కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో కలిపి సుమారు 150 వరకు గిరిజన తండాలు ఉన్నాయి. ఈ తండాల్లో సుమారు 35వేల వరకు ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో బతుకుదెరువు నిమిత్తం పుణే, ముంబై తదితర పట్టణాలకు 60శాతం మందికి పైగా వలస వెళ్లారు. నిత్యం కుల్కచర్ల, గండేడ్ మండలాల నుంచి పరిగి, మహబూబ్‌నగర్, తాండూరు డిపోల ఆర్టీసీ బస్సులు ముంబై, పుణేలకు రద్దీగా వెళ్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జీవిత కాలమంతా ..
బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లిన గిరిజనులు యేడాదిలో ఎనిమిది నెలలు అక్కడే పనులు చేసుకుంటున్నారు. నాలుగు నెలలు మాత్రం తిరిగివచ్చి తమ కుటుంబాలు, వ్యవసాయాన్ని చూసుకుని వెళ్తున్నారు. తిండి గింజలు ఇంట్లోవేసి, పిల్లల్ని పెద్దల దగ్గర ఉంచి తిరిగి పట్టణాలకు పయనమవుతారు. ఇంటిదగ్గర ఉన్న వృద్ధులపైనే అధిక భారం పడడంతో కాయాకష్టం చేసి, కట్టెలు అమ్ముకుని పిల్లల్ని కాపాడుకుంటున్నారు.
పడని అడ్డుకట్ట..
వలసల నిరోధానికి ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. అవగాహనా లోపమో, లేక ఇక్కడ లభిస్తున్న ఉపాధి కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదన్న కారణమో గానీ వలసలు మాత్రం ఆగడం లేదు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులతో ఆయా తండాల్లో మరింత పెరిగాయి. కూతుళ్ల పెళ్లికని చేసిన అప్పు తీర్చేందుకు కొందరు, తల్లిదండ్రుల ఆరోగ్యం నిమిత్తం ఉన్నదంతా ఖర్చు చేసి తిరిగి సంపాదించుకునేందుకు మరికొందరు, తాముపడిన కష్టం పిల్లలు పడకూడదని వారిని బాగా చూసుకునేందుకు కాస్తోకూస్తో కూడబెట్టాలనే తాపత్రయంతో ఇంకొందరు.. ఇలా గ్రామాలను విడిచి వెళ్తున్నారు.
భరోసా ఇవ్వన్ని ‘ఉపాధి’
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం గిరిజనులకు భరోసా కల్పించలేకపోతోంది. నెలలు గడిచినా చేసిన పనికి కూలీ డబ్బులు చేతికందకపోవడంతో దీనికన్నా వలసబతుకు లే మేలని అటువైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం కల్పిం చే ఉపాధికన్నా ముంబై, పుణేల్లో చేసే కూలీ పనులకే ఎక్కువ గిట్టుబాటవుతోందని అంటున్నారు. చేసిన పనికి వారంరోజుల్లో కూలీ డబ్బులు చెల్లిస్తే, ఉన్న ఉపాధిని నిరుపేద రైతుల వ్యవసాయానికి అనుబంధం చేస్తే కొంతవరకు వలసలను నిరోధించవచ్చని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే..
మారుమూల గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే సంక్షేమ నిధులు వస్తాయని, వాటితో అభివృద్ధితోపాటు స్థానికులకు ఉపాధి దొరుకుతుందని గిరిజనులు పేర్కొంటున్నారు. అప్పుడు ఇక్కడే ఉండి తమ పిల్లల బాగోగులు, చదువులు కూడా చూసుకునే అవకాశం ఉంటుందంటున్నారు.
గడవని పూట.. వలసబాట
Published Thu, Nov 27 2014 11:19 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement