* సీఎం కేసీఆర్ వెల్లడి
* ప్యాకేజీతో పునరావాసం
* నిబంధనలు సవరించి సాయం
* ప్రాణహిత-చేవెళ్లకు కౌన్సిల్ ఆమోదం
* తండాలను పంచాయతీలుగా మార్పుపై మరోమారు భేటీ
సాక్షి, హైదరాబాద్: నీటిప్రాజెక్టులు,ఇతర అభివృద్ధిపనుల వల్ల నిర్వాసితులయ్యే గిరిజనులకు దేశంలో ఏ రాష్ట్రమూ ఇవ్వనంత మంచి పునరావాస ప్యాకేజీని అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. శనివారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన గిరిజన సల హామండలి సమావేశం జరిగింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఈ సమావేశంలో మండలి ఆమోదం తెలిపింది. భూమిని పూర్తిగా కోల్పోయిన గిరిజనులను బాధితులుగా భావించాలని సీఎం చెప్పారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే వారి వివరాలను నోటిఫై చేయాలని, గిరిజన ప్రజాప్రతినిధులకూ వివరాలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ధర లక్ష ఉంటే నాలుగు లక్షల పరిహారం...
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే గిరిజనులకు రిజిస్ట్రేషన్ విలువ కన్నా ఎక్కువ నష్టపరిహారాన్ని, ఎకరా భూమి ధర రూ. లక్ష ఉంటే రూ. నాలుగు లక్షల పరిహారం అందుతుందని సీఎం చెప్పారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని మేలైన ప్యాకేజీని ఇస్తామని తెలిపారు. ఎస్టీలకు ఇచ్చే పునరావాస ప్యాకేజీ విషయంలో ప్రజా ప్రతి నిధులు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వివరాలను అధికారులు సీఎంకు తెలియజేశారు.
అక్షరాస్యతపై అధ్యయనం..
గిరిజనుల అక్షరాస్యతాశాతం పెరగకపోవడానికి కారణాలు, ఆ ప్రాంతాల్లో విద్యాసంస్థల పరిస్థితి ఏమిటి , ఖాళీలు ఎన్ని ఉన్నాయి, తదితర అంశాలను వెంటనే అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ర్టంలోని ఎస్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల పరిస్థితిపై కూడా నివేదికను సమర్పించాలన్నారు.
ట్రైబల్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్..
ఎస్సీ పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన డిక్కి తరహాలో ఎస్టీ పారిశ్రామికవేత్తలు కూడా ట్రైబల్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటున్నదని సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుకోడానికి గిరిజన పారిశ్రామికవేత్తలు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారులు విద్యాసాగరరావు, రామలక్ష్మణ్, ఎంపీలు కె.కేశవరావు, అజ్మీరా సీతారాంనాయక్, జి.నగేశ్, ఎమ్మెల్యేలు అజ్మీరా చందూలాల్, అజ్మీరా రేఖానాయక్, కోవా లక్ష్మి, రాథోడ్ బాబురావు, బానోతు శంకర్, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, డీఎస్.రెడ్యానాయక్, కోరం కనకయ్య, బానోతు మదన్‌లాల్, సున్నం రాజయ్య, రవీంద్రకుమార్ రమావత్, ఎమ్మెల్సీ రాములునాయక్, ఉన్నతాధికారులు ఎస్‌కేజోషి, టి.రాధ, సోమేశ్‌కుమార్, శ్రీదేవి, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.
బాబూ.. కేసీఆర్‌లా మేలు చేయండి
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న గిరిజనులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను.. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురువుతున్న ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన సలహా మండలి సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తండాలు, గూడేలు పంచాయతీలుగా మారుస్తాం..
గిరిజనతండాలు, ఆదివాసీ గూడేలను గ్రామపంచాయతీలుగా మార్చే విషయంలోనూ చర్చ జరిగింది. ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నామని, విధివిధానాలను రూపొందించాల్సి ఉందని సీఎం అన్నారు. గ్రామానికి మూడు కిలోమీటర్ల అవతల ఉన్న తండాలను కలుపుతూ ప్రత్యేక గ్రామపంచాయతీలు ఏర్పాటుచేయాలని పలువురు ప్రజాప్రతినిధులు సూచించారు. 500 జనాభా ఉంటేనే గ్రామపంచాయతీ అనే నిబంధనకు కట్టుబడకుండా, దగ్గర్లో ఉన్న రెండు,మూడు తండాలను కలిపి ఒకే పంచాయతీ చేస్తే సరిపోతుందని వారు చెప్పారు. అదే విధంగా 500 లోపు జనాభా ఉన్నప్పటికీ, మిగతా జనావాసాలకు దూరంగా ఉంటే వాటిని కూడా ప్రత్యేక గ్రామపంచాయతీలుగా చేయాల్సిందేనని కొందరు సూచించారు. మరోసారి ఎస్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమై విధివిధానాలను ఖరారు చేస్తామని సీఎం తెలిపారు.
గిరిజనులకు నాలుగు రెట్ల పరిహారం
Published Sun, Oct 19 2014 2:31 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement