వర్క్ టు రూల్!
- నేటినుంచి రెవెన్యూ ఉద్యోగుల ఉద్యమబాట
- 13 వరకు కొనసాగిస్తామని యూనియన్ నేతల స్పష్టీకరణ
మహబూబ్‌నగర్ టౌన్: ఇన్నాళ్లూ ప్రభుత్వానికి బాసటగా నిలిచిన ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు పోరుకు సిద్ధమవుతున్నారు. ఉద్యమపార్టీ అధికారంలోకి వచ్చిందని సంబరపడిన ఉద్యోగులు నిరసనలకు దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏడాదిగా తమకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోగా కనీస సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపిస్తూ రెవెన్యూశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు వీఆర్వో నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు సోమవారం నుంచి ‘వర్క్ టు రూల్’ను పాటించనున్నారు.
రెవెన్యూశాఖలోని అన్ని యూనియన్లు తమ పూర్తిమద్దతు ప్రకటించడంతో సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈనెల 13వ తేదీ వరకు నిరసనలు కొనసాగించిన అనంతరం సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ తరువాత కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని యూనియన్ నేతలు ప్రకటిస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
- డిపార్ట్‌మెంటల్ పదోన్నతులు కల్పించాలి. గతేడాది ఆగస్టులో నిర్వహించని కారణంగా దాదాపు పదిమంది అధికారులు పదోన్నతులు రాకుండానే పదవీవిరమణ పొందారు.
- రెవెన్యూశాఖలో ఖాళీపోస్టులను భర్తీచేసి అధికారులు సిబ్బందిపై పనిభారం తగ్గించాలి.
- వీఆర్‌ఏలకు కనీస వేతనం రూ.6నుంచి రూ.13వేలకు పెంచాలి. 10వ పీఆర్‌సీలో ప్రభుత్వం సూచించిన ప్రకారం ఇవ్వాలి. 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలి.
-పెద్ద మండలాల్లో రూరల్, అర్బన్ రెండు తహశీల్దార్ కార్యాలయాలను ఏర్పాటుచేయాలి.
- వాహనాల బడ్జెట్ రూ.17వేల నుంచి రూ.24వేలు పెంచుతూ వచ్చిన జీఓను అమలుచేయాలి. ప్రొటోకాల్‌కు అదనపుబడ్జెట్ ఇవ్వాలి.
- ప్రతి మండలానికి ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఒక స్వీపర్, ఒక రికార్డ్ అసిస్టెంట్, ఒక వాచ్‌మెన్ పోస్టులను మంజూరుచేయాలి.
స్పందించేంత వరకు కొనసాగిస్తాం
- రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వహిస్తున్న తీరు సరైందికాదు. వాటిని పరి ష్కరించుకునేందుకు చేపడుతున్న వర్క్‌టు రూల్‌పై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేదంటే స్పందించేంత వరకు కొనసాగిస్తాం.
- బక్క శ్రీనివాసులు,
రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి
రెవెన్యూశాఖ పట్ల నిర్లక్ష్యం తగదు
రెవెన్యూశాఖలో పనిచేస్తోన్న ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదు. అన్ని సర్వేలను రెవెన్యూ శాఖపై వేసే ప్రభుత్వం సమస్యలపై కూడా శ్రద్ధచూపాలి.
-అమరేందర్,
తహశీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు