సాక్షి, నల్లకుంట: ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ (వీసీ), ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ వెదుల్ల రామకిష్టయ్య శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో కన్ను మూశారు. దీంతో నల్లకుంట విజ్ఞానపురి కాలనీలోని ఆయన నివాసంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయనకు నరేందర్, శేఖర్, రమణ, మధు నలుగురు కుమారులతో పాటు ఓ కుమార్తె సుజాత ఉన్నారు. సాయంత్రం ఫిల్మ్‌నగర్‌లోని మహా ప్రస్థానంలో రామకిష్టయ్య పార్థివ దేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. బంధు మిత్రుల అశ్రు నయనాల నడుమ ఆయన పెద్ద కుమారుడు నరేందర్ రామకిష్టయ్య చితికి నిప్పంటించారు.
నల్లగొండ జిల్లా మునుగోడులో 1932 అక్టోబర్‌లో జన్మించిన రామకిష్టయ్య 1996–99 వరకు ఓయూ వీసీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన భార్య రాధమ్మ కొన్నేళ్ల కిందట పరమపదించారు. రామకిష్టయ్య మృతికి సంతాపం తెలిపిన వారిలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment