మద్యం షాపులకు 'ఫుల్లు' గిరాకీ!
2,046 షాపులకు 21,238 దరఖాస్తులు
176 షాపులకు దరఖాస్తులు నిల్
గ్రేటర్ పరిధిలో 116 షాపులకు రాని దరఖాస్తులు
లెసైన్స్ ఫీజు రూ. 1.04 కోట్ల నుంచి
రూ. 90 లక్షలకు తగ్గించినా కానరాని స్పందనలు
దరఖాస్తులతోనే ఎక్సైజ్‌శాఖకు రూ. 53 కోట్ల ఆదాయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం వ్యాపారులు ఎగబడ్డారు. పది జిల్లాల్లోని 2,216 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ఈనెల 14న నోటిఫికేషన్ జారీ చేసింది. గడువు ముగిసిన శనివారం నాటికి 2,046 దుకాణాలకు 21,238 దరఖాస్తులు వచ్చాయి. 176 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లెసైన్స్ ఫీజును 1.04కోట్ల నుంచి రూ. 90 లక్షలకు తగ్గించినా మద్యం వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఖమ్మం జిల్లాలో 147 మద్యం దుకాణాలు ఉండగా, 142 షాపులకు మాత్రమే దరఖాస్తులు వచ్చినప్పటికీ, రాష్ట్రంలోనే అత్యధికంగా 3,837 మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రమే అన్ని షాపులకు దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ 294 దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేస్తే, మొత్తం షాపులకు కలిపి 2,022 దరఖాస్తులొచ్చాయి. అతి తక్కువగా హైదరాబాద్ జిల్లాలో 212 దుకాణాల్లో 161 షాపులకు 312 దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్‌లోని 116 దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. దరఖాస్తు ఫీజు రూ. 25 వేలు కాగా, ఎక్సైజ్‌శాఖకు దరఖాస్తుల రూపంలో రూ. 53.09 కోట్ల ఆదాయం సమకూరింది.
గ్రేటర్‌పై ఆసక్తిచూపని వ్యాపారులు
గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 మునిసిపల్ డివిజన్‌ల పరిధిలో ఎక్సైజ్ శాఖ లెసైన్స్ ఫీజును గతంలో ఉన్న రూ. 1.04 కోట్ల నుంచి రూ. 90 లక్షలకు తగ్గించి నోటిఫికేషన్ జారీ చేసింది. అయినా మద్యం వ్యాపారులు ఈ షాపులను పొందేందుకు ముందుకు రాలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోని 150 మునిసిపల్ డివిజన్‌లలో 503 దుకాణాలు ఉండగా, 116 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. హెదరాబాద్ జిల్లా పరిధిలోని 212 దుకాణాలకు గాను 161 షాపులకే దరఖాస్తులు వచ్చాయి. అలాగే మెదక్ జిల్లాలో 15 దుకాణాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండగా, ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. పటాన్‌చెరు వంటి పారిశ్రామిక ప్రాంతంలోని 13 షాపులకు ఒక్కదానికి కూడా వ్యాపారులు దరఖాస్తులు చేసుకోలేదు. రూ. 90 లక్షల లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్ల విలువైన మద్యాన్ని మాత్రమే అమ్మాల్సి రావడం, ఆ తరువాత జరిగే అమ్మకాలకు 13.06 శాతం ప్రివిలేజ్ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొనడంతో వ్యాపారులు ముందుకు రాలేదు. రంగారెడ్డి జిల్లాలో కూడా 390 దుకాణాలకు గాను గ్రేటర్ పరిధిలోని సుమారు 50 దుకాణాలను ఎవరూ కోరుకోలేదు.
కేటాయింపుల కోసం నేడు డ్రా
రాష్ట్రంలోని 10 జిల్లాల్లో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ సోమవారం జరుగనుంది. వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల సమక్షంలో ఎక్సైజ్ శాఖ అధికారులు లక్కీ డ్రా తీస్తారు. ఒక్క దరఖాస్తు మాత్రమే దాఖలైన చోట వారికే కేటాయించడం జరుగుతుంది. డ్రాలో దుకాణాన్ని దక్కించుకున్న వ్యాపారి లెసైన్స్‌ఫీజులో మూడో వంతు మొత్తాన్ని డీడీ లేదా చలాన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. పర్మిట్ రూం ఫీజు రూ. 2 లక్షలు కూడా చెల్లించాల్సిందే.