కుల్కచర్ల: ఆగస్టు 19. కుటుంబ సమగ్ర సర్వే. అధికారులు రాష్ట్రంలోని ప్రతి గడపకూరానున్నారు. కుటుంబానికి సంబంధించి ప్రతి విషయాన్నీ నమోదు చేసుకుని వెళ్తారు. ఈ సర్వే నిర్వహణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. అదే సమయంలో జిల్లాలో వలస వెళ్లిన వారి పరిస్థితి ఇప్పుడు తెరపైకొచ్చింది. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న జిల్లాలో మారుమూల ప్రాంత తండాలు అనేకం.
కుల్కచర్ల, గండేడ్, దోమ, పరిగితోపాటు తాండూరు, వికారాబాద్ నియోజవర్గాల పరిధిలోని ధారూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల, మోమిన్‌పేట, బంట్వారం తదితర మండలాల్లో గిరిజన జనాభా అధికం. ఆయా తండాల నుంచి సుమారు మూడు లక్షల మంది వలస వెళ్లారు. వీరంతా ముంబై, పుణే, చెన్నై, ఒడిశా ప్రాంతాలకు కుటుంబాలతో వెళ్లారు.
ఇక కొందరు దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల్లో పనులు చేస్తున్నారు. దాదాపు అన్ని కుటుంబాలు కూడా పది నెలలు వలస వెళ్లి కేవలం రెండు నెలలు మాత్రమే ఇంటిపట్టున ఉంటాయి. కొన్ని కుటుంబాలు పండుగలు, శుభకార్యాలకు వచ్చి వెళ్తుంటాయి. ఇప్పుడు వారి ఇళ్లలో నివాసం ఉంటున్నది కొన్ని కుటుంబాల్లో వృద్ధులు, వారితోపాటు పిల్లలు మాత్రమే. చాలా ఇళ్లకు తాళాలే కన్పిస్తున్నాయి. ఇక ఏఏ మండలంలో ఎన్ని కుటుంబాలు వలస వెళ్లాయన్నదానిపై ప్రభుత్వం వద్ద లెక్కల్లేవు.
రోజూ ఐదు బస్సుల్లో రాకపోకలు..
చాలా మండల కేంద్రాల్లోంచి ఆర్టీసీ వలస వెళ్లేవారి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. కుల్కచర,్ల గండేడ్ నుంచి రోజు ఐదు బస్సులు పరిగి, మహ బూబ్‌నగర్, నారాయణపేట డిపోల నుంచి నడుస్తున్నాయి. ఎన్నికలు, గిరిజనులుచేసే తుల్జాభవానీ పండుగల సమయాల్లోనే పూర్తిస్థాయిలో గిరిజన కుటుంబాలు ఇక్కడకు చేరుకుంటాయి.
వీళ్ల వివరాలు నమోదు చేయరా?
19వ తేదీన నిర్వహించే సర్వేలో వలస వెళ్లిన కుటుంబాల వివరాల నమోదు కష్టంగానే కన్పిస్తోంది. జిల్లాలోని 10 మండలాల్లో కలిపి సుమారు మూడు లక్షల మంది వివరాలు ఎలా సేకరిస్తారన్నది ప్రశ్నార్థకం. గతంలో మాదిరిగానే సర్వేకు వచ్చే అధికారులు ‘డోర్‌లాక్’ అని రాసుకుని వెళ్తారేమో చూడాలి.
అందరికీ సమాచారమివ్వడం కష్టమే..!
సర్వే నిర్వహణకు ఇంకా 11 రోజులే ఉంది. వలస వెళ్లిన వారిలో ఎక్కువ మంది భవన నిర్మాణ కూలీలు, మట్టి పనులు చేసేవారు, మేస్త్రీలు. వీరంతా కుటుంబాలతో కలిసి విడిగా వెళ్తారు కనుక సమాచారం ఇవ్వడం కష్టంగానే ఉంటోంది. ఎన్నికల సమయంలో అయితే పోటీలో ఉన్న రాజకీయ నాయకులు సొంత ఖర్చుతో ఇక్కడికి రప్పిస్తారు. స్పెషల్‌గా బస్సులు పెట్టి మరీ తీసుకొస్తారు. కానీ ఇప్పుడు సర్వేచేస్తున్న ప్రభుత్వం అలాంటి మార్గాలను ఏమైనా అన్వేషిస్తుందేమో చూడాలి.
వలస లెక్క తేలేదెలా?
Published Fri, Aug 8 2014 12:38 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement