దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి హాస్టల్ నుంచి బయలుదేరిన ఓ విద్యార్థి కనిపించకుండాపోయాడు.
కుల్కచర్ల (మహబూబ్‌నగర్) : దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి హాస్టల్ నుంచి బయలుదేరిన ఓ విద్యార్థి కనిపించకుండాపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళ్తే.. కుల్కచర్ల మండలం పిరంపల్లి గ్రామం బోట్యానాయక్ తండాకు చెందిన శంకర్, బుజ్జిబాయిల కుమారుడు రాజు(13) ముజాహిద్‌పూర్ గిరిజన వసతి గృహంలో ఉంటూ అక్కడి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. శంకర్ కొద్ది రోజుల క్రితం ఆనారోగ్యంతో మృతి చెందాడు.
బుజ్జిబాయి స్థానికంగా ఉపాధిలేక పూణేలో భవన నిర్మాణం పనులు చేసేందుకు వెళ్లింది. అయితే ఈ నెల 10 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో 11న ఆదివారం తల్లి దగ్గరకు పూణే వెళ్తానంటూ కుల్కచర్ల నుంచి బయలుదేరాడు. కానీ పూణేకు వెళ్లలేదు. స్థానికంగా ఎవరికీ కనిపించలేదు. ఈ విషయం తల్లికి తెలియజేయడంతో ఆమె పూణే నుంచి గ్రామానికి వచ్చింది. రెండు రోజులుగా బంధువులు, తెలిసిన వారి దగ్గర వాకబు చేసింది. ఎక్కడా ఆచూకీ లేకపోవటంతో బుజ్జిబాయి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.