వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు కుల్కచర్ల మండల పరిధిలోని గ్రామాల ప్రజలను వణికిస్తున్నాయి.
కుల్కచర్ల, న్యూస్‌లైన్: వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు కుల్కచర్ల మండల పరిధిలోని గ్రామాల ప్రజలను వణికిస్తున్నాయి. నెలన్నర వ్యవధిలోనే ఐదు హత్య కేసులు, రెండు అత్యాచారం కేసులు నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరుసగా జరుగుతున్న నేరాలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు ఎప్పుడేం జరుగుతుందోనని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బండవెల్కిచర్ల కేసులో పోలీసులు తలమునకలై ఉన్నారు. ఉన్నతస్థాయి అధికారులు ఈ కేసు విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇద్దరిని తీసుకువచ్చి విచారించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు బయటికి మాత్రం చెప్పడం లేదు. ఒకటి రెండు రోజుల్లో కేసును ఛేదిస్తామని సీఐ వేణుగోపాల్‌రెడ్డి చెబుతున్నారు.
ఇవీ సంఘటనలు...
గతనెల 8న మండల పరిధిలోని విఠలాపూర్ గ్రామంలో పాతకక్షల నేపథ్యంలో పొలం దగ్గర మహిళను హత్య చేసి చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో ఎనిమిది రోజుల తర్వాత పోలీసులు నిందితులను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు.
గతనెల 20న కుల్కచర్లకు చెందిన వడ్డె చంద్రమ్మను దాయాదుల్లో ఒకరైన రాములు హత్య చేశాడు. ఈ కేసులో రాములును రిమాండ్‌కు తరలించారు.
గతనెల 25న కుల్కచర్లకు చెందిన హరిజన్ నర్సయ్యను అతనితో సహవాసం చేస్తున్న మహిళ రాయితో తలపై కొట్టి హత్య చేసింది. ఈ కేసులో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఈ నెల 3న పటెల్‌చెరువు తండాలో భార్యపై భర్త, కుటుంబ సభ్యులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈనెల 6న మండల పరిధిలోని బండవెల్కిచర్లలో గుర్తుతెలియని మహిళను తాడుతో ఉరివేసి, గ్రామం నడిబొడ్డున పెట్రోల్ పోసి ఆనవాలు లేకుండా నిప్పంటించి హత్య చేశారు. 15 రోజులైనా ఈ కేసును పోలీసులు ఛేదించలేదు. కనీసం హత్యకు గురైన మహిళ వివరాలు కూడా తెలియ రాలేదు.
ఈనెల 17న ఈర్లవాగు తండాకు చెందిన గిరిజన మహిళపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు రాత్రి పగలు కష్టపడి నిందితులను పట్టుకుని రిమాండ్‌కు పంపించారు.
ఘణపూర్‌లోనూ ఇటీవల ఓ అత్యాచారం కేసు నమోదైనట్లు తెలిసింది.