ఆర్టీసీకి ‘సర్వే’ పండగ
నల్లగొండ అర్బన్ : ఇప్పటికే శ్రావణ మాస శుభకార్యాలు, తీర్థయాత్రల ప్రయాణికుల రద్దీతో మంచి రాబడిబాటలో ప్రయాణిస్తున్న ఆర్టీసీకి సమగ్ర కుటుంబ సర్వే మరింత ఊపు తెచ్చింది. రాజధాని, జిల్లా కేంద్రం నుంచి ప్రజలు సొంతూళ్ల బాట పట్టడంతో రెండు రోజులుగా ఆర్టీసీ బస్సులు జాతర బస్సులను తలపిస్తున్నాయి. సహజంగా ఆదివారం రాకపోకలు తక్కువగా ఉండడం వల్ల నల్లగొండ రీజియన్‌లోని 7 డిపోలలో కలిపి సగటు ఆదాయం రూ. 60లక్షలు ఉంటుంది. కానీ ఈ నెల 17వ తేదీన(ఆదివారం) రూ.80లక్షల ఆదాయం సమకూరింది.
హైదరాబాద్ నుంచి నల్లగొండకు వచ్చే నాన్‌స్టాప్ బస్సులు కిక్కిరిసిపోవడమే కాకుండా టాప్‌పై ప్రయాణించారు. కాగా నల్లగొండ రీజియన్‌లో సగటు ఆదాయం రూ.65 నుంచి రూ.70లక్షలుండగా సోమవారం కోటి రూపాయల దాకా రాబడిని ఆర్జించారు. మంగళవారం కుటుంబ సర్వే జరుగుతున్నా ఉదయం 9గంటల వరకు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. సోమవారం రాత్రి వెళ్లిన నైట్‌హాల్ బస్సులన్నీ మంగళవారం ఉదయం తిరుగు ప్రయాణంలో ఆయా డిపోలకు చేరుకుంటాయి. అంతేకాకుండా సర్వే సిబ్బంది వెళ్లడం కోసం, అత్యవసర పరిస్థితుల్లో ఉండి సొంత గ్రామాలకు చేరుకోలేకపోయిన వారి కోసం ఉదయం 9గంటల వరకు బస్సులు నడిపే యోచనలో ఉన్నారు. అదే విధంగా సర్వే పూర్తయిన తర్వాత ప్రయాణికుల తిరుగు ప్రయాణం కోసం మంగళవారం సాయంత్రం 6గంటల నుంచి రాకపోకలను పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు.
అదనపు బస్సులు నడిపాం :
జాన్‌రెడ్డి, ఇన్‌చార్జ్ రీజినల్ మేనేజర్, నల్లగొండ పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. హైదరాబాద్‌కు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతున్నాం. ఆదివారం 109 ట్రిప్పులు అదనంగా నడిపాం. ఇతర రూట్లలో బస్సులను రద్దుచేసి రాజధానికి, ఇతర ముఖ్య పట్టణాలకు నడుపుతున్నాం. సోమవారం 130 ట్రిప్పులు ఎక్కువగా నడిపాం. సర్వే సందర్భంగా అవసరం మేరకు.. డ్యూటీ కి రిపోర్టు చేసే కార్మికులను బట్టి బస్సులు నడుపుతాం.