
సాక్షి, నిజామాబాద్ : కరోనాతో ఒకేసారి నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం సృష్టిస్తోంది. ఒకరు ఆక్సిజన్ అందక మృతిచెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అతడు చనిపోయారని మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు కరోనా కారణంగా 9 మంది మృతి చెందారు.
అయితే ఒకేసారి నలుగురు చనిపోవడంతో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పలు అనుమానులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించారు. నలుగురు కరోనా బాధితులు ఒకేసారి ఎలా చనిపోయారన్న దానిపై వివరాలు ఆరా తీశారు. బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. నిందితులను శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులతో ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment