Kulkacharla
-
రాజకీయ నిరుద్యోగులకు ఊరట..!
సాక్షి, కుల్కచర్ల: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన 2018 పంచాయతీరాజ్ చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లోని రాజకీయ నిరుద్యోగులకు కొంత ఊరట లభించనుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా గ్రామ పంచాయతీ పాలకవర్గంలోనూ కో–ఆప్షన్ సభ్యులను నియమించుకునేందుకు తెలగాణ ప్రభుత్వం కొత్త చట్టంలో వెలుసుబాటు కల్పించింది. గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరి రెండు నెలలు పూర్తిఅయ్యింది. పాలన పై శిక్షణ తరగతులు కూడా అధికారులు పూర్తిచేశారు. కొత్త పంచాయతీ చట్టంలో రూపొందించిన విధంగా కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ మిగిలింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్... ఎంపిక విధానంపై మార్గదర్శకాలు విడుదలచేస్తే ఆయా పంచాయతీల పాలకవర్గం అభిప్రాయం మేరకు సర్పంచ్ సన్నిహితులకు, విధేయులకు ఛాన్స్ లభించనుంది. సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డు సభ్యులతో పాటు గ్రామానికి చెందిన మరో ముగ్గురిని కో–ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేసుకుంటే వారి విలువైన సలహాలు గ్రామపంచాయతీ అభివృద్ధికి కొంతమేరకు తోడ్పాటు లభించినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వారికి వార్డు సభ్యులతో సమానహోదా ఉంటుంది. గ్రామ పంచాయతీ సమావేశాలలో తీర్మానం సమయంలో చేసే చర్చలో వారు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మండల కో–ఆప్షన్‌గానే ఎంపిక చేసేవారు ఇప్పడు జీపీలలోకూడాముగ్గురిని ఎంపిక చేయనున్నారు. ప్రాధాన్యత వీరికే... ప్రతి గ్రామ పంచాయతీలో ముగ్గురు చొప్పున కో–ఆప్షన్ సభ్యులను పంచాయతీ పాలకవర్గం నిర్ణయం మేరకు అధికారులు నియమిస్తారు. ఇందులో సీనియర్ సిటిజన్, రిటైర్డ్ ఉద్యోగికి ఒకటి, మహిళా సంఘాల సభ్యులలో చురుగ్గా పనిచేసేవారికి ఒకటి, స్వచ్ఛంద సంస్థల వారు గ్రామ అభివృద్ధి కోసం ఇదివరకే కృషిచేసే వారికి ఒకటి ఈ విధంగా ముగ్గురిని నియమిస్తారు. ఈ ముగ్గురు గ్రామాలలో నివసిస్తూ ఉన్నావారు అయిఉండాలి. ఈ ముగ్గురిలో తప్పనిసరిగా ఒకరు మహిళ ఉంటారు. వీరు గ్రామాభివృద్ధి కోసం చేపట్టాల్సిన ప్రతి కార్యక్రమాలపై పంచాయతీ సమావేశాల్లో చర్చిస్తారు. మండలలో 132 మంది కో–ఆప్షన్లు... కుల్కచర్ల మండలంలో ప్రస్తుతం 44 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ లెక్కన గ్రామపంచాయతీకి ముగ్గురు చొప్పున 132 మందిని కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోనున్నారు. వార్డుసభ్యులతో సమాన హోదా కో–ఆప్షన్ సభ్యులకు రానుంది. ఈ విషయమై మండల అధికారులను వివరణ కోరగా 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ప్రభుత్వం మార్గాదర్శకాలను విడుదల చేసిన వెంటనే నియామకాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. -
కుల్క చర్ల ఎంపీడీఓగా సుభాషిణి
కుల్కచర్ల: మండలాభివృద్ధి అధికారిగా టీ.సుభాషిణి గురువారం పదవీబాధ్యతలు స్వీకరించారు. మండలంలో ఉన్న ఎంపీడీఓ నిరంజన్ ఎనిమిది నెలల కిందట పదవి విరమణ పొందాడు .అప్పడి నుంచి ఈఓపీఆర్డీ సురేష్‌బాబు ఇన్‌చార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెలవులో ఉన్న ఎంపీడీఓ సుభాషిణి కుల్కచర్ల ఎంపీడీఓగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. -
జోరందుకున్న వినాయక విగ్రహాల విక్రయాలు
కుల్కచర్ల: వినాయక చవితి దగ్గర పడుతుండటంతో మండల కేంద్రంలో వినాయక విగ్రహాల అమ్మకాలు ఊపందుకున్నాయి. మండల కేంద్రంలో అన్ని రకాల విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో మండల ప్రజలు ,యువకులు పెద్ద వినాయకుల కోసం మహబూబ్‌నగర్, షాద్‌నగర్, హైదరాబాద్‌కు వెళ్లి తీసుకవచ్చే వారు కానీ వ్యాపారులు ప్రజలకు ఆఇబ్బందులు లేకుండా చేశారు. మండల కేంద్రంలో చిన్న వినాయకుడి నుంచి 12 అడుగుల వినాయక విగ్రహాల వరకు దొరుకుతున్నాయి. రూ. 50 నుంచి రూ. 12వేల వరకు ఉన్నాయి. గ్రామాల నుంచి వచ్చిన యువకులు ముందుగానే బుగింక్ చేసుకుంటున్నారు. -
జోరుగా జీరో దందా
మార్కెట్‌కు రాకుండానే ఇతర జిల్లాలకు తరలింపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు పట్టించుకోని అధికారులు కుల్కచర్ల: మండలంలో జీరో దందా జో రుగా సాగుతోంది. మార్కెట్‌కు రాకుం డా లక్షల రూపాయల విలువైన ధాన్యం గుట్టుచప్పుడు కాకుండా మహబూబ్‌నగర్ జిల్లాకు తరలుతోంది. కుల్కచర్ల మార్కెట్‌కు కమిటీ లేకపోవడం.. పరిగి మార్కెట్‌కు అనుసంధానంగా ఉండడంతో పట్టించుకొనేవారు లేకుండా పోయారు. దీంతో జీరో దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. మండల కేంద్రానికి 24 కి.మీ దూరంలో ఉన్న మరికల్లో ఎలాంటి అనుమతి లేకుండా మినీ మార్కెట్ కొనసాగుతోంది. అక్కడ ఉన్న దళారులు, వ్యాపారులు రైతులు పండించిన పంటను కుల్కచర్ల మార్కెట్‌కు రాకుండా అక్కడే అక్కడే కొని మహబూబ్‌నగర్ జిల్లాకు తరలిస్తున్నారు. మండల కేంద్రంలో ప్రతి బుధవారం మార్కెట్ కొనసాగుతుంది. ఈ మార్కెట్‌కు కుల్కచర్ల, గండేడ్ మండలాల నుంచి రైతులు ధ్యానం తీసుకువస్తారు. మండలంలోని మరికల్, ముజాహిద్పూర్, బండవెల్కిచర్ల, పుట్టపహాడ్, చౌడపూర్ గ్రామాల్లో కొందరు వ్యాపారులు అక్కడే మార్కెట్లు ఏర్పాటు చేశారు. రైతులకు మాయమాటలు చెప్పి ధాన్యాన్ని మార్కెట్‌కు రాకుండా చేస్తున్నారు. మార్కెట్‌కు వెళ్తే రవాణా, హమాలీ, దడువాయి ఖర్చులు అవుతాయని చెబుతూ అక్కడే తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కుల్కచర్ల మార్కెట్‌కు తరలించకుండా మార్కెట్ ఫీజు లేకుండా, వే బిల్లులు లేకుండా ఇతర జిల్లాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు 20 నుంచి 25 లారీల వరకు మొక్కజొన్న, వరి ధాన్యాన్ని తరలిస్తున్నారు. దీంతో ప్రతి వారం మార్కెట్‌కు వేలల్లో నష్టం జరుగుతోంది. తూకాల్లో మోసాలు ధాన్యం తక్కువ ధరకే తీసుకోవడం కాకుండా తూకాల్లో కూడా పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. క్వింటాలుకు 5 కిలోలు తక్కువ అవుతున్నాయని, ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా అందామంటే అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వరని ఏమి అనలేక పోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా మార్కెట్ కమిటీ అధికారులు, విజిలెన్స్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. -
హాస్టల్ విద్యార్థి అదృశ్యం
కుల్కచర్ల (మహబూబ్‌నగర్) : దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి హాస్టల్ నుంచి బయలుదేరిన ఓ విద్యార్థి కనిపించకుండాపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళ్తే.. కుల్కచర్ల మండలం పిరంపల్లి గ్రామం బోట్యానాయక్ తండాకు చెందిన శంకర్, బుజ్జిబాయిల కుమారుడు రాజు(13) ముజాహిద్పూర్ గిరిజన వసతి గృహంలో ఉంటూ అక్కడి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. శంకర్ కొద్ది రోజుల క్రితం ఆనారోగ్యంతో మృతి చెందాడు. బుజ్జిబాయి స్థానికంగా ఉపాధిలేక పూణేలో భవన నిర్మాణం పనులు చేసేందుకు వెళ్లింది. అయితే ఈ నెల 10 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో 11న ఆదివారం తల్లి దగ్గరకు పూణే వెళ్తానంటూ కుల్కచర్ల నుంచి బయలుదేరాడు. కానీ పూణేకు వెళ్లలేదు. స్థానికంగా ఎవరికీ కనిపించలేదు. ఈ విషయం తల్లికి తెలియజేయడంతో ఆమె పూణే నుంచి గ్రామానికి వచ్చింది. రెండు రోజులుగా బంధువులు, తెలిసిన వారి దగ్గర వాకబు చేసింది. ఎక్కడా ఆచూకీ లేకపోవటంతో బుజ్జిబాయి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
వడదెబ్బతో నలుగురి మృతి
గండేడ్: భానుడి ప్రకోపానికి జిల్లావ్యాప్తంగా శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. గండేడ్ మండల పరిధిలో.. మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన శేరి వెంకట్‌రెడ్డి (55) భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. ఒంటరిగా ఉండే ఆయనకు మతిస్థితిమితం సరిగాలేదు. ఇరుగుపొరుగు ఇళ్లలో తింటూ తిరుగుతూ ఉండేవాడు. ఈక్రమంలో ఆయన శుక్రవారం వడదెబ్బకు గురై మృతిచెందాడు. మరో ఘటనలో పాడి రైతు.. కుల్కచర్ల: మండల పరిధిలోని రాంపూర్‌కు చెందిన బడికె హన్మయ్య(55) నాలుగు గేదెలను సాకుతూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిమాదిరిగానే ఆయన శుక్రవారం గేదెలను మేతకు తీసుకెళ్లాడు. ఈక్రమంలో ఆయన వడదెబ్బకు గురై మధ్యాహ్నం సమయంలో కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి ఆయనను ఓ చెట్టుకిందికి తీసుకెళ్లి నీళ్లు తాగించే యత్నం చేయగా అప్పటికే మృతిచెందాడు. మృతునికి భార్య నర్సమ్మతో ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కు అయిన హన్మయ్య మృతితో భార్యాపిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు. తాండూరులో యాచకుడు.. తాండూరు రూరల్: వడదెబ్బకు గురై ఓ గుర్తుతెలియని యాచకుడు మృతిచెందిన ఘటన తాండూరు బస్టాండులో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఓ గుర్తుతెలియని యాచకుడు(35) కొంతకాలంగా బస్టాండ్ ఆవరణలో ఉంటూ భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వడదెబ్బకు గురైన అతడు శుక్రవారం మధ్యాహ్నం బస్టాండ్‌లోనే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహన్ని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పటేల్‌గూడలో మహిళ.. ఆదిబట్ల: ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పటేల్‌గూడకు చెందిన కాటేంకార్ కౌసల్య(50) గురువారం వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు గురైంది. శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించడంతో ఆమె మృతిచెందింది. మృతురాలికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
విద్యుద్ఘాతంతో విద్యార్థి మృతి
కుల్కచర్ల: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అడవి పందుల నుంచి రక్షణ కోసం పొలానికి వేసిన విద్యుత్ కంచె తగిలి ఓ విద్యార్థి బలైపోయాడు. ఈ ఘటన జిల్లాలోని కుల్కచర్ల మండలంలోని కుర్సపల్లి గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన రాజు (16) అనే విద్యార్ధి పొలాల సమీపంలోంచి వెళుతుండగా చేనుకు వేసిన కంచె తగిలింది. దీంతో రాజు విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు స్తానిక పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్నాడు. -
గడవని పూట.. వలసబాట
కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో కలిపి సుమారు 150 వరకు గిరిజన తండాలు ఉన్నాయి. ఈ తండాల్లో సుమారు 35వేల వరకు ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో బతుకుదెరువు నిమిత్తం పుణే, ముంబై తదితర పట్టణాలకు 60శాతం మందికి పైగా వలస వెళ్లారు. నిత్యం కుల్కచర్ల, గండేడ్ మండలాల నుంచి పరిగి, మహబూబ్‌నగర్, తాండూరు డిపోల ఆర్టీసీ బస్సులు ముంబై, పుణేలకు రద్దీగా వెళ్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జీవిత కాలమంతా .. బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లిన గిరిజనులు యేడాదిలో ఎనిమిది నెలలు అక్కడే పనులు చేసుకుంటున్నారు. నాలుగు నెలలు మాత్రం తిరిగివచ్చి తమ కుటుంబాలు, వ్యవసాయాన్ని చూసుకుని వెళ్తున్నారు. తిండి గింజలు ఇంట్లోవేసి, పిల్లల్ని పెద్దల దగ్గర ఉంచి తిరిగి పట్టణాలకు పయనమవుతారు. ఇంటిదగ్గర ఉన్న వృద్ధులపైనే అధిక భారం పడడంతో కాయాకష్టం చేసి, కట్టెలు అమ్ముకుని పిల్లల్ని కాపాడుకుంటున్నారు. పడని అడ్డుకట్ట.. వలసల నిరోధానికి ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. అవగాహనా లోపమో, లేక ఇక్కడ లభిస్తున్న ఉపాధి కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదన్న కారణమో గానీ వలసలు మాత్రం ఆగడం లేదు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులతో ఆయా తండాల్లో మరింత పెరిగాయి. కూతుళ్ల పెళ్లికని చేసిన అప్పు తీర్చేందుకు కొందరు, తల్లిదండ్రుల ఆరోగ్యం నిమిత్తం ఉన్నదంతా ఖర్చు చేసి తిరిగి సంపాదించుకునేందుకు మరికొందరు, తాముపడిన కష్టం పిల్లలు పడకూడదని వారిని బాగా చూసుకునేందుకు కాస్తోకూస్తో కూడబెట్టాలనే తాపత్రయంతో ఇంకొందరు.. ఇలా గ్రామాలను విడిచి వెళ్తున్నారు. భరోసా ఇవ్వన్ని ‘ఉపాధి’ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం గిరిజనులకు భరోసా కల్పించలేకపోతోంది. నెలలు గడిచినా చేసిన పనికి కూలీ డబ్బులు చేతికందకపోవడంతో దీనికన్నా వలసబతుకు లే మేలని అటువైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం కల్పిం చే ఉపాధికన్నా ముంబై, పుణేల్లో చేసే కూలీ పనులకే ఎక్కువ గిట్టుబాటవుతోందని అంటున్నారు. చేసిన పనికి వారంరోజుల్లో కూలీ డబ్బులు చెల్లిస్తే, ఉన్న ఉపాధిని నిరుపేద రైతుల వ్యవసాయానికి అనుబంధం చేస్తే కొంతవరకు వలసలను నిరోధించవచ్చని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే.. మారుమూల గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే సంక్షేమ నిధులు వస్తాయని, వాటితో అభివృద్ధితోపాటు స్థానికులకు ఉపాధి దొరుకుతుందని గిరిజనులు పేర్కొంటున్నారు. అప్పుడు ఇక్కడే ఉండి తమ పిల్లల బాగోగులు, చదువులు కూడా చూసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. -
వలస జీవులకు ‘సర్వే’ దెబ్బ
కుల్కచర్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కుటుంబ సమగ్ర సర్వే’ నియోజకవర్గంలోని వలస జీవులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. ఎక్కడున్నా సరే ఈ నెల 19న జరిగే సర్వేకు హాజరై తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీచేసింది. వీటి ఆధారంగానే రేషన్‌కార్డులు, ఇళ్లు, పింఛన్ తదితర సంక్షేమ పథకాలు వర్తిస్తాయని అధికారులు ప్రచారం చేస్తున్నారు. అయితే స్థానికంగా ఉపాధి లేక పనుల కోసం ముంబయి, పూణే ,షోలాపూర్, హైదరాబాద్ తదితర నగరాలకు , దుబాయి,ఉగాండా దేశాలకు ఎంతోమంది వలసలు పోయారు. వీరందరూ తిరిగి రావాలంటే ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల,గండేడ్,దోమ,పూడూరు,పరిగి మండలాల నుంచి 40 శాతం ప్రజలు వలసలోనే ఉన్నారు. కుటుంబంలో ఒక్కరైతే రావచ్చుగాని కుటుంబమంతా అంటే చాల కష్టమని వారు వాపోతున్నారు. ఒక్క రోజు మాత్రమే సెలవు కుటుంబ సమగ్ర సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం 19న ఒక్క రోజును మాత్రమే సెలవుదినంగా ప్రకటించిం ది. అయితే పట్టణాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు 18న విధులు నిర్వహించుకొని అదే రోజు గ్రామాలకు రావాలంటే చాలా ఇబ్బంది. 19న రావాలంటే ఆ రోజు రవాణా వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వమే వాడుకుంటుంది. ప్రైవేటు వాహనాలను కూడా ప్రభుత్వం వాడుకుంటుంది. దీంతో సర్వేకు రావాలనుకునేవారికి రవాణా కూడా సమస్యగానే మారనుంది. -
వలస లెక్క తేలేదెలా?
కుల్కచర్ల: ఆగస్టు 19. కుటుంబ సమగ్ర సర్వే. అధికారులు రాష్ట్రంలోని ప్రతి గడపకూరానున్నారు. కుటుంబానికి సంబంధించి ప్రతి విషయాన్నీ నమోదు చేసుకుని వెళ్తారు. ఈ సర్వే నిర్వహణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. అదే సమయంలో జిల్లాలో వలస వెళ్లిన వారి పరిస్థితి ఇప్పుడు తెరపైకొచ్చింది. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న జిల్లాలో మారుమూల ప్రాంత తండాలు అనేకం. కుల్కచర్ల, గండేడ్, దోమ, పరిగితోపాటు తాండూరు, వికారాబాద్ నియోజవర్గాల పరిధిలోని ధారూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల, మోమిన్‌పేట, బంట్వారం తదితర మండలాల్లో గిరిజన జనాభా అధికం. ఆయా తండాల నుంచి సుమారు మూడు లక్షల మంది వలస వెళ్లారు. వీరంతా ముంబై, పుణే, చెన్నై, ఒడిశా ప్రాంతాలకు కుటుంబాలతో వెళ్లారు. ఇక కొందరు దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల్లో పనులు చేస్తున్నారు. దాదాపు అన్ని కుటుంబాలు కూడా పది నెలలు వలస వెళ్లి కేవలం రెండు నెలలు మాత్రమే ఇంటిపట్టున ఉంటాయి. కొన్ని కుటుంబాలు పండుగలు, శుభకార్యాలకు వచ్చి వెళ్తుంటాయి. ఇప్పుడు వారి ఇళ్లలో నివాసం ఉంటున్నది కొన్ని కుటుంబాల్లో వృద్ధులు, వారితోపాటు పిల్లలు మాత్రమే. చాలా ఇళ్లకు తాళాలే కన్పిస్తున్నాయి. ఇక ఏఏ మండలంలో ఎన్ని కుటుంబాలు వలస వెళ్లాయన్నదానిపై ప్రభుత్వం వద్ద లెక్కల్లేవు. రోజూ ఐదు బస్సుల్లో రాకపోకలు.. చాలా మండల కేంద్రాల్లోంచి ఆర్టీసీ వలస వెళ్లేవారి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. కుల్కచర,్ల గండేడ్ నుంచి రోజు ఐదు బస్సులు పరిగి, మహ బూబ్‌నగర్, నారాయణపేట డిపోల నుంచి నడుస్తున్నాయి. ఎన్నికలు, గిరిజనులుచేసే తుల్జాభవానీ పండుగల సమయాల్లోనే పూర్తిస్థాయిలో గిరిజన కుటుంబాలు ఇక్కడకు చేరుకుంటాయి. వీళ్ల వివరాలు నమోదు చేయరా? 19వ తేదీన నిర్వహించే సర్వేలో వలస వెళ్లిన కుటుంబాల వివరాల నమోదు కష్టంగానే కన్పిస్తోంది. జిల్లాలోని 10 మండలాల్లో కలిపి సుమారు మూడు లక్షల మంది వివరాలు ఎలా సేకరిస్తారన్నది ప్రశ్నార్థకం. గతంలో మాదిరిగానే సర్వేకు వచ్చే అధికారులు ‘డోర్‌లాక్’ అని రాసుకుని వెళ్తారేమో చూడాలి. అందరికీ సమాచారమివ్వడం కష్టమే..! సర్వే నిర్వహణకు ఇంకా 11 రోజులే ఉంది. వలస వెళ్లిన వారిలో ఎక్కువ మంది భవన నిర్మాణ కూలీలు, మట్టి పనులు చేసేవారు, మేస్త్రీలు. వీరంతా కుటుంబాలతో కలిసి విడిగా వెళ్తారు కనుక సమాచారం ఇవ్వడం కష్టంగానే ఉంటోంది. ఎన్నికల సమయంలో అయితే పోటీలో ఉన్న రాజకీయ నాయకులు సొంత ఖర్చుతో ఇక్కడికి రప్పిస్తారు. స్పెషల్‌గా బస్సులు పెట్టి మరీ తీసుకొస్తారు. కానీ ఇప్పుడు సర్వేచేస్తున్న ప్రభుత్వం అలాంటి మార్గాలను ఏమైనా అన్వేషిస్తుందేమో చూడాలి. -
గాలివాన, వడగళ్ల బీభత్సం
దోమ / కుల్కచర్ల, న్యూస్‌లైన్: అన్నదాత ఆశలను ప్రకృతి అడియాస చేసింది. శుక్రవారం జోరుగాలి, వడగళ్లతో విరుచుకుపడిన వాన దోమ, కుల్కచర్ల మండలాల్లో పంటలను నాశనం చేసింది. తీవ్రమైన గాలికి వడగళ్ల వర్షం తోడవడంతో వేల సంఖ్యలో మామిడి కాయలు రాలిపోయాయి. గాలివాన బీభత్సానికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి పలువురు నిరాశ్రయులయ్యారు. దోమ మండలంలోని పలు గ్రామాల్లో 120 ఎకరాల్లో పెంచుతున్న మామిడి తోటల్లో కాయలు నేలరాలి రైతులకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ఉదన్‌రావుపల్లి గ్రామంలో వడగళ్ల ధాటికి సుమారు 40ఎకరాల్లో వరి పంట చేతికందకుండా పోయింది. దోమతో పాటు ఎల్లారెడ్డిపల్లి, లింగన్‌పల్లి, దిర్సంపల్లి, బ్రాహ్మణ్‌పల్లి, ఉదన్‌రావ్‌పల్లి, పాలేపల్లి, ఐనాపూర్, మోత్కూర్ తదితర గ్రామాల్లో పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కన్నీటిపర్యంతమైన రైతులు వడగళ్ల వాన దోమతో పాటు ఉదన్‌రావ్‌పల్లి గ్రామాల్లో వరి పంట సాగు చేస్తున్న రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సుమారు 40 ఎకరాల్లో ధాన్యం నేల రాలి పాడైపోయింది. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంట కళ్ల ముందే పాడవడంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. ఒక్క దోమ గ్రామంలోనే రైతు గానుగ నర్సయ్య 16 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట పూర్తిగా నాశనమైంది. దోమ సర్పంచ్ రాధాబాయి గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి తెలుసుకున్నారు. బాధిత రైతులకు పరిహారం అందించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కుల్కచర్లలో... మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు, వడగళ్లు ప్రజలతో పాటు రైతులకు నష్టం మిగిల్చాయి. అంతారం, కుల్కచర్ల, బండ వెల్కిచర్ల, పుట్టపహడ్, ఘణపూర్ గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా, తోటల్లో పెద్దసంఖ్యలో మామిడికాయలు నేలరాలాయి. జోరుగాలికి కుల్కచర్ల, బంగరంపల్లి గ్రామాల్లో 20 ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. మండల కేంద్రంలో ఈడ్గి పుల్లయ్యగౌడ్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. -
దేశానికి మోడీ పాలన అవసరం
కుల్కచర్ల ,న్యూస్‌లైన్: దేశానికి మోడీ పాలన అవసరమని, ప్రజలు కూడా అతన్ని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీజేపీ పరిగి అసెంబ్లీ అభ్యర్థి కమతం రామిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం భ్రష్టుపట్టిపోయాయన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం కాంగ్రెస్ డబ్బుల పార్టీగా మారిందని, గాంధీ భవనం సీట్లు అమ్ముకునే దుకాణంగా మారిందని ఆరోపించారు. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని, నేడు ఆపార్టీలో గౌరవం లేకనే పార్టీని వీడటం జరిగిందన్నారు. పరిగి నియెజకవర్గంలో తాను మంత్రిగా ఉనప్పుడు చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయన్నారు. దమ్ముంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆరు దశాబ్దాల పాటు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే జాతీయ పార్టీ బీజేపీకే సాధ్యమన్నారు. 20 సంవత్సరాలుగా పరిగి ప్రజలను ప్రజాప్రతినిధులు మోసం చేస్తున్నారని, తనకు మోసం చేయడం చేతకాదన్నారు. అధికారంలో లేకపోయినప్పటికీ పరిగి నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నానన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం కావడంలో బీజేపీ కీలకపాత్ర వహించిం దన్నారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రహ్లాద్‌రావు, నాయకులు వెంకటయ్యగౌడ్, అంజిలయ్య, కుల్కచర్ల సర్పంచ్ జానకీరాం, రవిచందర్, గణేష్, మహిపాల్, చంద్రలింగం, ప్రకాష్, సం తోష్, శ్రీను, రాములు తదితరలు పాల్గొన్నారు. -
వీఆర్ఓ ఫలితాల్లో పురుషుల హవా
గ్రామ రెవెన్యూ అధికారి పరీక్ష ఫలితాల్లో పురుషుల హవా కనిపించింది. ఫస్ట్ ర్యాంకు మొదలు వరుసగా 28వ ర్యాంకు వరకు పురుషులే ఉన్నారు. కుల్కచర్ల మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మర్పల్లి వెంకటరమణారెడ్డి 95మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించగా, యాచారం మండలం గడ్డమల్లయ్యగూడకు చెందిన గౌర కృష్ణ 4వ ర్యాంకు, ఆయనతో కలిసి పదోతరగతి చదివిన గునుగల్ గ్రామానికి చెందిన పి.సంధ్యారాణి 29వ ర్యాంకు, చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన బాలకృష్ణ 5వ ర్యాంకు, అలాగే గండేడ్ మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన బోయినివికాంత్ 8వ రర్యాంకు సాధించారు. గ్రూప్ వన్ ఉద్యోగం సాధిస్తా ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ (మ్యాథ్స్) పూర్తిచేసిన నేను 2011 సంవత్సరం నుంచి ఎస్సై, తదితర పోటీ పరీక్షలకు సొంతంగా మెటీరియల్ తయారుచేసుకొని ప్రిపేర్ అవుతున్నాను. వీఆర్ఓ పరీక్షలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉంది. గ్రూప్ వన్ ఉద్యోగం కోసం పట్టుదలగా చదువుతున్నా, తప్పకుండా దాన్ని సాధిస్తా. కష్టానికి ఫలితం దక్కింది చిన్నపటినుండి కష్టపడి చదివిన చదువుకు ఫలితం దక్కింది. ఎన్నో ఒడిదొడుకుల మధ్య చదువుకుంటూ ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రయత్నించాను. తాతయ్య నన్ను బాగా ప్రోత్సహించారు. వీఆర్ఓ పరీక్షలో 93మార్కులతో జిల్లాలో 8ర్యాంకు వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవచేసే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను. అమ్మానాన్నల కల కూడా నెరవేరింది. - బోయిని రవికాంత్, చౌదర్పల్లి, గండేడ్ మండలం ఐఏఎస్ సాధించడమే లక్ష్యం అమ్మానాన్న బౌరమ్మ, యాదయ్యలు వ్యవసాయ కూలీలు. కష్టపడి మమ్మల్ని చదివించారు. అన్న నర్సింహకు కొద్ది నెలల క్రితమే రైల్వేలో ఉద్యోగం వచ్చింది. మా పెదనాన్న కొడుకు వెంకటేష్ ప్రస్తుతం ఎస్సైగా మహబూబ్‌నగర్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇద్దరు అన్నల స్ఫూర్తితో కష్టపడి వీఆర్ఓ పరీక్షకు ప్రిపేరయ్యాను. జిల్లాలో నాల్గో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. వచ్చిన ఉద్యోగం చేస్తూనే భవిష్యత్తులో ఐఏఎస్ సాధించడమే నా లక్ష్యం. - గౌర కృష్ణ, గడ్డమల్లయ్యగూడ, యాచారం మండలం ఐఏఎస్ తప్పకుండా సాధిస్తా వీఆర్ఓ ఫలితాల్లో జిల్లాలో నాకు 29వ ర్యాంకు వచ్చిందని స్నేహితుల ద్వారా తెలిసి సంతోషం కలిగింది. నా విజయం వెనుక తల్లిదండ్రులు యాదమ్మ, భిక్షపతిగౌడ్ల కృషి ఎంతైనా ఉంది. వీఆర్ఓగా పనిచేస్తూనే అమ్మానాన్నల ఆశయం మేరకు ఐఏఎస్‌ను తప్పకుండా సాధిస్తా - పి. సంధ్యారాణి, గునుగల్, యాచారం మండలం -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
గండేడ్/కుల్కచర్ల, న్యూస్‌లైన్: విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌ను సిమెంట్‌లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. బైకును లారీ ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మహమ్మదాబాద్ పోలీస్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐలు జానకీరాంరెడ్డి, కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ దాస్యానాయక్ తండాకు చెందిన నేనావత్ బాస్‌నాయక్ (27)కు గత 2010లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తాండూరులో పనిచేసిన ఆయన ఇటీవల మహమ్మదాబాద్ ఠాణాకు బదిలీ అయ్యాడు. విధుల్లో భాగంగా శనివారం బోసునాయక్ ఓ కేసు విచారణ కు మండల పరిధిలోని సల్కర్‌పేట్ గ్రామానికి బైకుపై వెళ్లి తిరిగి ఠాణాకు ప్రయాణమయ్యాడు. తాండూరు నుంచి మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న సిమెంట్ లారీ (ఏపీ04వై 7786) రెడ్డిపల్లి సమీపంలో గురుకుల పాఠశాల దగ్గర బాస్‌నాయక్ బైకును వెనుక నుంచి ఢీకొంది. తలకు తీవ్రంగా గాయాలైన ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి వాహనంతో పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో మొకర్లాబాద్ సమీపంలో పోలీసులు లారీని అడ్డగించి డ్రైవర్‌ను పట్టుకున్నారు. బాస్‌నాయక్ మృతితో మహమ్మదాబాద్ ఠాణా సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబీకులు ఘనా స్థలానికి చేరుకొని గుండెలవిసేలా రోదించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పరిగి ఆస్పత్రికి తరలించారు. దాస్యానాయక్ తండాలో విషాదం దాస్యానాయక్ తండాకు చెందిన దుగ్యానాయక్, మున్నమ్మ దంపతుల రెండో కుమారుడు బాస్‌నాయక్. మహమ్మదాబాద్ ఠాణాకు బదిలీ ఆయిన నుంచి ఆయన నిత్యం స్వగ్రామం నుంచి ఠాణాకు రాకపోకలు సాగిస్తున్నాడు. బాస్‌నాయక్ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం మేకగూడకు చెందిన జ్యోతిని ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి నెల రోజుల క్రితం ఓ కుమారుడు పుట్టాడు. బాస్‌నాయక్ తండ్రి ఐదు నెలల క్రితం పంటకు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డాడు. రెండు సంవత్సరాల క్రితం బాస్‌నాయక్ పెద్ద అన్న కిషన్‌నాయక్ అదృశ్యమై తిరిగి రాలేదు. కానిస్టేబుల్ దుర్మరణంతో భార్య జ్యోతి, కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. కానిస్టేబుల్ మృతితో దాస్యానాయక్ తండాలో విషాదం అలుముకుంది. -
వణుకుతున్న కుల్కచర్ల
కుల్కచర్ల, న్యూస్‌లైన్: వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు కుల్కచర్ల మండల పరిధిలోని గ్రామాల ప్రజలను వణికిస్తున్నాయి. నెలన్నర వ్యవధిలోనే ఐదు హత్య కేసులు, రెండు అత్యాచారం కేసులు నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరుసగా జరుగుతున్న నేరాలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు ఎప్పుడేం జరుగుతుందోనని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బండవెల్కిచర్ల కేసులో పోలీసులు తలమునకలై ఉన్నారు. ఉన్నతస్థాయి అధికారులు ఈ కేసు విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇద్దరిని తీసుకువచ్చి విచారించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు బయటికి మాత్రం చెప్పడం లేదు. ఒకటి రెండు రోజుల్లో కేసును ఛేదిస్తామని సీఐ వేణుగోపాల్‌రెడ్డి చెబుతున్నారు. ఇవీ సంఘటనలు... గతనెల 8న మండల పరిధిలోని విఠలాపూర్ గ్రామంలో పాతకక్షల నేపథ్యంలో పొలం దగ్గర మహిళను హత్య చేసి చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో ఎనిమిది రోజుల తర్వాత పోలీసులు నిందితులను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. గతనెల 20న కుల్కచర్లకు చెందిన వడ్డె చంద్రమ్మను దాయాదుల్లో ఒకరైన రాములు హత్య చేశాడు. ఈ కేసులో రాములును రిమాండ్‌కు తరలించారు. గతనెల 25న కుల్కచర్లకు చెందిన హరిజన్ నర్సయ్యను అతనితో సహవాసం చేస్తున్న మహిళ రాయితో తలపై కొట్టి హత్య చేసింది. ఈ కేసులో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 3న పటెల్చెరువు తండాలో భార్యపై భర్త, కుటుంబ సభ్యులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 6న మండల పరిధిలోని బండవెల్కిచర్లలో గుర్తుతెలియని మహిళను తాడుతో ఉరివేసి, గ్రామం నడిబొడ్డున పెట్రోల్ పోసి ఆనవాలు లేకుండా నిప్పంటించి హత్య చేశారు. 15 రోజులైనా ఈ కేసును పోలీసులు ఛేదించలేదు. కనీసం హత్యకు గురైన మహిళ వివరాలు కూడా తెలియ రాలేదు. ఈనెల 17న ఈర్లవాగు తండాకు చెందిన గిరిజన మహిళపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు రాత్రి పగలు కష్టపడి నిందితులను పట్టుకుని రిమాండ్‌కు పంపించారు. ఘణపూర్లోనూ ఇటీవల ఓ అత్యాచారం కేసు నమోదైనట్లు తెలిసింది. -
షార్ట్ సర్క్యూట్ తో దుకాణం దగ్ధం
కుల్కచర్ల, న్యూస్‌లైన్: షార్టసర్క్యూట్తో ఓ కిరాణా దుకాణం దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని అంతారం గేటు వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. అంతారం గ్రామానికి చెందిన కాంగారు వెంకటయ్య అంతారం గేటు వద్ద కిరాణం, బట్టలు,బ్యాంగిల్స్టోర్ నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి 9 గంటల సమయంలో దుకాణం మూసివేసి పక్కనే ఉన్న ఇంట్లో పడుకున్నారు. అర్ధరాత్రి తరువాత దుకాణంలో నుంచి మం టలు రావడం గమనించారు. దుకాణం తెరిచి చూడగా అప్పటికే అంతా కాలి బూడిదైంది. దుకాణంలో ఉన్న కిరాణ సరుకులు, బట్టలు, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ.లక్ష ఆస్తినష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. షార్టసర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. -
గుర్తు తెలియని మహిళ దారుణ హత్య
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల సమీపంలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురయ్యింది. దుండగులు.... మహిళను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కాల్చివేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం బండవెల్కిచర్ల సమీపంలోని మంటలు వస్తుండగా స్థానికులు గమనించారు. ఘటనాప్రాంతానికి వెళ్లి చూడగా అప్పటికే మహిళ మృతదేహం కాలిపోయింది. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి దహనం చేసినట్లు గుర్తులు ఉన్నాయి. కాగా మృతురాలి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. -
నేనే చంపేశాను..
కుల్కచర్ల,న్యూస్‌లైన్:పాత కక్షల నేపథ్యంలో ఓ మహిళ హత్యకు గురైంది. ‘నేనే చంపేశాను..’ అంటూ నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ సంఘటన ఆదివారం కుల్కచర్ల మండల కేంద్రంలో వెలుగుచూసింది. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డె హన్మయ్య, హన్మమ్మ(58) దంపతులు. హన్మయ్య వికలాంగుడు, దీం తో ఆయన స్థానికంగా భిక్షాటన చేస్తు ండగా హన్మమ్మ కూలిపనులు చేస్తో ంది. అదే గ్రామానికి చెందిన వడ్డె రాములుతో దంపతులకు పాత కక్షలు ఉన్నాయి. ఈక్రమంలో నాలుగురోజు ల క్రితం హన్మమ్మ, రాములు గొడవపడ్డారు. దీంతో హన్మమ్మ రాములుపై కుల్కచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు రాములును అదుపులోకి తీసుకొని విచారించి శనివారం వదిలేశారు. శనివారం రాత్రి రాములు హన్మమ్మ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా ఆమె దుర్భాషలాడింది. తనపై అప్పటికే హన్మమ్మ ఠాణాలో ఫిర్యాదు చేయడం, తిరిగి దూషించడంతో రాములు తీవ్ర ఆగ్రహానికి గురయ్యా డు. అక్కడే ఉన్న ఓ రాయితో హన్మమ్మపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే ప్రాణం విడిచిం ది. ఎవరూ గమనించకపోవడంతో రా ములు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆదివారం ఉదయం స్థాని కులు హన్మ మ్మ మృతదేహంగా పడి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి, కుల్కచర్ల ఎస్ఐ నాగేష్ తమ సిబ్బం దితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితుడి వివరాలు సేకరణకు జాగిలాలు రప్పిం చేందుకు సిద్ధమవుతున్నారు. అంతలోనే రాములు అక్కడికి వచ్చి ‘నేనే హన్మమ్మను చంపేశాను’ అని లొంగిపోయాడు. అనంతరం పోలీసు జాగిలం కూడా రాములు వద్ద ఆగిపోయింది. హన్మమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రాములను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఈమేరకు సీఐ వేణుగోపాల్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.