
ఓటమికి పూర్తి బాధ్యత ఢిల్లీ పెద్దలదే
వ్యూహం, ప్రచారం వారిదే.. అభ్యర్థుల ఎంపిక వారిష్టమే.. మాకు విలువేది?: టీ కాంగ్రెస్ నేతల ఆవేదన
హైదరాబాద్: ‘అవును మొత్తం మీరే చేశారు.. మాకేం కావాలో మీరే సెలెక్ట్ చేస్తారు. మళ్లీ మీరే సూపర్ అంటారు. మేమేదో ఆడాలనుకుంటే.. అలా ఆడు, ఇలా ఆడు.. అంటూ మా ఆట కూడా మీరే ఆడతారు. జనం మమ్మల్ని చూసి నవ్వుతున్నారు.. మేం కోల్పోయింది ఇక చాలు.’ బొమ్మరిల్లు సినిమాలో తండ్రి ప్రకాశ్‌రాజ్‌తో హీరో సిద్ధార్థ డైలాగ్ ఇది.
‘నేనేం తప్పు చేశాను. మీరు సంతోషంగా ఉండాలని కోరుకోవడం నేను చేసిన తప్పా? మీకు గొప్ప లైఫ్ ఇవ్వాలనుకోవడం తప్పా?..’ సిద్ధార్థకు ప్రకాశ్‌రాజ్ ప్రశ్న ఇది.
ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ నేతలిప్పుడు ఇదే డైలాగులను వల్లె వేస్తున్నారు. తెలంగాణ ఇచ్చినా పార్టీ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని ఢిల్లీ పెద్దలు దీనికంతటికీ తెలంగాణ కాంగ్రెస్ నేతల చేతకానితనమే కారణమంటూ నిందిస్తుండగా, ‘మొత్తం మీరే చేశారు.. మీవల్లే ఓడిపోయాం’ అంటూ టీ కాంగ్ నేతలు మండిపడుతున్నారు. ఓటమికి ఒకరిపై మరొకరు నె పం నెడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్, జైరాం రమేశ్ ఇంతటి దారుణమైన ఫలితాలు వస్తాయని ఊహించలేదని వ్యాఖ్యానించారు. తెలంగా ణ ఇచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టడం లో స్థానిక నాయకత్వం విఫలమైందంటూ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఫలితాల సరళి, ఢిల్లీ పెద్దల తీరుపై టీ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఫలి తాలు వెలువడిన మరుక్షణం నుంచే ఎవరికి వారే సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ ఓటమికి హైకమాండ్ పెద్దలే కారణమని తేల్చేస్తున్నారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వంటి సీనియర్ నేతలు బాహాటంగానే ఈ విషయం మాట్లాడుతుంటే, చాలామంది నాయకులు అంతర్గత చర్చల్లో ఢిల్లీ పెద్దలవల్లే ఓటమి పాలయ్యామని వాపోతున్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం మొదలు ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఖరారు వరకు అన్నింట్లోనూ హైకమాండ్ జోక్యమే ఎక్కువైందని, చేసేదేమీలేక వారు చెప్పినట్లే నడుచుకున్నామే తప్ప సొంతంగా చేసిందేమీ లేదంటున్నారు. ‘టీ బిల్లులో ఏం ఉండాలో, చివరకు తెలంగాణ ప్రజల వద్దకు ఎలావెళ్లాలనే విషయంలో మా మాటను ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదు. వాళ్లు చెప్పినట్టే నడుచుకోవాల్సి వచ్చింది. టీపీసీసీ చీఫ్ నియామకంలో మా మాట వినలేదు. తెలంగాణ మేనిఫెస్టోనూ వారే ఖరారు చేశారు. అన్నీ ఢిల్లీపెద్దలే నిర్ణయిస్తే ఫలితాలు ఇట్లా కాక మరెలా ఉంటాయి?’అని మాజీమంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.
హైకమాండ్ తీరుతోనే ఈ దుస్థితి
విభజనలో హైకమాండ్ తీరే ఎన్నికల్లో పార్టీ పతనానికి కారణమైందని పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఒకరు ఆరోపించారు.‘విభజన పేరుతో ఇన్నాళ్లు ఆటలాడుకున్నారు. నిజంగా తెలంగాణ ఇవ్వాలనుకుంటే 2009లోనే ఇచ్చేస్తే ఏ గొడవా ఉండకపోయేది. ఆనాడు రాష్ట్రాన్ని విభజిస్తే ప్రభుత్వం పడిపోతుందేమోనని భయపడ్డారు. ప్రజలేమైనా ఫరవాలేదు, ప్రభుత్వం చివరిదాకా కొనసాగితే మేల ని నాలుగేళ్లు నాన్చారు. ప్రజలతో ఆడుకున్న పాపానికి కాంగ్రెస్ ఫలితం అనుభవిస్తోంది’ అని అభిప్రాయపడ్డారు. ఇటీవల జైపాల్‌రెడ్డి, జానారెడ్డి నివాసాల్లో, పొన్నాల నివాసంలో ఓటమిపై సమీక్ష జరిపారు. హైకమాండ్ పెద్దల తీసుకున్న నిర్ణయాలవల్లే ఓడిపోయామని కొందరు, స్థానిక నేతలే తమను ఓడించారని మరికొందరు వాపోయారు.
టీ నేతల వ ల్లే పరాజయం: ఢిల్లీపెద్దలు
దేశవ్యాప్తంగా మోడీ పవనాలు వీచినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి మాత్రం స్థానిక నాయకుల వైఫల్యమేనని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, కేసీఆర్‌ను ఎదుర్కొనే విషయంలో స్థానిక నేతలు విఫలమవడంవల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపిస్తున్నారు. ‘తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారని, రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణలో 100 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు కాంగ్రెస్‌కు సాధించి పెడతామని ఒత్తిడి తెచ్చారు. సీమాంధ్రలో పార్టీని ఫణంగా పెట్టి మరీ తెలంగాణ ఇచ్చాం. ఇంత చేసినా కాంగ్రెస్‌ను గెలిపించలేకపోయారు. టీ కాంగ్రెస్ నేతల అసమర్థత, నాయకత్వలేమివల్లే పరాజయం ఎదురైంది’ అని రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఢిల్లీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
సోనియాకు నివేదిక: ఇదిలాఉండగా, తెలంగాణలో పార్టీ బాధ్యతలు నెత్తినేసుకున్న జైరాం రమేశ్, కొప్పుల రాజు ఇప్పటికే పార్టీ ఓటమికి దారితీసిన కారణాలపై ప్రాథమిక నివేదిక రూపొందించి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు అందజేసినట్టు తెలిసింది. సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నేపథ్యంలో దేశమంతా పార్టీ ఓటమితోపాటు తెలంగాణలో ఓటమిపై చర్చించనున్నట్టు తెలిసింది.