గండేడ్: భానుడి ప్రకోపానికి జిల్లావ్యాప్తంగా శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. గండేడ్ మండల పరిధిలో.. మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన శేరి వెంకట్‌రెడ్డి (55) భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. ఒంటరిగా ఉండే ఆయనకు మతిస్థితిమితం సరిగాలేదు. ఇరుగుపొరుగు ఇళ్లలో తింటూ తిరుగుతూ ఉండేవాడు. ఈక్రమంలో ఆయన శుక్రవారం వడదెబ్బకు గురై మృతిచెందాడు.
మరో ఘటనలో పాడి రైతు..
కుల్కచర్ల: మండల పరిధిలోని రాంపూర్‌కు చెందిన బడికె హన్మయ్య(55) నాలుగు గేదెలను సాకుతూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిమాదిరిగానే ఆయన శుక్రవారం గేదెలను మేతకు తీసుకెళ్లాడు. ఈక్రమంలో ఆయన వడదెబ్బకు గురై మధ్యాహ్నం సమయంలో కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి ఆయనను ఓ చెట్టుకిందికి తీసుకెళ్లి నీళ్లు తాగించే యత్నం చేయగా అప్పటికే మృతిచెందాడు. మృతునికి భార్య నర్సమ్మతో ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కు అయిన హన్మయ్య మృతితో భార్యాపిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు.
తాండూరులో యాచకుడు..
తాండూరు రూరల్: వడదెబ్బకు గురై ఓ గుర్తుతెలియని యాచకుడు మృతిచెందిన ఘటన తాండూరు బస్టాండులో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఓ గుర్తుతెలియని యాచకుడు(35) కొంతకాలంగా బస్టాండ్ ఆవరణలో ఉంటూ భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వడదెబ్బకు గురైన అతడు శుక్రవారం మధ్యాహ్నం బస్టాండ్‌లోనే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహన్ని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పటేల్‌గూడలో మహిళ..
ఆదిబట్ల: ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పటేల్‌గూడకు చెందిన కాటేంకార్ కౌసల్య(50) గురువారం వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు గురైంది. శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించడంతో ఆమె మృతిచెందింది. మృతురాలికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
వడదెబ్బతో నలుగురి మృతి
Published Fri, May 29 2015 11:57 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement