ఆ పైసలేవీ? | Funds Delay For HMDA | Sakshi
Sakshi News home page

ఆ పైసలేవీ?

Published Mon, Sep 23 2019 7:42 AM | Last Updated on Mon, Sep 23 2019 7:42 AM

Funds Delay For HMDA - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఔటర్‌రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ప్రాజెక్టుకు సంబంధించి జైకా రుణాల చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) మండిపడింది. 2017–18లో రుణాల చెల్లింపులకు గాను హెచ్‌ఎండీఏకు రూ.235 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించిన  ప్రభుత్వం... కేవలం రూ.130.28 కోట్లే విడుదల చేసిందని పేర్కొంది. మిగిలిన రూ.104.71 కోట్ల నిధులను ఏం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం శోచనీయమంది. ఈ మేరకు కాగ్‌ ఆదివారం నివేదిక విడుదల చేసింది. 2018 సెప్టెంబర్‌ వరకున్న వివరాల ఆధారంగానే ఈ రిపోర్టు సిద్ధం చేశామని తెలిపింది. 2014–15, 2016–17 ఆర్థిక సంవత్సరాల్లోనూ డబ్బులిస్తామని ఏజెండాలు రూపొందించిన ప్రభుత్వం... ఆచరణలోకి మాత్రం తేలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఓఆర్‌ఆర్‌కు ఖర్చు ఇలా...  
హెచ్‌ఎండీఏ సొంత నిధులు రూ.500 కోట్లతో గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు (24.38 కి.మీ) 2005లో పనులు ప్రారంభించి 2011లో పూర్తి చేసింది. ఆ తర్వాత బీఓటి పద్ధతిన నార్సింగ్‌ నుంచి పఠాన్‌చెరు, శామీర్‌పేట నుంచి పెద్దఅంబర్‌పేట (62.30 కి.మీ) వరకు 2011 ఆగస్టులో పనులు పూర్తి చేసింది. అప్పటి నుంచి ప్రతిఏటా బీఓటీ అన్యూటీ పేమెంట్‌ కింద రెండు వాయిదాల్లో రూ.331.38 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లిస్తోంది. అయితే 2022 డిసెంబర్‌తో ఈ చెల్లింపులు పూర్తికావాల్సి ఉంది. అలాగే జైకా రుణాలతో పటాన్‌చెరు నుంచి శామీర్‌పేట, శామీర్‌పేట నుంచి పెద్దఅంబర్‌పేట వరకు (71.32 కి.మీ) రహదారి నిర్మించారు. 2005లో మొదలైన ఈ పనులకు 2016 వరకు దాదాపు రూ.2,300 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించిన జైకా... ఆ తర్వాత నుంచి రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని తీసుకొచ్చింది. అంటే హెచ్‌ఎండీఏ కాంట్రాక్టర్లు చేసిన పనికి డబ్బులు చెల్లించి, ఆ క్‌లైయిమ్‌ బిల్లులను హెచ్‌జీసీఎల్‌ ద్వారా జైకాకు పంపితే అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ద్వారా చెల్లింపులు చేస్తోంది. ఇలా 2016 నుంచి హెచ్‌ఎండీఏ కాంట్రాక్టర్లకు రూ.390 కోట్లు చెల్లించింది. 2020 డిసెంబర్‌ వరకు పూర్తికానున్న ఈ జైకా రుణానికి మరో రూ.70 కోట్లు ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌కు చెల్లించాల్సి ఉంది. అలాగే బీఓటీ పద్ధతిన కాంట్రాక్టర్లకు మరో ఏడు అన్యూటీలు అంటే 2022 డిసెంబర్‌ వరకు రూ.1,159 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ప్రతిఏటా ఓఆర్‌ఆర్‌ జైకా రుణాల చెల్లింపుల కోసం హెచ్‌ఎండీఏ రూ.కోట్లలో ప్రతిపాదనలు పంపిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నిధుల మంజూరులో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాగ్‌ మండిపడింది.  +

రాజ్‌నారాయణ్‌కు గ్లోబల్‌ పీస్‌ అవార్డు
చార్మినార్‌: తెలంగాణ సిటిజన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రాజ్‌నారాయణ్‌ ముదిరాజ్‌కు గ్లోబల్‌ పీస్‌ అవార్డు–2019 దక్కింది. సామాజిక సేవా కార్యాక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఆయనకు చికాగోకు చెందిన అమీర్‌ అలీఖాన్‌ గ్లోబల్‌ పీస్‌ అండ్‌ ట్రస్ట్‌ సంస్థ ఈ అవార్డు అందజేసింది. ఆదివారం నగరంలో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జి.చంద్రయ్య, రిటైర్డ్‌ జడ్జి ఇస్మాయిల్‌ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పాతబస్తీలో 30 ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చేస్తూ రాజ్‌నారాయణ్‌ పేరు తెచ్చుకున్నారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement