
‘కారు’ ఎక్కనున్న ఫరీదుద్దీన్
నేడు హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్న మాజీమంత్రి
జహీరాబాద్: మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. గురువారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఇందుకోసం ఆయన అనుచరులతో కలిసి హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏడాది కాలంగా ఫరీదుద్దీన్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి గీతారెడ్డితో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం ఆయన పరోక్షంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారని గీతారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఫరీద్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న అధిష్టానం నెల రోజుల క్రితం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఫరీద్ టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆయన అనుచరులంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. గురువారం భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో తరలి వెళ్లి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఫరీదుద్దీన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
టీఆర్‌ఎస్ పక్షాన జిల్లాలో చెప్పుకోదగిన మైనార్టీ నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీ అధిష్టానం ఫరీదుద్దీన్‌ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. దీంతో మెదక్ లోక్‌సభకు జరగనున్న ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకోవచ్చనే వ్యూహంలో భాగంగా ఫరీద్ చేరికకు ముహూర్తం నిర్ణయించారు. ఫరీద్ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో జహీరాబాద్ ఎస్సీలకు రిజర్వు అయింది. దీంతో గీతారెడ్డికి అవకాశం లభించింది. నాటి నుంచి ఫరీద్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు మంత్రి హరీష్‌రావు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.