ఓయ్! nజాయ్..
వావ్... సంభ్రమాశ్చర్యం.. సర్‘ప్రైజ్’కోసం.. బహుమతి చేతికందితే ఆనందం. అది ఊహించని సమయంలో అందితే ఆశ్చర్యం. ఊహించని గిఫ్ట్ ఊహించని రీతిలో ఊడిపడితే.. ఇక ఆనందాశ్చర్యాలకు అంతేముంటుంది? అలాంటి ఆనందాశ్చర్యాలను మనకు అందించిన వ్యక్తి మీద కలిగే ఇష్టానికి హద్దేముంటుంది? నచ్చినవారికి ఇలాంటి సర్‌ప్రైజ్ అందించాలని, వారి నుంచి అంతటి ఇష్టాన్ని రిటర్న్ గిఫ్ట్‌గా అందుకోవాలని అందరికీ ఉంటుంది. కాని ఎలా? ఈ ప్రశ్నకు సమాధానంగా నగరంలో కొత్త వేదికలు ప్రారంభమయ్యాయి. సరికొత్త ట్రెండ్‌కు దారితీస్తున్నాయి. అందరికీ సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నాయి.
ప్రత్యూష
మనం ఎందుకు బిజీగా ఉంటున్నాం. సంతోషంగా ఉండడానికే కదా. మనం సంపాదించిన మనీతో ఆనందాలను అందుకోవాలనే కదా. దీన్నుంచే ఓ ఐడియా పుట్టుకొచ్చింది. ఆశ్చర్యాలను అందించడం ద్వారా ముఖాల్లో నవ్వులు విరబూయించడం, సంతోషాన్ని కలిగించడం... ఈ రెండు లక్ష్యాలతో కొన్ని సంస్థలు మొదలయ్యాయి.
ఎలా చేస్తారు?
మీ కుటుంబ సభ్యుల్ని, సన్నిహితుల్ని.. ఆశ్చర్య చకితుల్ని చేయడం ద్వారా సంతోషాన్ని అందించాలనుకుంటే.. దానికి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం వంటి ఏదైనా సందర్భం కూడా తోడైతే... మన తరఫున ఆయా సంస్థలవారు రంగంలోకి దిగుతారు. మన ఆకాంక్షల్ని బట్టి... ప్రియమైన వ్యక్తి ఊహలకు ఏమాత్రం అందని రీతిలో సర్‌ప్రైజ్‌లు ఆర్గైనె జ్ చేస్తారు. దీనికి సంబంధించి ఆ వ్యక్తి గురించిన కొన్ని వివరాలు, ఇష్టాఇష్టాలు మాత్రం మనం వారికి చెప్పాల్సి ఉంటుంది.
అభిరుచులే ‘కీ’లకం...
మనం ఎవరినైతే సర్‌ప్రైజ్ చేయాలనుకున్నామో... వారి అభిరుచులే ఈ యావత్తు ప్రోగ్రాం డిజైనింగ్‌కి మూలంగా నిలుస్తాయి. ఉదాహరణకు ఓ పెళ్లయిన జంట ఫుడ్‌లవర్స్ అనుకోండి... వారికి రాజసం ఒలికించే వెయిటర్స్‌తో అంతర్జాతీయ రుచులన్నింటినీ పళ్లెంలో ఆతిథ్యం అందుతుంది. అయితే అది కూడా అనూహ్యమైన రీతిలో, అనుకోని ప్రదేశంలోనే సుమా. ఈ సర్‌ప్రైజ్ యాక్టివిటీలో వ్యక్తులకు అందించే గిఫ్ట్ విలువ కన్నా ఆశ్చర్యం కలిగించే స్థాయికే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆశ్చర్యం ద్వారా వచ్చే ఆనందం చిరకాలం నిలిచి ఉంటుందని, మధురానుభూతిగా మిగిలిపోతుందని ఆయా సంస్థల నిర్వాహకులకు తెలుసు.
కాదేదీ... ఆశ్చర్యానికి అనర్హం
కెల్విన్-హాబీస్ కామిక్‌స్ట్రిప్ కావచ్చు, సగం వాక్యం రాసి ఉన్న ఓ టిష్యూ కాగితపు ముక్క కావచ్చు. ఆశ్చర్యం పుట్టించడానికి అన్నీ కారకాలే. ఔత్సాహిక రచయితల కోసం అనూహ్యమైన బుక్ లాంచ్ ప్రోగ్రామ్‌లు, మ్యూజిక్ లవర్స్ కోసం ప్రత్యేకమైన రికార్డెడ్ రేడియో షోస్.. ఇలా కస్టమర్ ఆకాంక్షలకు నప్పే విధంగా క్రియేటివిటీని కదం తొక్కించడంలో, కంటెంట్‌ను డిజైన్ చేయడంలో టీమ్‌లు నిరంతరం మునిగి తేలుతుంటాయి. సంస్థల నిర్వాహకులు కూడా తమ హోదాలను.. ఛీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్, చీఫ్ ట్రబుల్ మేకర్‌గా విభజించుకున్నారు.
ఫ్లయిట్ దిగగానే... వావ్ అనిపిస్తాం...
చాలా కాలం తర్వాత తమకు ఆత్మీయుడైన వ్యక్తిని కలుస్తున్న సందర్భాన్ని సర్‌ప్రైజింగ్‌గా నిర్వహించి, ఆ ఆశ్చర్యానందాలను మరచిపోలేని అద్భుతమైన మధురజ్ఞాపకాలుగా నిలిచిపోయేలా చేయడమే మా సంస్థ ఉద్దేశం. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ మధ్యే మా సర్‌ప్రైజ్ స్టోర్ ప్రారంభించాం.
- హర్ష, వరుణ్
- ఓయ్ హ్యాపీ నిర్వాహకులు