సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీకి చెందిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి అరెస్టుతో నియోజకవర్గ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల దిశగా అన్ని రాజకీయ పక్షాలు సన్నద్ధమవుతున్న వేళ విదేశాలకు మహిళల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్టు స్థానికంగా చర్చనీయాంశమైంది. శాసనసభ రద్దు నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థిగా తాజా, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేరును ప్రకటించింది. ఈ నెల 15, 16 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.
తొలి జాబితాలోనే సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి పేరును ప్రకటించడం దాదాపు ఖాయమైంది. ఈ తరుణంలో జగ్గారెడ్డి అరెస్టుతో సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది. జగ్గారెడ్డి బెయిలు, కేసులు తదితర అంశాలపై ఎప్పటిలోగా స్పష్టత వస్తుందనే అంశంపై కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు, ఆయన అనుచరులకు స్పష్టత లేకుండా పోయింది. కేసులు, కోర్టులు తదితర అంశాలు మరికొంత కాలం కొనసాగితే జగ్గారెడ్డి స్థానంలో ఆయన భార్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మల పార్టీ అభ్యర్థిగా తెరమీదకు వస్తారనే ప్రచారం జరుగుతోంది.
కొంతకాలంగా నిర్మల నియోజకవర్గంలో పర్యటిస్తూ, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఒకవేళ నిర్మలను అభ్యర్థిగా ప్రకటిస్తే ఓటర్లను ఎంత మేర ప్రభావితం చేస్తారనే కోణంలోనూ పార్టీలోనూ, బయటా చర్చ జరుగుతోంది. మరోవైపు గురువారం రాత్రి సంగారెడ్డిలో నిర్వహించిన మైనారీటీల సమావేశంలో తన భర్త అరెస్టుపై నిర్మల చేసిన వ్యాఖ్యలు ఆమె రాజకీయ ఆగమనానికి సంకేతంగా కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
ఆరోపణల పర్వం..
విదేశాలకు మహిళలకు అక్రమంగా రవాణా చేసిన కేసులో జగ్గారెడ్డిని సోమవారం అర్థరాత్రి హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. జగ్గారెడ్డి అరెస్టు తర్వాత ఆయన బాధితలం అంటూ ఒక్కొక్కరుగా బయటకి వచ్చి ఆయనపై ఫిర్యాదులు, ఆరోపణల పర్వానికి తెరలేపారు. ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో జగ్గారెడ్డి గీత కార్మికుల సొసైటీ నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని కొందరు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆయన అనుచరుడిగా పనిచేసిన కాలంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా అప్పుల పాలు చేశారని సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్దన్ నాయక్ ఆరోపణలకు దిగారు. బుధవారం మరికొందరు కూడా జగ్గారెడ్డి తమను మోసం చేశారంటూ కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదులు అందజేశారు.
స్వాతంత్య్ర సమరయోధులకు అమీన్‌పూర్‌లో భూ కేటాయింపుల్లో జగ్గారెడ్డి కీలకంగా వ్యవహరించారని, రూ.40 కోట్లతో సదరు భూములను కొనుగోలు చేసి నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధితులు జాయింట్ కలెక్టర్‌కు విన్నవించారు. రామచంద్రాపురం మండలం ఈదుల నాగులపల్లి 135 సర్వే నంబరు 140 ఎకరాల భూమి విషయంలోనూ జగ్గారెడ్డి తమను మోసం చేసి, రూ.160 కోట్లకు విక్రయించారని మరికొందరు ప్రెస్‌మీట్ నిర్వహించారు. జగ్గారెడ్డి అరెస్టు అనంతరం బాధితులు రచ్చకెక్కుతుండడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మరోవైపు జగ్గారెడ్డి విదేశాలకు మహిళలను అక్రమ రవాణా తెలిసి చేసిన తప్పుగా టీఆర్‌ఎస్ తాజా, మాజీ ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్ ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment