మార్కెట్‌కు రాకుండానే ఇతర జిల్లాలకు తరలింపు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు
పట్టించుకోని అధికారులు
కుల్కచర్ల: మండలంలో జీరో దందా జో రుగా సాగుతోంది. మార్కెట్‌కు రాకుం డా లక్షల రూపాయల విలువైన ధాన్యం గుట్టుచప్పుడు కాకుండా మహబూబ్‌నగర్ జిల్లాకు తరలుతోంది. కుల్కచర్ల మార్కెట్‌కు కమిటీ లేకపోవడం.. పరిగి మార్కెట్‌కు అనుసంధానంగా ఉండడంతో పట్టించుకొనేవారు లేకుండా పోయారు. దీంతో జీరో దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. మండల కేంద్రానికి 24 కి.మీ దూరంలో ఉన్న మరికల్‌లో ఎలాంటి అనుమతి లేకుండా మినీ మార్కెట్ కొనసాగుతోంది. అక్కడ ఉన్న దళారులు, వ్యాపారులు రైతులు పండించిన పంటను కుల్కచర్ల మార్కెట్‌కు రాకుండా అక్కడే అక్కడే కొని మహబూబ్‌నగర్ జిల్లాకు తరలిస్తున్నారు.
మండల కేంద్రంలో ప్రతి బుధవారం మార్కెట్ కొనసాగుతుంది. ఈ మార్కెట్‌కు కుల్కచర్ల, గండేడ్ మండలాల నుంచి రైతులు ధ్యానం తీసుకువస్తారు. మండలంలోని మరికల్, ముజాహిద్‌పూర్, బండవెల్కిచర్ల, పుట్టపహాడ్, చౌడపూర్ గ్రామాల్లో కొందరు వ్యాపారులు అక్కడే మార్కెట్‌లు ఏర్పాటు చేశారు. రైతులకు మాయమాటలు చెప్పి ధాన్యాన్ని మార్కెట్‌కు రాకుండా చేస్తున్నారు.
మార్కెట్‌కు వెళ్తే రవాణా, హమాలీ, దడువాయి ఖర్చులు అవుతాయని చెబుతూ అక్కడే తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కుల్కచర్ల మార్కెట్‌కు తరలించకుండా మార్కెట్ ఫీజు లేకుండా, వే బిల్లులు లేకుండా ఇతర జిల్లాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు 20 నుంచి 25 లారీల వరకు మొక్కజొన్న, వరి ధాన్యాన్ని తరలిస్తున్నారు. దీంతో ప్రతి వారం మార్కెట్‌కు వేలల్లో నష్టం జరుగుతోంది.
తూకాల్లో మోసాలు
ధాన్యం తక్కువ ధరకే తీసుకోవడం కాకుండా తూకాల్లో కూడా పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. క్వింటాలుకు 5 కిలోలు తక్కువ అవుతున్నాయని, ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా అందామంటే అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వరని ఏమి అనలేక పోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా మార్కెట్ కమిటీ అధికారులు, విజిలెన్స్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
జోరుగా జీరో దందా
Published Thu, Nov 26 2015 1:29 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement