాడు. నయీముద్దీన్ సమీప బంధువు వద్దే వీరు ఆశ్రయం పొందినట్లు అనుమానాలున్నాయి.
రెండ్రోజుల తర్వాత వారంతా తిరుగు పయనమయ్యారు. రాష్ట్ర సరిహద్దులు దాటిన తర్వాత ఈ ముగ్గురినీ గుజరాత్ పోలీసులు బస్సులోంచి దించి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అహ్మదాబాద్ శివార్లలో సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కాగా... కౌసర్ బీ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో సొహ్రాబుద్దీన్ పాత్ర నిర్ధారించడానికి నయీమ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సీబీఐ కొన్నేళ్లపాటు యత్నించినా వారి వల్ల కాలేదు.