హజ్‌హౌస్ వద్ద విద్యుత్ ప్రమాదం, నలుగురు మృతి
Published Tue, Sep 16 2014 2:27 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లి హ జ్‌హౌస్ వద్ద సోమవారం రాత్రి జరిగిన విద్యుత్ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని కండ్వా జిల్లాకు చెందిన రూపేందర్(22) కౌశిల్(21) రింకేష్(22), సుశీల్‌యాదవ్(22)లు మృతి చెందగా, నగీన్, మునీష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మునీష్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు ఉస్మానియాలో చికిత్సలు అందిస్తున్నారు. వీరంతా జూబ్ల్లీబస్‌స్టేషన్ వద్ద జమ్నా సర్కస్ లో పని చేసేందుకు నెల రోజుల కిందట వచ్చి, తిరిగి స్వస్థలానికి వెళ్లేందుకు నాంపల్లి రైల్వేస్టేషన్‌కు బయలు దేరారు. హజ్‌హౌస్ వద్దకు చేరుకోగానే భారీ వర్షం కురియడంతో రక్షణ కోసం పక్కనే ఉన్న బస్టాప్‌లో నిలబడ్డారు.
భారీ వర్షానికి బస్టాప్ ముందు వరదనీరు వచ్చిచేరింది. ఇదే సమయంలో అక్రమంగా విద్యుత్ కనెక్షన్ తీసుకున్న కరెంటు వైరు ఊడిపోయి హజ్‌యాత్ర కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లపై పడింది. దీంతో బస్టాప్‌లోని ఇనుప పైపులకు విద్యుత్ సరఫరా జరిగి వాటికి ఆనుకుని నిల్చున్న వారికి విద్యుత్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురిని మెడ్విన్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అందులో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరిని ఉస్మానియాకు తరలించగా, వారిలో ఒకరు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మేయర్ మాజిద్‌హుస్సేన్, డీజీపీ అనురాగ్‌శర్మ సందర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశాలు జారీ చేశారు.
Advertisement