సాక్షి, సిటీబ్యూరో :వాళ్లు క్లోజ్ ఫ్రెండ్స్.. ఎంత మంచి స్నేహితులంటే ఏ దేశంలో ఉన్నా ఏటా తప్పనిసరిగా ఒక రోజున కలిసేంత. సమాజానికి ఏదో మంచి చేయాలనే తపన ఉన్న స్నే‘హితులు’. తీయటి తమ స్నేహాన్ని పరిపుష్టం చేసుకుంటున్న వీరంతా సమాజానికి తీపి బహుమతి ఇస్తున్నారు. ‘హ్యాపీ బార్’ పేరుతో వీరు సృష్టించిన ఓ చాక్లెట్ ఆరోగ్యార్థులకు బహుమతి మాత్రమే కాదు ఆపన్నులకు ఆసరా కూడా.
‘‘మేం మొత్తం 15 మంది స్నేహితులం. చదువు పూర్తయ్యాక యూకే, ఆస్ట్రేలియా, అమెరికా.. ఇలా పలు దేశాల్లో స్థిరపడ్డాం. అయితే మా స్నేహాన్ని చిరకాలం వర్థిల్లేలా చేసుకునేందుకు ప్రతి డిసెంబర్‌లో ఒక ప్లేస్ అనుకుని తప్పకుండా కలిసేవాళ్లం. ఆ క్రమంలోనే ఎవరికి వారుగా చారిటీ యాక్టివిటీస్ చేస్తున్నా, మేం అంతా కలిసి ఏదైనా సంయుక్తంగా చేద్దామనుకున్నాం. అందులో భాగంగా సమాజంలో ఎవరూ అంతగా పట్టించుకోని ఓ కమ్యూనిటీని ఎంచుకుని సాయం చేయాలనే ఆలోచన చేశాం. అప్పుడే మాకు గుర్తొచ్చింది వాచ్‌మెన్ కమ్యూనిటీ’’ అని చెప్పారు మహేష్.
భవనాలు భళా.. కాపలా వెలవెల
నగరాల్లో ఇంటికి కాపలా కాసే వాచ్‌మెన్‌ల జీవితాలు గమనిస్తే చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఖరీదైన అపార్ట్‌మెంట్స్, కాలనీల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే వాచ్‌మెన్‌లు కుటుంబ సమేతంగా నివసిస్తుంటారు. చాలా వరకూ అపార్ట్‌మెంట్స్‌లో మెట్లకిందే వీరి జీవనం. ఖరీదైన భవనాలు, ఆకాశహరŠామ్యల్లో ఉంటున్నా సరైన తిండీ, వసతి, పిల్లల చదువుకు నోచుకోని విచిత్రమైన పరిస్థితి వీరిది.
ఆర్గానిక్ పద్ధతుల్లో చాక్లెట్ తయారీ
వ్యక్తిగతంగా వీరికి సాయం అందించడం అలవాటైన ఈ స్నేహితుల చర్చల్లో తరచూ వీరి గురించి ప్రస్తావన వచ్చేది. అలా అలా అది ఒక ప్రత్యేకమైన చారిటీ కార్యక్రమంగా అవతరించింది. ఈ వాచ్‌మెన్ కమ్యూనిటీకి ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడంతో మొదలుపెట్టి అంతకు మించి ఏదైనా చేయాలని మిత్రబృందం సంకల్పించింది. అందుకోసం ఒక చాక్లెట్‌కి రూపకల్పన చేశారు. అదే హ్యాపీ బార్. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతుల్లో తయారైన ఈ చాక్లెట్‌ను విక్రయించడం ద్వారా వచ్చే లాభాలను తమ చారిటీకి ఉపయోగిస్తామని ఈ మిత్రబృందం ప్రతినిధి మహేష్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment