సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో మండవ కీలకపాత్ర పోషించారు. సీఎం కేసీఆర్ శుక్రవారం స్వయంగా హైదరాబాద్‌లోని మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కేసీఆర్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు మండవ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా మండవ టీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు.
టీడీపీకి తెలంగాణలో ముఖ్యనేతగా ఉన్న మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌లో అధికార పార్టీకి బలం పెరగనుంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం ఉదయం మండవ వెంకటేశ్వర్‌రావు ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మండవ వెంకటేశ్వర రావు సుముఖత వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. కేసీఆర్ వెంట ఉన్నారు.
టీడీపీ ఓటు బ్యాంకు లక్ష్యం
పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి తెలంగాణలోని ఎన్నికలలో టీడీపీ పోటీ చేయడంలేదు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన కేడర్‌పై టీఆర్‌ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది. టీడీపీకి చెందిన అన్ని స్థాయిల్లోని నేతలను పార్టీలోకి తీసుకోవడంతోపాటు మిగిలున్న కేడర్ మద్దతు పొందేలా వ్యూహరచన చేసింది. దీంట్లో భాగంగా మండవ వెంకటేశ్వర్‌రావును పార్టీలోకి ఆహ్వా నించింది. మండవ వెంకటేశ్వర్‌రావు డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి 4సార్లు, నిజామాబాద్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment